Iran US Tensions: ఇరాన్‌పై అమెరికా గ్రౌండ్ ఆపరేషన్? టాప్ జనరల్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా సైనికులు ఇరాన్‌లో అడుగుపెడితే తీవ్రపరిణామాలు ఉంటాయని సైన్యం తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్‌ తన వ్యూహాలను మార్చుతూ ఆర్థికంగా ఇబ్బందులు పెట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు.

Balachander
Published on: 10 Aug 2026 10:47 AM IST
Iran US Tensions: ఇరాన్‌పై అమెరికా గ్రౌండ్ ఆపరేషన్? టాప్ జనరల్ సంచలన వ్యాఖ్యలు
X

Iran US Tensions: ఇరాన్ గడ్డపై కాలు పెడితే కాళ్లు నరికేస్తాం... అమెరికాకు ఇరాన్ టాప్ జనరల్ తీవ్ర హెచ్చరిక! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొత్త వ్యూహం... సైనిక దాడి కంటే ఆర్థిక ముట్టడితోనే ఇరాన్‌కు చెక్ పెట్టేలా వ్యూహం... హోర్ముజ్ జలసంధి తెరిచే ప్రసక్తే లేదు... షరతులు నెరవేరిస్తేనే చర్చలంటున్న ఇరాన్‌ విదేశాంగ మంత్రి. విమర్శలు ప్రతి విమర్శలతో మధ్యప్రాచ్యం మరింత వేడెక్కుతోంది.

అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు తీవ్ర సంక్షోభంలో పడిన వేళ, ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అమెరికా సైనిక బలగాలు కనుక ఇరాన్ భూభాగంలోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ సైనిక గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీ జహాన్‌షాహీ అత్యంత తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అమెరికా సైనికులు ఎవరైనా ఇరాన్ గడ్డపై కాలు పెడితే, వారి కాళ్లను నరికివేస్తాం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పశ్చిమాసియాలో తీవ్ర కలకలం రేపాయి. తమ దేశ సరిహద్దులను కాపాడుకోవడానికి, ప్రత్యర్థుల దాడులను తిప్పికొట్టడానికి ఇరాన్ సైన్యం పూర్తి సన్నద్ధతతో ఉందన్నారు.

ట్రంప్ 'చెస్‌ గేమ్' వ్యూహం ... ఆర్థిక ఒత్తిడే అస్త్రం

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై వెంటనే సరికొత్త సైనిక దాడులు చేయడానికి బదులుగా ఆర్థిక ఆంక్షల ద్వారా ఒత్తిడి పెంచే వ్యూహాన్ని ఎంచుకున్నట్లు సంకేతాలిచ్చారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ... ఇరాన్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఖాళీ అవుతున్న ఖజానాను గమనిస్తున్నామని, ప్రస్తుతం దౌత్యపరమైన చర్చలను తక్కువ స్థాయిలో నడుపుతున్నామని తెలిపారు. అంతేకాదు, ఈ సంక్షోభంపై స్పందిస్తూ ...ఇది ఒక రకమైన చదరంగం లాంటిది. అంతా అనుకూలంగానే ముగుస్తుంది అని వ్యాఖ్యానించారు.

ప్రత్యక్ష చర్చలను తిరస్కరించిన ఇరాన్

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పందిస్తూ, అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరగడం లేదని, కేవలం మధ్యవర్తుల ద్వారా మాత్రమే వర్తమానాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. మధ్యంతర ఒప్పందాల ఉల్లంఘనను అమెరికా నిలిపివేసే వరకు చర్చలు పునఃప్రారంభం కావని తేల్చి చెప్పారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై ఒమన్ దేశంతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని, అయితే అమెరికా తమ షరతులను నెరవేర్చని పక్షంలో జలసంధిని పూర్తిగా తెరవడం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు. అమెరికా ఆర్థిక ఆంక్షలతో ఇరాన్‌ను లొంగదీసుకోవాలని చూస్తుంటే, ఇరాన్ మాత్రం సైనిక హెచ్చరికలు, హోర్ముజ్ జలసంధి మూసివేతతో ఎదురుదాడికి దిగుతుండటంతో ప్రపంచ ఇంధన భద్రత, పశ్చిమాసియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story