Iran Anti US Rallies: ఇరాన్‌లో ఎటు చూసినా తుపాకులే... ట్రంప్‌కు సవాల్ విసురుతున్న ప్రజలు
మెరికా, ఇరాన్ దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం ముదిరింది.
Iran Anti US Rallies: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం ముదిరింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా విసిరిన తీవ్ర హెచ్చరికలపై ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధుల్లో ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. గళమెత్తి అమెరికాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. గత 3 నెలలుగా ప్రతి రాత్రి ఇరాన్ అంతటా అమెరికాకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. అంతేకాకుండా, సాధారణ పౌరులకు, మహిళలకు సైతం ఏకే-47 వంటి అధునాతన తుపాకులు ఎలా వాడాలో నేర్పించే బహిరంగ శిక్షణా కేంద్రాలు వెలియడం అక్కడ నెలకొన్న యుద్ధ తీవ్రతకు అద్దం పడుతోంది. సాధారణ పౌరులు కూడా గన్ వాడేందుకు అవసరమైతే రణరంగంలోకి దిగేందుకు సిద్దమౌతున్నారంటే అక్కడి ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అత్యంత ప్రాచీనమైన సంస్కృతిని ఒక్క యుద్ధంతో తుడిచిపెట్టేయడం సాధ్యం కాదంటూ ప్రజలు కదం తొక్కుతున్నారు.
ట్రంప్ హెచ్చరిక – ఇరాన్ దీటుగా జవాబు
"ఇరాన్‌కు సమయం ముగిసిపోతోంది, వారు త్వరగా మారకుంటే వారి ఉనికి లేకుండా చేస్తాం" అంటూ డోనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో ఆదివారం హెచ్చరించారు. దీనిపై ఇరాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెహ్రాన్‌లోని తజ్రిష్ స్క్వేర్ వద్ద వేలాది మంది ఇరాన్ జాతీయ జెండాలతో "అమెరికా నశించాలి" అంటూ నినాదాలు చేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమేనని అక్కడి యువత స్పష్టం చేస్తోంది. మా దేశ సరిహద్దులు ఎంత ముఖ్యమో, మా అణు సాంకేతికత కూడా అంతే ముఖ్యమని స్థానికులు చెబుతున్నారు.
లైవ్ టీవీల్లో తుపాకులతో యాంకర్లు – ప్రజల్లో భిన్న స్వరాలు
ఇరాన్ ప్రభుత్వ అధికారిక టెలివిజన్ ఛానళ్లలో యాంకర్లు ఏకంగా తుపాకులు పట్టుకుని వార్తలు చదవడం ఇక్కడ సరికొత్త చర్చకు దారితీసింది. 'ఒఫుగ్' ఛానల్ యాంకర్ హొస్సేన్ హొస్సేనీ లైవ్ ప్రోగ్రామ్‌లోనే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ సమక్షంలో గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే, ఈ యుద్ధ వాతావరణాన్ని ఇరాన్‌లోని అందరు ప్రజలు స్వాగతించడం లేదు. టెహ్రాన్ పార్కుల్లో విద్యావంతులు, కొందరు యువతీ యువకులు తాము ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటున్నామని, తమ పిల్లల భవిష్యత్తు కోసం యుద్ధం వద్దు – శాంతి కావాలని కోరుకుంటున్నారు. అయినప్పటికీ, దేశంలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ఈ శాంతి స్వరాలు నలిగిపోతున్నాయి.
ఇరాన్ అణు పరీక్షలను నిలిపివేయడమే యుద్ధానికి ముగింపు అని అమెరికా అంటుంటే, తమ వద్ద అసలు అణుబాంబు లేదని, కేవలం స్వచ్ఛమైన ఇంధనం కోసమే అణుశక్తిని వాడుతున్నామని ఇరాన్ వాదిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భయంతో ఇరాన్ తన పౌరులను సైనికులుగా మారుస్తోంది. ఇప్పటికే మూడు నెలలుగా కొనసాగుతున్న ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇరాన్‌ను మరింత అస్థిరతవైపు నెట్టేస్తున్నాయి. ఒక దేశం అస్థిరంగా మారింది అంటే దానిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడే దేశాలు కూడా ప్రభావితమౌతాయి. ఇరాన్‌లో లభించే చమురుపై ప్రపంచంలోని చాలా దేశాలు ఆధారపడ్డాయి. ఇప్పుడు ఆ ఆధారం లేకుండా చేస్తే... ప్రపంచం చూస్తూ ఊరుకుంటుందా... మూడో ప్రపంచయుద్ధం వైపుకు అడుగులు పడతాయా? ఏమో ఏదైనా జరగొచ్చు.




