హార్ముజ్‌లో భారత్‌కు ఇరాన్ భారీ ఊరట.. అసలు కారణం ఇదే.!

Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే విషయంలో భారత్‌కు ప్రత్యేక మినహాయింపు ఇచ్చినట్లు మరోసారి స్పష్టం చేసింది.

G Krishna
Published on: 4 Nov 2026 5:25 PM IST
Iran India Relations
X

హార్ముజ్‌లో భారత్‌కు ఇరాన్ భారీ ఊరట.. అసలు కారణం ఇదే.!

Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే విషయంలో భారత్‌కు ప్రత్యేక మినహాయింపు ఇచ్చినట్లు మరోసారి స్పష్టం చేసింది. భారత్‌తో పాటు చైనా, ఇరాక్, ఖతార్ దేశాల నౌకలకూ ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించినట్లు వెల్లడించింది. ఈ నాలుగు దేశాల నౌకలు హార్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చని ఇరాన్ పార్లమెంటరీ కమిటీకి చెందిన కీలక ప్రతినిధి ప్రకటించారు.

భారత్‌కు మినహాయింపు ఎందుకు ఇచ్చింది?

ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల కమిటీ వైస్ ఛైర్మన్ అహ్మద్ హయత్ మొఘద్దమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. హార్ముజ్ జలసంధి విషయంలో భారత్, చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు ఇప్పటికే మినహాయింపులు ఇచ్చామని చెప్పారు. ఈ దేశాల నౌకలు జలసంధి గుండా వెళ్లడానికి తమ వైపు నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని పేర్కొన్నారు.

భారత్‌కు ఈ వెసులుబాటు కల్పించడం వెనుక ప్రధాన కారణం ఔషధాల దిగుమతులేనని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చైనాకు రాజకీయ మద్దతు పొందడం కోసం మినహాయింపు ఇచ్చామని, ఆ దేశంతో ఆర్థిక లావాదేవీలు కూడా కొనసాగుతున్నాయని వివరించారు. ఈ వ్యాఖ్యలను ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

యుద్ధం మళ్లీ మొదలయ్యే అవకాశముందా?

మరోవైపు అమెరికాతో ఇరాన్ మధ్య మళ్లీ ప్రత్యక్ష యుద్ధం మొదలయ్యే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ అంతర్గత అంచనాల్లోనూ అమెరికాతో మరోసారి యుద్ధం జరిగే అవకాశమే ఎక్కువగా ఉందని పేర్కొన్నట్లు అల్ అరేబియా వెల్లడించింది. అయితే ఇరాన్‌కు చెందిన పలువురు నిపుణులు మాత్రం అమెరికాతో దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం.

ఖతార్ మధ్యవర్తిత్వంతో శాంతి ప్రయత్నాలు

ఈ ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఖతార్ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. యుద్ధాన్ని నిలిపివేసే ప్రతిపాదనపై నిర్మాణాత్మకంగా చర్చించాలని ఇరాన్ నాయకత్వం సైన్యానికి సూచించినట్లు అల్ అరేబియా కథనం పేర్కొంది. ఇటీవల ఖతార్ ప్రతినిధులు ప్రత్యేక ఆదేశాలతో టెహ్రాన్‌లో పర్యటించినట్లు తెలిపింది. ఒకవైపు రాజకీయ నాయకత్వం దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తుండగా, మరోవైపు సైనిక వ్యూహకర్తలు శాంతి కొనసాగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్‌కు ఎందుకు కీలకం?

ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాలో హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. భారత్ కూడా ఇంధన అవసరాల కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో భారత నౌకలకు ఇరాన్ మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ వెసులుబాటు అమలుకు సంబంధించిన పూర్తి నిబంధనలు, అమెరికా వైఖరిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.