Iran Oil Exports: చూసుకో రాజా... ఇక ఇరాన్‌కు డబ్బుల వరదే
అమెరికా 60 రోజుల పాటు ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలను సడలించడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు తగ్గగా, ఇరాన్‌కు భారీ ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Iran Oil Exports: అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఒక ఊహించని భారీ పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘకాలంగా నడుస్తున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరదించుతూ, ఇరాన్ నుండి చమురు ఎగుమతులపై విధింపులను అమెరికా పాక్షికంగా ఎత్తివేసింది. స్విట్జర్లాండ్‌లో ఇరుదేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు సఫలం కావడంతో, అమెరికా ఆర్థిక శాఖ ఇరాన్‌కు 60 రోజుల పాటు చమురు ఉత్పత్తి, విక్రయాలకు తాత్కాలిక లైసెన్స్ మంజూరు చేసింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి.
ఒప్పందంలోని ముఖ్యాంశాలు
జూన్ 17న కుదిరిన అవగాహనా ఒప్పందం ప్రకారం అమెరికా ఈ సడలింపులను ప్రకటించింది. దీనివల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు భారీగా నిధులు సమకూరనున్నాయి. ఈ తాత్కాలిక లైసెన్స్ ఆగస్టు 21 వరకు అమలులో ఉంటుంది. దీని ద్వారా ఇరాన్ తన ముడిచమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తులను అమెరికాతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు విక్రయించుకోవచ్చు. 60 రోజుల పాటు మినహాయింపు ఇచ్చారు. ఇరాన్ మిత్ర దేశాలతో పాటు ఇతర దేశాలకు చమురును ఎగుమతి చేసేందుకు సిద్దమయింది ఇరాన్. ఇరాన్‌కు మినహాయింపు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 3.5 శాతం పైగా క్షీణించి, బ్యారెల్‌కు 77.7 డాలర్లకు పడిపోయింది. ఇది భారత్ లాంటి దిగుమతి దేశాలకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' జలమార్గాన్ని ఉచిత రవాణాకు తెరిచి ఉంచేందుకు ఇరాన్ అంగీకరించింది. శనివారం ఒక్కరోజే ఈ మార్గం గుండా 17 మిలియన్ బ్యారెళ్ల చమురుతో కూడిన 55 మర్చంట్ షిప్పులు ప్రయాణించాయి.
తెరవెనుక అంతర్జాతీయ రాజకీయం
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ఈ చర్చలపై పూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఆంక్షల సడలింపు ఇరాన్‌కు కేవలం ఉచితంగా దక్కలేదు. ప్రతిగా, ఇరాన్ తన అణు కేంద్రాలలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీలకు అంగీకరించాల్సి వచ్చింది.
నిబంధనలు... ఆంక్షలు
అమెరికా ఇరాన్‌కు ఈ రాయితీలు ఇచ్చినప్పటికీ, కొన్ని కఠినమైన షరతులను విధించింది. ఇరాన్ చమురును కొనుగోలు చేసే ప్రక్రియలో అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా, క్యూబా లేదా రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ ప్రాంతాలకు ఎలాంటి నిధులు బదిలీ కాకూడదని స్పష్టం చేసింది. ఈ ఒప్పందం తాత్కాలికమే అయినప్పటికీ, అంతర్జాతీయ ఇంధన వ్యాపారంలో ఇరాన్ మళ్లీ రారాజుగా మారడానికి ఇది తొలి అడుగు. ఇటు అమెరికాలో ఇంధన ధరలను అదుపు చేయడానికి, అటు ఇరాన్ ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కడానికి ఈ 60 రోజుల ‘చమురు వరద’ ఇరుదేశాలకూ విన్-విన్ సిట్యువేషన్‌గా మారింది.




