Iran Poverty Crisis: పరాకాష్టకు చేరిన ఇరాన్‌ పేదరికం...అంగట్లో అమ్మకానికి మానవ అవయవాలు

ఇరాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, అప్పుల భారం ప్రజలను కిడ్నీలు, కాలేయ కణజాలం, ఎముక మజ్జ వంటి శరీర భాగాలను అమ్ముకునే పరిస్థితికి నెట్టాయి. 80 లక్షల మంది తీవ్ర పేదరికం, పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది.

Rudrachander
Published on: 12 Nov 2026 4:09 PM IST
Iran Poverty Crisis: పరాకాష్టకు చేరిన ఇరాన్‌ పేదరికం...అంగట్లో అమ్మకానికి మానవ అవయవాలు
X

Iran Poverty Crisis: ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం సామాన్యుల జీవితాలను ఎంతగా దెబ్బతీస్తోందో అక్కడ వెలుగులోకి వస్తున్న పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అప్పులు తీర్చడానికి, కుటుంబ అవసరాలు గడపడానికి కొందరు తమ శరీరంలోని అవయవాలు, కణజాలాన్ని అమ్మకానికి పెడుతున్నారు. కిడ్నీలు, కాలేయ కణజాలం, ఎముక మజ్జతో పాటు వృషణాలను కూడా విక్రయించేందుకు ప్రకటనలు ఇస్తున్నట్లు నవంబర్ 11న ఇరాన్‌కు చెందిన ILNA వార్తా సంస్థ వెల్లడించింది. ఆర్థిక కష్టాలు మనిషిని ఎంతటి దారుణ నిర్ణయాల వైపు నెడుతున్నాయో ఈ ఘటనలు తెలియజేస్తున్నాయి.

‘కిడ్నీ స్ట్రీట్‌’గా మారిన ప్రాంతం

మధ్య ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో గోడలు, భవనాల తలుపులపై అవయవాల విక్రయ ప్రకటనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫర్హాంగ్ హొస్సేనీ వీధిలో ఇలాంటి ప్రకటనలు ఎక్కువగా ఉండటంతో స్థానికులు దానిని ‘కిడ్నీ స్ట్రీట్‌’గా పిలుస్తున్నారు. కిడ్నీ రోగులకు సహాయం చేసే స్వచ్ఛంద సంస్థ, మున్సిపల్ వైద్య కేంద్రం సమీపంలో ఈ ప్రాంతం ఉండటంతో కొనుగోలుదారులు కూడా అక్కడికి వస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

రక్తవర్గాన్ని బట్టి కిడ్నీ ధర

సద్రా ఆసుపత్రికి చెందిన ఓ ఉద్యోగి తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్థిక ఇబ్బందులే చాలామందిని కిడ్నీల విక్రయానికి పురికొల్పుతున్నాయి. రక్తవర్గాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నారు. అరుదైన రక్తవర్గాలకు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు కొందరు సిద్ధపడుతున్నట్లు సమాచారం. కిడ్నీ ధరలు 30 బిలియన్ నుంచి 40 బిలియన్ ఇరానియన్ రియాళ్ల వరకు పలుకుతున్నాయి. అంటే సుమారు 11,500 నుంచి 15,300 డాలర్లు. ఓ పాజిటివ్ రక్తవర్గం ఉన్నవారి కిడ్నీకి సుమారు 8 బిలియన్ రియాళ్లు (3,100 డాలర్లు) ఆఫర్ చేస్తుండగా, అరుదైన రక్తవర్గాలకు 50 బిలియన్ రియాళ్ల (19,200 డాలర్లు) వరకు డిమాండ్ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది.

అప్పుల కోసం శరీరాన్నే అమ్ముకుంటున్న దుస్థితి

టెహ్రాన్‌కు చెందిన 30 ఏళ్ల మోటార్‌సైకిల్ డెలివరీ ఉద్యోగికి కిడ్నీకి బదులుగా 15 బిలియన్ రియాళ్లు, అదనంగా 2 బిలియన్ రియాళ్ల బీమా ఇస్తామని ప్రతిపాదించారట. అయితే తన అప్పులు తీర్చడానికి కనీసం 35 బిలియన్ రియాళ్లు (13,400 డాలర్లు) అవసరమని భావించి ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. మరో 58 ఏళ్ల వ్యక్తి అప్పుల బాధ నుంచి బయటపడేందుకు సాధారణ ధర కంటే 20 నుంచి 30 శాతం తక్కువకే అవయవాన్ని విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. 7 నుంచి 8 బిలియన్ రియాళ్లు (2,680 నుంచి 3,070 డాలర్లు) వస్తే సరిపోతుందని చెబుతున్నాడు. మరోవైపు 33 ఏళ్ల నిర్మాణ కార్మికుడు తన ఎముక మజ్జకు 40 బిలియన్ రియాళ్లు (15,300 డాలర్లు) కోరుతూ, కిడ్నీ, కాలేయ కణజాలం కొనుగోలు చేసేవారి కోసం కూడా చూస్తున్నట్లు సమాచారం. ఇంకొందరు ఒకటి కంటే ఎక్కువ శరీర భాగాలను అమ్మకానికి పెడుతున్నారు.

ఎనిమిది మిలియన్ల మందికి పేదరికం ముప్పు

ఇరాన్ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో నిత్యావసరాలు కూడా భారంగా మారుతున్నాయి. నవంబర్ 8న పార్లమెంటరీ సామాజిక వ్యవహారాల కమిటీ ఛైర్మన్ అలీ బాబాయీ కర్నామీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఆర్థిక విధానాల ప్రభావంతో సుమారు 80 లక్షల మంది తీవ్ర పేదరికం, పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. 2024లోనూ ఆర్థిక ఇబ్బందులతో యువకులు, చివరకు టీనేజర్లు సైతం కిడ్నీలు, ఎముక మజ్జ అమ్మకానికి ప్రకటనలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అంటే ఇది ఒక్కరోజులో పుట్టుకొచ్చిన సమస్య కాదు. ఉపాధి, ఆదాయం, జీవన వ్యయం మధ్య పెరుగుతున్న అంతరం ప్రజలను ప్రమాదకర నిర్ణయాల వైపు నెడుతోంది.

Rudrachander

Rudrachander

రుద్ర చందర్‌ తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు