Iran Warns Bahrain: బహ్రెయిన్‌కు ఇరాన్‌ సీరియస్‌ వార్నింగ్‌...గల్ఫ్‌లో హైటెన్షన్‌

మంగళవారం ఖతార్‌ వేదికగా శాంతి చర్చలకు మార్గం సుగమం అయిన తరుణంలో ఇరాన్‌ బెహ్రెయిన్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

Balachander
Published on: 29 Jun 2026 8:35 AM IST
Iran Warns Bahrain: బహ్రెయిన్‌కు ఇరాన్‌ సీరియస్‌ వార్నింగ్‌...గల్ఫ్‌లో హైటెన్షన్‌
X

Iran Warns Bahrain: మధ్యప్రాచ్యం మరోసారి యుద్ధ మేఘాల నీడలోకి వెళ్తోంది. గల్ఫ్ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటూ, ఇరాన్ తాజాగా బహ్రెయిన్‌ దేశానికి అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడి చేయాలని చూస్తే బహ్రెయిన్‌పై మునుపెన్నడూ లేనంత శక్తివంతమైన ప్రతిదాడి చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ముఖ్య సలహాదారు అలీ అక్బర్ వెలాయతీ హెచ్చరించారు. బహ్రెయిన్ పాలకులు తమ పరిధులను తెలుసుకుని ప్రవర్తించాలని, ఇరాన్‌తో మైండ్ గేమ్స్ ఆడుతూ సొంత దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేయవద్దని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ 'తస్నిమ్' వేదికగా స్పష్టం చేశారు.

యూఎస్ నౌకాదళ స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులు

గడచిన శుక్ర, శనివారాల్లో బహ్రెయిన్‌లోని అత్యంత కీలకమైన అమెరికా నౌకాదళ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వరుస దాడులకు తెగబడింది. అమెరికా తమ భూభాగంపై చేసిన దాడులకు ప్రతికారంగానే తాము ఈ చర్యలు తీసుకున్నట్లు టెహ్రాన్ ప్రకటించింది. మధ్యప్రాచ్యంలోని సైనిక స్థావరాలను ఉపయోగించుకుని అమెరికా తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది.

బహ్రెయిన్ ఖండన ... గల్ఫ్ దేశాల తిరస్కరణ

ఇరాన్ చేస్తున్న ఆరోపణలను బహ్రెయిన్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా తమ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు వాడుతోందన్న వాదనలో వాస్తవం లేదని స్పష్టం చేశాయి. ఇరాన్ జరిపిన ఈ దాడులు బహ్రెయిన్ సార్వభౌమత్వాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని, ప్రాంతీయ శాంతి, ఉద్రిక్తతల తగ్గింపు ప్రయత్నాలకు ఇవి తీవ్ర గొడ్డలిపెట్టు అని మనామా ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంతర్గత షియా జనాభా... ఇరాన్ వ్యూహం

బహ్రెయిన్‌లో అత్యధిక సంఖ్యలో షియా ముస్లిం జనాభా ఉన్నారు. ఇరాన్ కూడా షియా ప్రాధాన్యత కలిగిన దేశం కావడంతో, బహ్రెయిన్‌లోని అంతర్గత భద్రతకు ఇది పెద్ద సవాలుగా మారింది. గడచిన కొన్ని నెలల్లోనే ఇరాన్ సైన్యంతో, గూఢచార సంస్థలతో రహస్య సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై బహ్రెయిన్ ప్రభుత్వం దేశంలో డజన్ల కొద్దీ అనుమానితులను అరెస్ట్ చేసింది. ఇరాన్ అక్కడ తిరుగుబాటుకు ప్రయత్నిస్తోందనే ఆందోళనలు వ్యూహాత్మకంగా బహ్రెయిన్‌ను వేధిస్తున్నాయి.

గల్ఫ్ రీజియన్‌లో అమెరికాకు అతిపెద్ద సైనిక అండగా బహ్రెయిన్ నిలుస్తోంది. ఇప్పుడు ఇరాన్ నేరుగా బహ్రెయిన్ దేశాన్ని హెచ్చరించడం అంటే, అది కేవలం ఒక చిన్న ద్వీప దేశంపై సవాలు కాదు... పరోక్షంగా అమెరికా, సౌదీ అరేబియా కూటమితో తలపడటమే. ఈ ఉద్రిక్తతలు గనుక మరింత ముదిరితే, అంతర్జాతీయంగా చమురు రవాణా, గల్ఫ్ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ పడే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story