Iran: వణికిపోతున్న ఇరాన్...గుడ్డుకు రెక్కలు...కబాబ్కు చుక్కలు
Iran Economic Crisis: పశ్చిమాసియాలో అనిశ్చితి పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా మారిపోతున్నాయి. యుద్ధం చేస్తున్న ఇరాన్ అంతర్గతంగా కరువు కోరల్లో చిక్కుకున్నట్టు అంచనా వేస్తున్నారు.
Iran: వణికిపోతున్న ఇరాన్...గుడ్డుకు రెక్కలు...కబాబ్కు చుక్కలు
Iran Economic Crisis: పశ్చిమాసియాలో అనిశ్చితి పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా మారిపోతున్నాయి. అమెరికాతో యుద్ధం చేస్తున్న ఇరాన్ బయటకు చూసేందుకు గంభీరంగా ఉన్నప్పటికీ...అంతర్గతంగా ఆ దేశం కరువు కోరల్లో చిక్కుకున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణం 112 శాతం పెరగ్గా, వంట నూనెల ధరలు 200 శాతం వరకు పెరిగాయి. అంతేకాదు, ఇరాన్ కరెన్సీ కుప్పకూలిపోయింది. దీంతో సామాన్యుడు ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా భారీగా ఖర్చు చేయవలసి వస్తోంది. యుద్ధం కారణంగా ఆహారం, నీరు, మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
యుద్ధం ముంగిట.. ఆర్థిక సంక్షోభం వెంట!
ఆధునిక కాలంలో యుద్దం అంటే రెండు దేశాల మధ్య మాత్రమే జరిగేది కాదు. అంతర్గతంగా ప్రజల ఎదుర్కొనే బాధలతో కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇరాన్ ఇప్పుడు ఇదే చేస్తున్నది. సరిహద్దుల్లో అమెరికా, ఇజ్రాయిల్ దేశాలతో యుద్ధం ఒకవైపు... దేశంలో ఆకలి కేకలు మరోవైపు. సరిహద్దుల్లో యుద్ధం ముగియకుంటే ఆకలి కేకలు మరింతగా పెరుగుతాయి. ఇప్పుడు ఆ దేశ ప్రజలు ఎదురుచూస్తున్నది యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అనే. అనిశ్చితి పరిస్థితులు, నిత్యం పెరుగుతున్న ధరలు సామాన్య పౌరుడిని ఊపిరి ఆడనివ్వడం లేదు. చమురు ద్వారా వచ్చిన డబ్బ ఫుల్గా ఉంది. మార్కెట్లో వస్తువులు కావలసినన్ని ఉన్నాయి. కానీ, సామాన్యుల చేతిలో డబ్బు లేకపోవడంతో వాటిని కొనే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిని ఆధునిక కరువు అని పిలుస్తారు.
ఆకాశాన్నంటుతున్న ధరలు - ఆవిరవుతున్న ఆదాయం
దేశంలో వస్తువుల ధరలు పెరుగుతున్నాయి....డిమాండ్ పెరుగుతోంది అంటే ఆదాయం కూడా పెరుగుతోందని అర్ధం. చమురు నిల్వలు ఏ దేశంలో ఉంటాయో ఆయా దేశాలు ఆర్థికంగా పుష్టిగా ఉంటాయి. దుబాయ్, యూఏఈ, ఖతర్ వంటి దేశాలు దీనికో ఉదాహరణ. కానీ, ఇరాన్ పరిస్థితులు వేరు. ఇస్లామిక్ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయడంతో ఇక్కడ చమురు నిల్వలు అధికంగా ఉన్నప్పటికీ కావలసినంత ధనం ప్రజలవద్ద లేదు. విదేశాల నుంచి కావలసిన ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు దిగుమతి కావడం లేదు. దీంతో ఆహార పదార్థాల ధరలు ఏకంగా 112 శాతం పెరిగాయి. వంటనూనెల ధరలు 200 శాతం మేర పెరిగాయి. అంతేకాదు, అంత్యక్రియల కోసం చేసే ఖర్చులు కూడా 40శాతం పెరిగినట్టుగా నిపుణులు చెబుతున్నారు.
కళ్ళముందే ఆవిరవుతున్న పొదుపు
దీనంతటికీ కారణం యుద్ధం. ఒకప్పుడు ఇరాన్ రియాల్కు మంచి డిమాండ్ ఉండేది. కానీ, ఇప్పుడు దీని విలువ పాతాళానికి పడిపోయింది. ఒక అమెరికన్ డాలర్ అంటే దాదాపు 16 లక్షల రియాల్స్. ఒక్క డాలర్ విలువచేసే ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే సుమారు 16 లక్షల రియాల్స్ ఖర్చు చేయాలి. ఇక పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి అధికారికంగా 10 లక్షల మంది, అనధికారికంగా సుమారు 30 లక్షల మంది తమ ఉపాధిని కోల్పోయారు. దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలకు ఎలాంటి ఆదాయం లభించడం లేదు. ఒక్కపూట తినేందుకు కూడా ఆహారం దొరక్క అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో కనీసం 10 కిలోల బియ్యం కూడా కొనలేని పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్లో ఒక గుడ్డు కొనుగోలు చేయాలంటే కనీసం 2 లక్షల రియాల్స్, ఒక ప్లేట్ కబాబ్ కోసం 50 నుంచి 60 లక్షల రియాల్స్ ఖర్చు చేయాలి. ఇంత ఖర్చుచేయాలి అంటే సామాన్యులకు సాధ్యం కాదు.
స్తంభించిన వ్యాపారాలు.. మూతపడిన మార్కెట్లు
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయుపుపట్టైన టెహ్రాన్ స్టాక్ ఎక్స్చేంజ్ వరసగా 8 వారాలపాటు మూతపడింది. ఇరాన్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అంతేకాదు, దేశంలోని పెట్రో కెమికల్, స్టీల్ పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బ్యాంకులు సైతం ఖాతాలను మూసివేస్తూ రుణాల చెల్లింపుల్లో జాప్యం జరిగితే జరిమానాలు విధిస్తున్నాయి. తీవ్రమైన మాంద్యం నెలకొనడంతో సామాన్యులు కనీస సౌకర్యాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగితే ద్యవ్యోల్బణం 500 శాతానికి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ధరలు, తరిగిపోతున్న జీవనంతో ఇరాన్ ప్రజలు అవస్థలు పడుతున్నారు. తుపాకీ గుళ్లకంటే..పెరుగుతున్న ధరలే ప్రజలను తీవ్రంగా భయపెడుతున్నాయి.




