Hormuz Deal: హోర్ముజ్‌పై కీలక ఒప్పందం... ఇరాన్‌ అమెరికా చర్చలకు లైన్‌ క్లియర్ అయినట్టేనా?

మధ్యప్రాచ్యంలో వివాదాలు సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌ ఒమన్‌ మధ్య కీలక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఈరోజు అధికారిక వార్త వెలువడే అవకాశం ఉంది.

Balachander
Published on: 5 Aug 2026 9:28 AM IST
Hormuz Deal: హోర్ముజ్‌పై కీలక ఒప్పందం... ఇరాన్‌ అమెరికా చర్చలకు లైన్‌ క్లియర్ అయినట్టేనా?
X

Hormuz Deal: హోర్ముజ్‌ జలసంధిపై ఒప్పందం కుదిరిందా? ఇరాన్‌ అమెరికా యుద్ధానికి త్వరలో ఎండ్‌కార్డ్‌ పడనుందా? క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పడుతున్నాయా? ఒమన్‌ మధ్యవర్తిత్వం సఫలం అవుతుందా? అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం.

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి, ఒమన్ సముద్రంలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ఒక సంచలన ఒప్పందానికి మార్గం సుగమమవుతోంది. ఈ ఒప్పందం కనుక పూర్తయితే, ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు తొలగిపోవడమే కాకుండా, త్వరలోనే అమెరికా-ఇరాన్ మధ్య నేరుగా శాంతి చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది.

రెండు మార్గాల్లో చర్చలు ... ఒమన్ కీలక పాత్ర

ప్రస్తుతం అమెరికా-ఇరాన్ సంక్షోభ పరిష్కారానికి రెండు మార్గాల్లో చర్చలు వేగవంతమయ్యాయి. ఇందులో మొదటిది ఇరాన్‌, ఒమన్‌ మధ్య చర్చలు. ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం ఇది. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో నౌకలకు భద్రత కల్పించే లక్ష్యంతో ఇరాన్, ఒమన్ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక ఈ ఒప్పందంపై కొన్ని రోజుల్లోనే స్పష్టత వస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. మంగళవారమే ఈ ఒప్పందం కుదురుతుందని భావించినప్పటికీ, బుధవారానికి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. చర్చలు సఫలమై యుద్ధానికి పూర్వపు స్థితి వస్తే ప్రపంచ వాణిజ్యరంగం మళ్లీ పుంజుకుంటుంది.

పడిపోయిన చమురు ధరలు ... తగ్గిన భారం

ఈ ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయనే వార్తలు వెలువడటంతోనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. మంగళవారం నాటికి ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌కు 80 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. ఇది సామాన్యులకు ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. చమురు ధర తగ్గడం వల్ల కేవలం వాహనాల ఇంధనం, విద్యుత్ ఉత్పత్తి వ్యయం మాత్రమే కాకుండా, నిత్యవసర వస్తువుల రవాణా ఖర్చులు తగ్గి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భారం తగ్గుతుంది.

శాంతి చర్చలకు మార్గం సుగమమేనా?

ఇరాన్, ఒమన్ మధ్య ఈ వాణిజ్య నౌకల ప్రయాణ ఒప్పందం విజయవంతంగా పూర్తయితే, అది అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న ప్రధాన వివాదాలకు పరిష్కారం చూపుతుంది. హోర్ముజ్ జలసంధిలో రవాణా సమస్య కొలిక్కి వస్తే, ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని శాశ్వతంగా ముగించే దిశగా తుది చర్చలు ప్రారంభమవుతాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ఇంధన భద్రతకు ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చర్చలు ఎంత వరకు సఫలం అవుతాయన్నది మరికాసేపట్లోనే తేలిపోతుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story