Medical Kits to Iran: ఇరాన్ కు మానవతా సహాయం.. మెడికల్ కిట్లు పంపిన భారత్
Medical Kits to Iran: యుద్ధ బీభత్సాల నేపథ్యంలో ఇరాన్ ప్రజలకు భారత్ నేనున్నాను అంటూ సహాయం చేసింది. మానవతా సహాయం కింద మెడికల్ కిట్లను పంపించి ఇరాన్ ప్రజల మనసులు గెలుచుకుంది.
Medical Kits to Iran
Medical Kits to Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఇంకా ఆగలేదు. ఇరాన్ కూడా దాడులు ఆపలేదు. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో యుద్ధం పెద్దగానే ఉంది. ఈ యుద్ధంలో, గల్ఫ్ దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలకు నష్టం వాటిల్లడం మినహా, అమెరికాపై ఎలాంటి దాడి జరగలేదు. అయితే, ఇజ్రాయెల్, ఇరాన్‌లు అక్షరాలా ఒక స్మశానంలా తయారయ్యాయి. తనపై జరిగిన దాడికి ప్రతిస్పందనగా, ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ట్యాంకర్లు ప్రయాణించే ప్రధాన జలమార్గం ఇది. హోర్ముజ్ జలసంధిని మూసివేయడంపై ఇరాన్‌ను హెచ్చరించడానికి ఇతర దేశాలు యుద్ధనౌకలను పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌పై మరో దాడి చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు . ఇలాంటి పరిస్థితిలో ఇరాన్ లో యుద్ధంలో గాయపడిన వారికి వైద్య సహాయం ఎలా అందుతుంది? చేయని తప్పుకు గాయాల పాలైన అమాయకులైన ప్రజల పరిస్థితి ఏమిటి? సరిగ్గా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే భారత్ నేనున్నాను అంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి ఉపద్రవం వచ్చి ప్రజల ప్రాణాలు.. ఆరోగ్యం ఇబ్బందుల్లో పడితే.. వారికీ సహాయం అందించడానికి భారత్ ముందడుగు వేస్తుంది. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే చేసింది.
ప్రధానమంత్రి మోదీకి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో చాలా మంచి సంబంధాలు ఉన్నందున, శాంతి చర్చల ద్వారా యుద్ధాన్ని ముగించాలని మోదీ ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ప్రధానమంత్రి మోదీ ఇజ్రాయెల్‌తో చాలాసార్లు చర్చలు కూడా జరిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యపై మౌనం వహించిన భారతదేశం, చివరకు ఖమేనీ సంతాప సభకు హాజరైంది. దీని తర్వాత, ఇరాన్‌తో చర్చలు జరిగాయి హోర్ముజ్ జలసంధి ద్వారా భారత ఆయిల్ ట్యాంకర్లను ప్రయాణించడానికి అనుమతించాలని కోరారు. దీనికి ఇరాన్ అంగీకరించి, భారత నౌకల రాకపోకలను అనుమతించింది.
ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ కు మానవతా సహాయం కింద భారత్ వైద్య సహాయం అందించింది. దీనికి ఇరాన్ ప్రత్యేకంగా భారతీయులకు, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.
దౌత్యం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని పిలుపునిస్తూ, భారతదేశం శాంతి మంత్రాన్ని జపిస్తూనే ఉంది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇతర దేశాలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హోర్ముజ్ జలసంధిని మూసివేసినందుకు ఇరాన్‌కు అన్ని దేశాలు గుణపాఠం నేర్పాలని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంలో, అమెరికా భారతదేశం, థాయ్‌లాండ్, చైనా తదితర దేశాలను సంప్రదించి, హోర్ముజ్ జలసంధికి ఒక యుద్ధనౌకను పంపమని వారిని కోరినట్లు సమాచారం. అయితే, అమెరికా చేసిన ఈ అభ్యర్థనకు భారతదేశం సానుకూలంగా స్పందించలేదు.
మరోవైపు యుద్ధంతో దెబ్బతిన్న ఇరాన్‌కు భారతదేశం వైద్య కిట్లను పంపింది. ఇవి ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీకి చేరాయి. అవసరమైన వైద్య సామాగ్రి ఉన్న ఈ కిట్లను ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీకి అందజేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో భారతదేశం తీసుకున్న మానవతా నిర్ణయం ఇది.
భారతదేశంలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయం, భారతదేశం అందించిన ఈ సహాయాన్ని అంగీకరించింది. భారత ప్రజలకు కృతజ్ఞతలు కూడా తెలియజేసింది. భారతదేశం నుండి పంపిన వైద్య సామాగ్రి పంపిణీని చూపిస్తున్న ఒక వీడియో క్లిప్‌ను కూడా ఇరాన్ రాయబార కార్యాలయం పంచుకుంది. ఆ క్లిప్ ను ANI ట్వీట్ చేసింది. దానిని ఇక్కడ మీరూ చూడొచ్చు.




