Iran Warning: ఇరాన్ సంచలన వార్నింగ్... ఆ దేశాలూ మాకు శతృవులే
అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిచ్చే దేశాలను శత్రువులుగా పరిగణిస్తామని ఇరాన్ హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధి, చమురు సరఫరా, గల్ఫ్ దేశాలపై ఇరాన్ వ్యూహం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Iran Warning: అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఆంక్షల వ్యూహాలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశంపై అమెరికా చేస్తున్న "ఆర్థిక యుద్ధం"లో ఏ దేశమైనా అమెరికాకు సహకరిస్తే, ఆ దేశాన్ని శత్రు దేశంగా భావించి భూకంప స్థాయి ప్రతిదాడి చేస్తామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సేన్ రెజాయి హెచ్చరించారు. గల్ఫ్ దేశాల నుంచి బొట్టు చమురు కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకుంటామని స్పష్టం చేయడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌తో పాటు పశ్చిమాసియాలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
ప్రపంచదేశాలకు అమెరికా అల్టిమేటం
గత ఫిబ్రవరి 28న ప్రారంభమైన మిలటరీ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి దిగ్బంధంతో ఇప్పటికే ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై "మరింత కఠినమైన ఆర్థిక చర్యలు" ఉంటాయని ప్రకటించగా, అమెరికా ఖజానా కార్యదర్శి స్కాట్ బెసెంట్ "మాతో ఉంటారో.. లేక మాకు వ్యతిరేకంగా ఉంటారో తేల్చుకోండి" అంటూ ప్రపంచ దేశాలకు అల్టిమేటమ్ జారీ చేశారు.
ఇరాన్ హెచ్చరికలు
ప్రపంచ చమురు మరియు సహజ వాయువు ఎగుమతుల్లో ఐదోవంతు ఒక్క హోర్ముజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. ఇక ఇరాన్ ఉత్పత్తి చేసే చమురు ఎగుమతుల్లో దాదాపు 80శాతం ఒక్క చైనా దేశమే కొనుగోలు చేస్తోంది. ఇక ఇదిలా ఉంటే, 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా ఇరాన్‌కు చెందిన 12 బిలియన్ డాలర్ల అసెట్స్‌ను అమెరికా స్తంభింపజేసింది. 2018లో ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు జేసీపీఓఏ అణు ఒప్పందం నుంచి బయటకు వచ్చి కఠిన ఆంక్షలు విధిస్తూ, ఐఆర్‌జీసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. అప్పటి నుంచి ఇరాన్ అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
అమెరికాకు వ్యతిరేకంగా వ్యూహం
ఇరాన్ ప్లాన్ చేస్తున్న ప్రతిదాడి వ్యూహం మూడు దశల్లో ఉండనుంది. మొదట అమెరికాతో చేతులు కలిపే దేశాలతో దౌత్యపరమైన చర్చలు జరిపి తప్పుకోవాలని కోరడం. వినకపోతే నేరుగా ముందస్తు దాడులు జరపడం. హోర్ముజ్ జలసంధితో పాటు ఎర్రసముద్రానికి మార్గమైన 'బాబ్ అల్-మందేబ్' జలసంధిని కూడా నిరోధిస్తామని ఇరాన్ సూచించింది. పక్కనే ఉన్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాలు అమెరికాకు మిత్రదేశాలు అయినప్పటికీ, ఇరాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్నందున ప్రత్యక్ష ఘర్షణకు మొగ్గు చూపడం లేదు. ఒకవేళ ఇరాన్ విధించిన ఈ అల్టిమేటమ్ నిజమైతే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటడం ఖాయంగా కనిపిస్తోంది.




