Donald Trump: త్వరలోనే ఇరాన్ యుద్ధానికి ఎండ్ కార్డ్.. డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్
Donald Trump: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, చమురు ధరలు వేగంగా తగ్గుతాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Donald Trump
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో నడుస్తున్న యుద్ధం చాలా త్వరలోనే ముగుస్తుందని, అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వేగంగా తగ్గుముఖం పడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శాన్ ఆంటోనియో రిపబ్లికన్ ప్రచార ర్యాలీకి బయలుదేరే ముందు వాషింగ్టన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాలను వెల్లడించారు.
ఇరాన్ అణు సామర్థ్యం ఖతం
అమెరికా చేపట్టిన సైనిక చర్యల వల్ల ఇరాన్ అణు శక్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉంటే ప్రపంచం ఊహించని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చేదని పేర్కొన్నారు. తాము అనుకున్న లక్ష్యాలను సాధించామని, ఇప్పుడు ఇరాన్ అణ్వాయుధాల ముప్పు నుంచి ప్రపంచం సురక్షితంగా ఉందన్నారు.
చమురు మంటలు చల్లారడం ఖాయం
యుద్ధం ముగింపు దశకు చేరుకోవడంతో పాటు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, త్వరలోనే చమురు సరఫరా సాధారణ స్థితికి వస్తుందని ట్రంప్ అన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గుతాయని స్పష్టం చేశారు. యుద్ధం ముగిస్తే అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం తప్పుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటు కౌంటర్
ట్రంప్ చేసిన ప్రకటనలపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇరాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫాతిమా మొహాజెరానీ మాట్లాడుతు ట్రంప్ మాటలన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. అమెరికా ఆధిపత్యం విఫలమైందని, తమ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇరాన్ ఇంధన మంత్రి రాజీనామా బలహీనతకు నిదర్శనం కాదని స్పష్టం చేశారు.
7 రోజుల శాంతి ప్రణాళిక
ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి తమ వైపు నుంచి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో అమెరికా ముందు ఒక ప్రత్యేక ప్రతిపాదన ఉంచినట్లు వెల్లడించారు. హోర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించడానికి, ఉద్రిక్తతలు తగ్గించడానికి 7 రోజుల శాంతి ప్రణాళికను ఆమోదించాలని కోరారు.




