Iran: చర్చలు విఫలమవడానికి కారణం ఇదే : ఇరాన్
Iran: ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే ముగిశాయి.
Iran: చర్చలు విఫలమవడానికి కారణం ఇదే : ఇరాన్
Iran: ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఇరు దేశాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పటికీ, కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మధ్యప్రాచ్యంలో మరోసారి అనిశ్చితి నెలకొంది. షరతుల విషయంలో ఇరు పక్షాలు పట్టువీడకపోవడమే ఈ వైఫల్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
వాషింగ్టన్ వెల్లడించిన కారణాలు
అమెరికా ప్రతిపాదించిన షరతులకు ఇరాన్ అంగీకరించలేదని, అందుకే ఎటువంటి ఒప్పందం కుదరలేదని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. సుమారు 21 గంటల పాటు సాగిన ఈ చర్చల అనంతరం ఆయన నిరాశతో వెనుదిరిగారు. ప్రాంతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని తాము చేసిన ప్రతిపాదనలను టెహ్రాన్ తిరస్కరించిందని వాషింగ్టన్ వర్గాలు పేర్కొన్నాయి.
అమెరికాపై ఇరాన్ ఘాటు విమర్శలు
మరోవైపు, ఈ చర్చల విఫలానికి అమెరికా చేసిన అర్థరహితమైన డిమాండ్లే కారణమని ఇరాన్ ఆరోపించింది. యుద్ధభూమిలో సాధించలేని అంశాలను చర్చల టేబుల్ వద్ద సాధించాలని అమెరికా ప్రయత్నిస్తోందని ఇరాన్ అధికారిక మీడియా విమర్శించింది. తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తమ ప్రతినిధి బృందం నిక్కచ్చిగా వ్యవహరించిందని, సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టి ఎటువంటి ఒప్పందాలకు తాము సిద్ధంగా లేమని టెహ్రాన్ తేల్చిచెప్పింది.
హర్మూజ్ జలసంధిపై వీడని ప్రతిష్ఠంభన
ఘనాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ పరిణామాలపై స్పందిస్తూ… తమ డిమాండ్లను అమెరికా చర్చల్లో ప్రస్తావించిందని, అయితే వాటిని తాము గట్టిగా తిరస్కరించామని తెలిపింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి మూసే ఉంటుందని ఇరాన్ పునరుద్ఘాటించింది. దీంతో చేసేది లేక జేడీ వాన్స్ వట్టి చేతులతో తిరిగి వెళ్లాల్సి వచ్చిందని, పరువు నిలుపుకోవడానికి వారికి మరో మార్గం లేదని వ్యాఖ్యానించింది.
విభేదాలకు కారణమైన కీలక అంశాలు
ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. అనేక అంశాలపై ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరినప్పటికీ, రెండు కీలక విషయాల్లో విభేదాలు తలెత్తాయని వెల్లడించారు. ఆ రెండు అంశాలు ఏమిటనేది ఆయన బహిరంగంగా చెప్పనప్పటికీ, హర్మూజ్ జలసంధి నియంత్రణ మరియు ఇరాన్ అణు హక్కుల విషయంలోనే ప్రతిష్ఠంభన నెలకొన్నట్లు సమాచారం. ఈ చర్చల విఫలం అంతర్జాతీయ చమురు మార్కెట్ , భద్రతా పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.




