Iran Strait of Hormuz: ఇరాన్ ప్లానేంటి? హోర్ముజ్ జలసంధిని ఆరోజే ఎందుకు తెరవాలనుకుంటోంది?
ఇరాన్ 7 రోజుల శాంతి ప్రణాళికలో హోర్ముజ్ జలసంధిని ఆరో రోజునే తెరవాలని ఎందుకు ప్రతిపాదించింది? అమెరికా తిరస్కరణకు కారణాలు, ఇరాన్ వ్యూహం, అణు చర్చలపై కీలక వివరాలను తెలుసుకుందాం.
Iran Strait of Hormuz: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు తెరదించేందుకు ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల రోడ్‌మ్యాప్‌లో హోర్ముజ్ జలసంధి కీలక అంశంగా మారింది. అయితే ఈ జలమార్గాన్ని వెంటనే తెరవడానికి బదులుగా.. సంధి ప్రక్రియలో ఆరో రోజున మాత్రమే తెరవాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఆ తర్వాత ఏడో రోజున అమెరికాతో విస్తృత అణు చర్చలు ప్రారంభించాలని సూచించింది. ఈ క్రమమే ఇప్పుడు ఇరాన్ వ్యూహంపై చర్చకు దారితీస్తోంది.
ఏడు రోజుల ప్రణాళికలో అసలు విషయం ఏంటి?
ఇరాన్ ప్రతిపాదన ప్రకారం.. ఏడు రోజుల పాటు ఒక ప్రక్రియ కొనసాగాలి. అయితే ఆ కాలం ప్రారంభంలోనే హోర్ముజ్ జలసంధిని తెరవడం ఉండదు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన ఈ మార్గాన్ని ఆరో రోజు వరకు మూసి ఉంచి, ఆ తర్వాతే రాకపోకలకు అనుమతించాలని టెహ్రాన్ కోరింది. ఆరో రోజున హోర్ముజ్ తెరిచిన తర్వాత.. ఏడో రోజున అమెరికాతో మరింత విస్తృతమైన ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలన్నది ఇరాన్ ప్రతిపాదన. అంటే హోర్ముజ్ తెరవడాన్ని చర్చల ప్రారంభానికి ముందు జరిగే చివరి కీలక చర్యగా ఇరాన్ చూస్తోంది.
వెంటనే ఎందుకు తెరవడం లేదు?
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వివరణ ప్రకారం, అమెరికా ముందుగా యుద్ధాన్ని ముగించాలి, ఆంక్షలను ఎత్తివేయాలి, ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలి. అలాగే ఇరాన్ మళ్లీ చమురు విక్రయాలు కొనసాగించేందుకు అవకాశం కల్పించాలి. ఈ అంశాలపై హామీ వచ్చిన తర్వాతే హోర్ముజ్‌ను తెరవాలని టెహ్రాన్ చెబుతోంది. ఇక్కడే ఇరాన్ ప్రతిపాదనలోని కీలక అంశం కనిపిస్తోంది. హోర్ముజ్ జలసంధిని మొదటి రోజే తెరిస్తే, తన చేతిలో ఉన్న ప్రధాన ఒత్తిడి సాధనం ముందుగానే కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఏడు రోజుల ప్రక్రియలో ఎక్కువ భాగం పూర్తయ్యే వరకు జలమార్గాన్ని మూసి ఉంచి, అమెరికా నుంచి తమకు కావాల్సిన చర్యలపై స్పష్టత వచ్చిన తర్వాత ఆరో రోజున తెరవాలన్నది ఇరాన్ ఆలోచనగా కనిపిస్తోంది.
అమెరికా ఎందుకు తిరస్కరించింది?
ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అంగీకరించలేదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఇరాన్ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. హోర్ముజ్‌ను వెంటనే తెరవాలనే ఉద్దేశంతోనే ఇరాన్ ఈ ప్రతిపాదన చేసిందని, తమపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. చర్చలు ప్రారంభమయ్యే ముందే ఆంక్షల ఉపశమనం, స్తంభింపజేసిన ఆస్తులకు ప్రాప్యత, ఇతర ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వాలని ఇరాన్ కోరుతోందని ఆయన ఆరోపించారు. అంటే ముందుగా అమెరికా రాయితీలు ఇవ్వాలి.. ఆ తర్వాత ఇరాన్ చర్చలకు రావాలనుకుంటోందన్నది వాషింగ్టన్ అభిప్రాయం.
ఇరాన్ మాత్రం మరోలా చెబుతోంది
అమెరికా చెబుతున్న వాదనలను ఇరాన్ అంగీకరించడం లేదు. గత ఒప్పందాలను అమెరికానే ఉల్లంఘించిందని టెహ్రాన్ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో అరాఘ్చీ.. మధ్యవర్తుల ద్వారా అమెరికా నుంచి అధికారిక సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ట్రంప్ బహిరంగంగా ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ, అధికారిక మార్గంలో వచ్చే స్పందనను ఇరాన్ ఇంకా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
హోర్ముజ్ ఎందుకంత కీలకం?
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని చమురు రవాణాకు హోర్ముజ్ జలసంధి అత్యంత ముఖ్యమైన మార్గం. ఇక్కడ రాకపోకలు ఆగితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే హోర్ముజ్‌ను ఎప్పుడు తెరవాలి అనే అంశం కేవలం అమెరికా-ఇరాన్ మధ్య సమస్యగా కాకుండా, అంతర్జాతీయ వాణిజ్యం, చమురు సరఫరా, ఇంధన ధరలకు సంబంధించిన అంశంగా మారింది. మొత్తంగా చూస్తే.. ఇరాన్ ఏడు రోజుల ప్రణాళికలో ఆరో రోజున హోర్ముజ్‌ను తెరవడం ద్వారా, జలమార్గాన్ని వెంటనే వదులుకోకుండా ముందుగా అమెరికా నుంచి కొన్ని కీలక హామీలు పొందాలని ప్రయత్నిస్తోంది. ఏడో రోజున అణు చర్చలకు వెళ్లడం ద్వారా తదుపరి దశకు మారాలని ప్రతిపాదించింది. అయితే అమెరికా ముందస్తు రాయితీల డిమాండ్‌ను అంగీకరించకపోవడంతో ఈ ప్రణాళిక ప్రస్తుతం ముందుకు సాగలేదు.




