Iran: ట్రంప్‌పై ఇరాన్ ఆగ్రహం.. అది ఏప్రిల్ ఫూల్స్ జోక్ అంటూ ఎగతాళి..!

Iran: ఇరాన్‌లో కొత్త ప్రభుత్వం వచ్చిందని, కాల్పుల విరమణ కోరిందన్న డొనాల్డ్ ట్రంప్ వాదనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.

Naresh.k
Published on: 2 April 2026 8:40 AM IST
Iran Mocks Trump New Government Claim as an April Fool Joke
X

Donald Trump

Donald Trump: అంతర్జాతీయ రాజకీయ యవనికపై అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి తారస్థాయికి చేరింది. బుధవారం నాటి పరిణామాలు కేవలం దౌత్యపరమైన విభేదాలనే కాకుండా, ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి హోర్ముజ్ జలసంధి చుట్టూ అల్లుకున్న ఉత్కంఠను మరోసారి బయటపెట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటనను ఇరాన్ ఏకంగా ఏప్రిల్ ఫూల్స్ జోక్ అని కొట్టిపారేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

అసలేం జరిగింది? ట్రంప్ వాదన ఏమిటి?

ఇరాన్‌లో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడిందని, ఆ ప్రభుత్వం అమెరికాను సంప్రదించి కాల్పుల విరమణ కోరిందని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా, టెహ్రాన్‌లోని ప్రస్తుత 'కొత్త పాలనా అధ్యక్షుడు' తన పూర్వపు నేతల కంటే తక్కువ తీవ్రవాది అని, ఆయనతో చర్చలకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అయితే, దీనికి ఒక కఠినమైన షరతును కూడా జోడించారు. ప్రపంచ చమురు వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరిస్తేనే వాషింగ్టన్ ఏదైనా ఒప్పందాన్ని పరిశీలిస్తుందని ట్రంప్ కుండబద్ధలు కొట్టారు.

ఇరాన్ కౌంటర్

ట్రంప్ వాదనలపై ఇరాన్ విదేశాంగ వర్గాలు ,ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ తీవ్రస్థాయిలో స్పందించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను అసత్యమైనవి , నిరాధారమైనవి అని పేర్కొంటూ ఎగతాళి చేశారు.ఏప్రిల్ ఫూల్స్ డే రోజున కూడా డొనాల్డ్ ట్రంప్ తన జోకులతో అందరినీ మించిపోవడం ఒక విచిత్రమైన విషయం. ట్వీట్‌లతో అధ్యక్షులను మార్చలేరు, దానికోసమే ఎన్నికలు ఉంటాయి అని కాన్సులేట్ వ్యంగ్యంగా స్పందించింది. ప్రస్తుత అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఇప్పటికే పదవిలో ఉన్నారని, ఆయన కొత్తగా నియమితులు కాలేదని గుర్తు చేస్తూ, ట్రంప్ అవగాహనా రాహిత్యాన్ని ఇరాన్ ఎండగట్టింది. కాల్పుల విరమణ కోసం తాము అమెరికాను ప్రాధేయపడలేదని, వైట్ హౌస్ కేవలం కథనాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తోందని టెహ్రాన్ మండిపడింది.

అసలు చిక్కు ఇక్కడే

ఈ మొత్తం రచ్చ వెనుక ఉన్న అసలు కారణం హోర్ముజ్ జలసంధి. ప్రపంచంలోని చమురు రవాణాలో దాదాపు 20% నుండి 30% వరకు ఈ మార్గం గుండానే జరుగుతుంది. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఈ మార్గాన్ని మూసివేయడం లేదా నియంత్రించడం ఇరాన్‌కు ఒక ఆయుధంగా మారింది. ట్రంప్ తన వ్యాఖ్యల్లో ఈ జలసంధిని ప్రస్తావించడం వెనుక అమెరికా ఆర్థిక ప్రయోజనాలు , ఇంధన భద్రత దాగి ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ నాయకత్వం ఒత్తిడిలో ఉందని ప్రపంచానికి చూపాలనేది ట్రంప్ ఎత్తుగడ కాగా, తాము దేనికీ లొంగేది లేదని చెప్పడం ఇరాన్ వ్యూహంగా కనిపిస్తుంది.

సమాచార యుద్ధం

ప్రస్తుతం సరిహద్దుల్లో క్షిపణి దాడులు ఎంత తీవ్రంగా జరుగుతున్నాయో, సోషల్ మీడియా , అంతర్జాతీయ వేదికలపై సమాచార యుద్ధం అంతకంటే ఎక్కువగా సాగుతోంది. ఎవరు ఎవరికి లొంగుతున్నారు? ఎవరు చర్చలకు సిద్ధంగా ఉన్నారు? అనే విషయాలపై తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారా ప్రత్యర్థి దేశంపై నైతిక ఒత్తిడి పెంచాలని ఇరుపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు నిజంగానే క్షేత్రస్థాయి మార్పులను సూచిస్తున్నాయా లేక ఎన్నికల స్టంట్ లేదా వ్యూహాత్మక మైండ్ గేమా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ, అగ్రరాజ్య అధ్యక్షుడి మాటలను ఒక దేశం ఏప్రిల్ ఫూల్స్ జోక్‌గా వర్ణించడం అంతర్జాతీయ దౌత్య చరిత్రలో ఒక అరుదైన , తీవ్రమైన పరిణామం. ఈ ఉద్రిక్తతలు ఎక్కడికి దారితీస్తాయో అన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో నెలకొంది.

Naresh.k

Naresh.k

Next Story