Iran War Global Impact: ప్రపంచం ముంగిట అదృశ్య యుద్ధం...ఈ నాలుగింటిని ఎలా ఎదుర్కొంటాయో?

ఇప్పటికిప్పుడు అమెరికా, ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరి హోర్ముజ్‌ జలసంధిని పూర్తిగా తెరిచినప్పటికీ...యుద్ధం ముగిసింది అనుకుంటే పొరపాటేనని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.

Balachander
Published on: 25 May 2026 2:35 PM IST
Iran War Global Impact: ప్రపంచం ముంగిట అదృశ్య యుద్ధం...ఈ నాలుగింటిని ఎలా ఎదుర్కొంటాయో?
X

Iran War Global Impact: ఇప్పటికిప్పుడు అమెరికా, ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరి హోర్ముజ్‌ జలసంధిని పూర్తిగా తెరిచినప్పటికీ...యుద్ధం ముగిసింది అనుకుంటే పొరపాటేనని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. నిజమైన యుద్ధం అప్పుడే ప్రారంభమౌతుంది. బాంబుల మోత తరువాత మొదలైయ్యే యుద్ధాన్ని ఎదుర్కొనడమే ప్రపంచం ముందున్న అసలు సవాల్‌. యుద్ధాలు సృష్టించే ఆర్థిక, సామాజిక గాయాలు మానడానికి దశాబ్దాల సమయం పడుతుంది. గతంలో 1990 గల్ఫ్ యుద్ధం ముగిసినా, ఇరాక్ తన మునుపటి చమురు ఉత్పత్తి స్థాయికి రావడానికి దాదాపు 10 ఏళ్లు పట్టింది. అంతేకాదు, కువైట్‌కు చెల్లించాల్సిన 52.4 బిలియన్ డాలర్ల యుద్ధ పరిహారాన్ని ఇరాక్ 2022 వరకు చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ సంక్షోభం తర్వాత కూడా ప్రపంచం ఎలాంటి 'అదృశ్య యుద్ధాన్ని' ఎదుర్కోబోతుందో, ఆ నాలుగు భయంకరమైన దశలను విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం.

ఆహార సంక్షోభం

మొదటి దశలో ముడిచమురు, ఎల్‌ఎన్‌జీ ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీనిని మీడియా 'ఎనర్జీ ఇన్ఫ్లేషన్' అని పిలుస్తుంది. గల్ఫ్ ప్రాంతం అమ్మోనియా ఉత్పత్తిలో 30 శాతం, యూరియా ఎగుమతుల్లో 35 శాతం వాటాను కలిగి ఉంది. హోర్ముజ్ జలసంధి మూతపడటంతో ఎరువుల కొరత ఏర్పడి, కేవలం రెండు పంటల సీజన్లలోనే ఆహార ధరలు ఆకాశాన్ని తాకుతాయి. గల్ఫ్‌లో రేగిన మంటలు చివరకు కైరోలో రొట్టె ధరను, ఢాకాలో బియ్యం ధరను డిసైడ్ చేస్తాయి.

అంతర్జాతీయ వాణిజ్య మార్గాల మార్పు

రెండో దశలో ప్రపంచ నౌకాయాన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. రెడ్ సీ సంక్షోభం సమయంలో నౌకలు సురక్షిత మార్గాల కోసం ఆఫ్రికా ఖండం చివరన ఉన్న 'కేప్ ఆఫ్ గుడ్ హోప్' చుట్టూ తిరగాల్సి వచ్చింది. దీనివల్ల ప్రయాణ సమయం 16 నుండి 32 రోజులు పెరగడమే కాకుండా, ప్రతి ట్రిప్‌కు అదనంగా మిలియన్ డాలర్ల అదనపు భారం పడింది. పరిస్థితులు చక్కబడ్డా పాత మార్గాలకు నౌకలు అంత సులభంగా తిరిగి రావు.

పేద దేశాలపై సంపద బదిలీ భారం

మూడో దశలో విదేశీ మారక నిల్వలు లేని పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. ధనిక దేశాలు ఈ ఆర్థిక కుదుపులను తట్టుకోగలవు. కానీ తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లోని ప్రజలు తమ సంపాదనలో 44 శాతం కేవలం ఆహారానికే ఖర్చు చేస్తారు అదే ధనిక దేశాలలో చూసుకుంటే ఇది కేవలం 16 శాతం మాత్రమే ఉండటం విశేషం. ఇది సామాన్య మార్కెట్ మార్పు కాదు. పేద ప్రజల సొమ్ము చమురు ఎగుమతి చేసే దేశాల చేతుల్లోకి వెళ్లే ఒక దారుణమైన సంపద బదిలీగా విశ్లేషకులు చెబుతున్నారు. దీని వలన పేద దేశాలు మరింత పేదరికంలోకి వెళ్లిపోతాయి. తద్వారా ఇప్పటి పరిస్థితుల కంటే రాబోయే రోజుల్లో పేదరికం రెండింతలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రాజకీయ అస్థిరత – ప్రభుత్వాల పతనం

నాలుగో దశ అత్యంత ప్రమాదకరమైనది. నిత్యావసరాల ధరలు పెరిగితే ప్రజల్లో అసంతృప్తి రగిలి ప్రభుత్వాలు కూలిపోతాయి. గతంలో ‘అరబ్ స్ప్రింగ్’ విప్లవానికి గోధుమ ధరల పెంపే కారణం. ఇటీవల శ్రీలంక ఆర్థిక పతనం, పాకిస్తాన్ సంక్షోభాలకు కూడా ఇంధన ధరల మోతే ప్రధాన కారణం. ఈ యుద్ధ ప్రభావంతో మరికొన్ని దేశాల్లో రాజకీయ అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఆసియాలో శ్రీలంక, పాకిస్తాన్‌ దేశాలు దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. విదేశీ మారకద్రవ్యం అడుగంటిపోయింది. దీనికోసం ప్రపంచ దేశాల చుట్టూ తిరుగుతున్నాయి. అటు బంగ్లాదేశ్‌, నేపాల్‌ పరిస్థితులు కూడా అదేవిధంగా ఉన్నాయి. మారిన ప్రభుత్వాలు ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటాయో అని ఎదురుచూస్తున్నారు.

నిపుణులు హెచ్చరిస్తున్న ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ శాంతి చర్చల్లో బాంబుల మోత, ఆంక్షలు ఎత్తివేత తదితర అంశాలపై మాట్లాడుతున్నారుగాని, ఆ తరువాత వచ్చే ఆర్థిక సవాళ్ల గురించి నోరు మెదపడం లేదు. బంధూకాల శబ్దం ఆగిన రోజు శాంతి కపోతం ఎగురుతుందని ప్రపంచం సంబరపడొచ్చు. కానీ, సామాన్యుడికి అసలైన జీవన యుద్ధం ప్రారంభమయ్యేది అప్పుడే. ఈ యుద్ధాన్ని సామాన్యుడు ఎలా ఎదుర్కొంటాడన్నది ఇప్పుడు ఆలోచించాలి. దానికి పరిష్కారం కనుగొనాలి. ఇదే ప్రతీదేశం, ప్రతీ ప్రభుత్వం ముందున్న అసలైన సమస్య.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story