Iran US Talks Pakistan Mediation: ఇరాన్‌ కీలక నిర్ణయం.. అమెరికాతో నేరుగా చర్చలు లేనట్టే

Iran US Talks Pakistan Mediation: పశ్చిమాసియాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న యుద్ధమేఘాలను తొలగించడమే ప్రధానోద్దేశంగా జరుగుతున్న శాంతి చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Balachander
Published on: 25 April 2026 9:46 AM IST
Iran US Talks Pakistan Mediation
X

Iran US Talks Pakistan Mediation: ఇరాన్‌ కీలక నిర్ణయం.. అమెరికాతో నేరుగా చర్చలు లేనట్టే

Iran US Talks Pakistan Mediation: పశ్చిమాసియాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న యుద్ధమేఘాలను తొలగించడమే ప్రధానోద్దేశంగా జరుగుతున్న శాంతి చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇస్లామాబాద్‌ వేదిగా అమెరికా ఇరాన్‌ మధ్య ఈరోజు రెండో విడత చర్చలు జరగాల్సి ఉంది. అయితే, అమెరికా ప్రతినిధులతో తాము నేరుగా చర్చలు జరపబోమని, ఇకపై అమెరికాతో ముఖాముఖి చర్చలు ఉండవని కుండబద్దలు కొట్టింది. దీంతో రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్‌ ఈ చర్చల్లో కీలక పోస్ట్‌మ్యాన్‌ డ్యూటీ పోషించనుంది. అంటే ఇరాన్‌ చెప్పిన విషయాలను అమెరికాకు, అమెరికా చెప్పిన సమాధానాలను ఇరాన్‌కు చేరవేయనుంది.

పాక్ అధికారులే వారధులు

మొదటి విడత ముఖాముఖి చర్చల ఫలితంగా అమెరికా పైచేయి సాధించినట్టుగా వార్తలు వచ్చాయి. అమెరికా షరతులపై పట్టు వీడకపోవడంతో ఇరాన్‌ ఇరకాటంలో పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కీలక సమావేశం కోసం ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ ఆరాగ్బీ బృందం ఇప్పటికే ఇస్లామాబాద్‌ చేరుకుంది. నేరుగా అమెరికా బృందంతో చర్చలు తమకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. దీనిపై ఇరాన్‌ బృందం ప్రతినిధి ఇస్మాయిల్‌ స్పందించారు. తాము అమెరికాతో నేరుగా మాట్లాడబోమని, తమ సందేశాన్ని పాకిస్తాన్‌ అధికారులకు తెలియజేస్తామని, వాటిని పాక్‌ అమెరికా అధికారులకు చేరవేస్తుందని స్పష్టం చేశారు. అయితే, వైట్‌హౌస్‌ గతంలో నేరుగా చర్చలు ఉంటాయని చెప్పినప్పటికీ, ఈ విషయంలో ఇరాన్‌ తన పంతాన్ని నెగ్గించుకుంది.

రంగంలోకి ట్రంప్ ‘కోర్ టీమ్’

మొదటి విడత చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్‌ ఇస్లామాబాద్‌ వచ్చినా.. ఈసారి చర్చల్లో పాల్గొనేందుకు ట్రంప్‌ కోర్‌ టీమ్‌ స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ ఇస్లామాబాద్‌ చేరుకున్నారు. వీరికి పాక్‌ అధికారులు ఇరాన్‌ ఇచ్చిన సమాచారాన్ని చేరవేయనున్నారు. అలా కాకుండా ఇరాన్‌ ఓ మెట్టదిగి అమెరికాతో నేరుగా చర్చలు జరిపేందుకు అంగీకరిస్తే... ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇస్లామాబాద్‌ వస్తారు. అయితే, ఈ సమావేశాలకు ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ ఘాలిబఫ్ దూరంగా ఉన్నారు. అంతర్గత విభేదాలే కారణమని చెబుతున్నారు. గతంలో ఇరాన్‌ స్పీకర్‌ చర్చల్లో పాల్గొనగా...అమెరికా పైచేయి సాధించిందని, ఈ కారణంగానే ఆయన్ను ఈ చర్చలకు దూరంగా ఉంచారని చెబుతున్నారు.

ట్రంప్ పెట్టిన ‘డెడ్ లైన్’ షరతులు

చర్చల సంగతి ఎలా ఉన్నా.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పెట్టిన షరతులు మాత్రం తగ్గడం లేదు. షరతులకు తలొగ్గితేనే ఇరాన్‌కు ఊరట లభిస్తుందని లేదంటే ఇరాన్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొనక తప్పదని చెప్పుకొచ్చారు. అమెరికా పెడుతున్న ప్రధాన డిమాండ్లు రెండు ఉన్నాయి. అందులో మొదటిది శుద్ది చేసిన యూరేనియంను పూర్తిగా వదులుకోవాలి. దానిని అమెరికాకు అప్పగించాలి. రెండోది హోర్ముజ్‌ జలసంధిలో అంతర్జాతీయ నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదు. ఈ రెండు డిమాండ్లకు ఇరాన్‌ ఒప్పుకొని తీరాల్సిందేనని ట్రంప్‌ చెబుతున్నారు. కానీ, ఈ రెండింటిని ఇరాన్‌ ఒప్పుకుంటుంది అనుకోవడం లేదు. ఎట్టిపరిస్థితుల్లో యూరేనియంను వదిలేసుకోలేదు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచ దేశాల చూపులన్నీ ఇస్లామాబాద్‌ వైపే ఉన్నాయి. నేరుగా కాకపోయినా పాక్‌ ద్వారా నడిచే ఈ పరోక్ష రాయబారం ఏ మేరకు ఫలిస్తుందో అని ఎదురు చూస్తున్నారు. యుద్ధ భయాలు తగ్గుతాయా లేదంటే చర్చలు విఫలమై మరలా పశ్చిమాసియాలో అనిశ్చితి నెలకొంటుందా అని ఆందోళన చెందుతున్నాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story