Iran Israel Attack: ఇరాన్ భారీ ప్లాన్.... అక్టోబర్ 7 తరహా దాడులు చేయబోతోందా?
ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 తరహాలో భారీ దాడికి ఇరాన్ సన్నాహాలు చేస్తోందా? హెజ్బొల్లా, హౌతీలు, హమాస్, ఇరాన్ అనుకూల మిలీషియాలతో కలిసి దాడికి ప్లాన్ చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
Iran Israel Attack: ఇజ్రాయెల్‌పై మరోసారి అత్యంత భారీ స్థాయిలో, అక్టోబర్ 07 (2023) నాటి దాడి తరహాలోనే బహుముఖ దాడికి ఇరాన్ సన్నాహాలు చేస్తోందని ఇజ్రాయెల్ గూఢచారి వర్గాలు హెచ్చరించాయి. గతంలో ఎదురైన సమన్వయ లోపాలను సవరించుకుంటూ, తన ప్రాంతీయ ప్రాక్సీ నెట్వర్క్ అయిన 'యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్' భాగస్వాములతో కలిసి ఒకేసారి అన్ని సరిహద్దుల నుంచీ విరుచుకుపడేలా ఇరాన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు 'జెరూసలెం పోస్ట్' కథనం ద్వారా వెల్లడైంది.
సమగ్ర బహుముఖ దాడి ప్రణాళిక... ప్రాక్సీల ఏకీకరణ
ఇరాన్ తన రివొల్యూషనరీ గార్డ్స్ కోర్ కుడ్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఐదు కీలక సాయుధ బలగాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీలు, పాలస్తీనాలోని హమాస్, అలాగే ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతు గల మిలీషియాలు ఈ సంయుక్త వ్యూహంలో భాగస్వాములు. ఏదో ఒక సరిహద్దు నుంచి కాకుండా, మొదటి రోజు నుంచే నాలుగు మార్గాల నుంచి ఇజ్రాయెల్‌పై ఒకేసారి దాడులు ప్రారంభించడం ఇరాన్ ప్రధాన లక్ష్యం.
అక్టోబర్ 7 నాటి అనుభవాలు ... సమన్వయ లోపాల సవరణ
2023 అక్టోబర్ 07న గాజా నుంచి హమాస్ మాజీ అధినేత యాహ్యా సిన్వర్ నాయకత్వంలో దాడి జరిగినప్పుడు ఇతర మద్దతు దళాలు తక్షణమే రంగంలోకి దిగలేదు. అమెరికా, ఇజ్రాయెల్ నివేదికల ప్రకారం.. నాటి దాడి తేదీ, పూర్తి వివరాలు ఇరాన్‌కు గానీ, హెజ్బొల్లాకు గానీ ముందస్తుగా తెలియవు. దాంతో దాడి జరిగిన రోజు ఉదయం హెజ్బొల్లా కేవలం పరిమిత దాడులకే పరిమితమైంది. అయితే, పాత తప్పులను దిద్దుకుంటూ, ప్రణాళిక దశ నుంచే పూర్తి సమాచార వ్యవస్థను, ఉమ్మడి కమాండ్ నెట్‌వర్క్‌ను ఇరాన్ ఏర్పాటు చేస్తోంది.
సైనిక సామర్థ్యాల పునరుద్ధరణ ... ఉమ్మడి శిక్షణ
ఇజ్రాయెల్, అమెరికా దాడులలో దెబ్బతిన్న సైనిక వ్యవస్థలను ఇరాన్ వేగంగా పునరుద్ధరిస్తోంది. ఐఆర్జీసీ కుడ్స్ ఫోర్స్ కమాండర్లు, ప్రాక్సీ గ్రూపుల మధ్య కాన్ఫరెన్స్ కాల్స్, ముఖాముఖి సమావేశాలు నిరంతరం జరుగుతున్నాయి. అంతేకాదు, డ్రోన్లు, రికార్డు స్థాయి క్షిపణుల ఉత్పత్తిని వేగవంతం చేయడంతో పాటు భాగస్వామ్య బలగాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హమాస్ నూతన నాయకత్వం ఇరాన్‌తో మరింత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో, ఇజ్రాయెల్‌పై ఉత్తర, దక్షిణ సరిహద్దుల నుంచి ఒకేసారి ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ వేగంగా అడుగులు వేస్తోంది. ఒకవేళ ఈ ప్లాన్ నిజమే అయితే, ఇజ్రాయిల్‌తో పాటు అమెరికా కూడా మరింత స్థాయిలో ఇరాన్‌పై ప్రతిదాడులు చేసే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మధ్యప్రాచ్యంలో ఇప్పటి కంటే ఎక్కువ స్థాయిలో ఒత్తిడి పెరుగుతుందని, చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




