Iran US Conflict: ఇరాన్‌ చమురు ట్యాంకర్లపై బాంబుల వర్షం...జోర్టాన్‌ అమెరికా బేస్‌లను టార్గెట్‌ చేసిన ఇరాన్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇరాన్‌ చమురు ట్యాంకర్లపై అమెరికా దాడులు, జోర్డాన్‌లోని అమెరికా స్థావరంపై ఇరాన్‌ క్షిపణి దాడులు, హార్ముజ్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

Balachander
Published on: 9 Sept 2026 11:38 AM IST
Iran US Conflict: ఇరాన్‌ చమురు ట్యాంకర్లపై బాంబుల వర్షం...జోర్టాన్‌ అమెరికా బేస్‌లను టార్గెట్‌ చేసిన ఇరాన్‌
X

Iran US Conflict: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా యుద్ధనౌకలపై దాడికి యత్నించిన ఇరాన్ చర్యలకు ప్రతికారంగా, అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌కు చెందిన ఐదు చమురు ట్యాంకర్లపై వైమానిక దాడులు జరిపి ఒకదానిని పూర్తిగా ముంచివేసింది. దీంతో ఆగ్రహించిన ఇరాన్, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపైకి క్షిపణులను ప్రయోగించడమే కాకుండా, హార్ముజ్ జలసంధిలో ఎనిమిది చమురు ట్యాంకర్లు, రెండు యుఎస్ నౌకలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. గత ఆరు నెలలకు పైగా సాగుతున్న ఈ ఘర్షణలు ఇప్పుడు అంతర్జాతీయ ఇంధన భద్రతకు పెద్ద ముప్పుగా మారాయి.

అమెరికా వైమానిక దాడులు ... ఇరాన్ ట్యాంకర్ మునక

యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించిన కథనం ప్రకారం, ఇరాన్ విప్లవాత్మక గార్డ్స్ కు నిధులు సమకూరుస్తున్న నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఒమన్ గల్ఫ్‌లో ఉన్న నాలుగు ట్యాంకర్లు, ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్ సమీపంలోని మరో ట్యాంకర్‌పై దాడులు జరిగాయి. ఇందులో 'M/T రియెస్కో' అనే చమురు ట్యాంకర్ ఒమన్ గల్ఫ్‌లో పూర్తిగా మునిగిపోయింది. ఇదిలా ఉంటే, ఇరాన్ మొత్తం ముడిచమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఈ ఖార్గ్ ఐలాండ్ పైప్‌లైన్ల ద్వారానే జరుగుతాయి. ఈ ఖార్గ్‌ ఐలాండ్‌ సమీపంలో దాడులు చేయడంతో ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగింది.

ఇరాన్ ప్రతికారం ... జోర్డాన్, హార్ముజ్ జలసంధిలో దాడులు

అమెరికా చర్యకు ప్రతిస్పందనగా ఇరాన్ జోర్డాన్‌లోని అమెరికా స్థావరంపైకి 20 క్షిపణులను ప్రయోగించింది. అయితే, వీటిలో 18 క్షిపణులను జోర్డాన్ రక్షణ దళాలు గాల్లోనే కూల్చివేయగా, మిగిలిన రెండు క్షిపణులు నిర్మానుష్య ప్రాంతాల్లో పడ్డాయని తెలియజేసింది. దాడులు, ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇరాన్‌ హోర్ముజ్‌ జలసంధిని మూసివేందుకు ప్రయత్రాలు మొదలుపెట్టింది. హార్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే 10 నిబంధనలేతర నౌకలు, ఎనిమిది చమురు ట్యాంకర్లను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్పష్టం చేశాయి.

గ్లోబల్ మార్కెట్‌పై ప్రభావం ... పెరిగిన చమురు ధరలు

పశ్చిమాసియా సంక్షోభం ఉధృతం కావడంతో ఆసియా మార్కెట్లలో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 99.35 డాలర్లకు చేరగా, అమెరికా క్రూడ్ ఆయిల్ 1.3 శాతం పెరిగి 94.23 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో సౌదీ అరేబియాలోని ఇంధన వనరులపై యెమెన్‌కు చెందిన హౌతీ మూకలు జరిపిన డ్రోన్ దాడుల్లో 73 మంది గాయపడటంతో చమురు సరఫరాకు తీవ్ర విఘాతం ఏర్పడింది.

ఇక దీనిపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందిస్తూ, అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుంటే ఇరాన్ తన చమురు ట్యాంకర్లను కోల్పోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు డ్రోన్ సబ్‌మెరైన్ స్వాధీనం, క్షిపణి దాడుల పరంపరతో పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయాలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడ్డాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story