IRGC: ఐఆర్‌జీసీ కంట్రోల్‌లో ఇరాన్?... వేగంగా మారుతున్న పరిణామాలు
మధ్యప్రాచ్యంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇరాన్‌ను ఇఆర్‌జీసీ పూర్తిగా తన కంట్రల్‌లోకి తీసుకున్నట్టుగా కథనాలు వస్తున్నాయి.
IRGC: మధ్యప్రాచ్యంలో రాజకీయాలు, యుద్ధమేఘాలు రోజుకోవిధంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌లో అంతర్గత రాజకీయాలు, సైనిక వ్యూహాలు తీవ్రమైన ఉత్కంఠను రేపుతున్నాయి. ఇరాన్ అధికారిక సైన్యం ఆర్టెష్ కంటే అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ దేశాన్ని తన కంట్రోల్‌లోకి తీసుకుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 1979లో కేవలం ఒక చిన్న పారామిలటరీ దళంగా ఏర్పడిన ఐఆర్‌జీసి ఇప్పుడు ఇరాన్ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను శాసించే దిశగా, అమెరికా, ఇజ్రాయిల్‌లపై దాడులు చేసే స్థాయికి చేరింది. ఇరాన్‌లోని ప్రజా ప్రభుత్వం కూడా ఐఆర్‌జీసీకి ఎదురుచెప్పలేని స్థితికి చేరుకోవడం సంచలనంగా మారింది.
విప్లవం నుండి అధికార పీఠం వరకు... ఐఆర్‌జీసీ ప్రస్థానం
1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత, నాటి సుప్రీం లీడర్ అయాతొల్లా రుహొల్లా ఖొమేని ఈ ఐఆర్‌జీసీని స్థాపించారు. నాటి షా చక్రవర్తికి అనుకూలంగా ఉన్న సాధారణ సైన్యానికి ప్రతిగా, విప్లవాన్ని రక్షించడానికి ఈ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు. 1980 నుంచి 1988 వరకు ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధం జరిగింది. ఈ ఎనిమిదేళ్ల సుదీర్ఘమైన యుద్ధంలో ఐఆర్‌జీసీ దూకుడును ప్రదర్శించి ఆకట్టుకుంది. దేశాన్ని రక్షించేందుకు ఐఆర్‌జీసీ ముందుంటుందని నిరూపించుకుంది. ఇరాన్‌లో ప్రత్యేక దళంగా ఏర్పడిన ఐఆర్‌జీసీ 1982లో విదేశీ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఖుద్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎనిమిదేళ్లపాటు జరిగిన యుద్ధం తరువాత ఈ ఐఆర్‌జీసి కేవలం రక్షణ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేసే స్థాయికి ఎదిగింది. ఇరాన్‌లో రక్షణ శాఖ, ఇంటిలిజెన్స్, కమ్యునికేషన్, చమురు వ్యాపారాల్లో కీలకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. నేడు ఈ రంగాన్ని ఈ సైన్యం ఆధీనంలోనే ఉన్నాయి.
ప్రస్తుత సంక్షోభం... సుప్రీం లీడర్ మరణంతో మారిన పరిణామాలు
ఇరాన్ దేశాధినేత, సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నేతృత్వంలో ఐఆర్‌జీసీ అపరిమితమైన అధికారాలను సొంతం చేసుకుంది. కేవలం సుప్రీం లీడర్ కార్యాలయానికి మాత్రమే జవాబుదారీగా ఉండే ఈ సంస్థ, దేశంలో సివిల్ రాజకీయ ప్రక్రియలను పూర్తిగా అణచివేసింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ 2024 మే నెలలో హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందడం, ఆపై 2026లో సుప్రీం లీడర్ ఖమేనీ మరణించడంతో ఇరాన్‌లో ఒక శూన్యత ఏర్పడింది. ప్రస్తుతానికి మాజీ ఐఆర్‌జీసీ సభ్యుడైన అలీ లారిజానీ తాత్కాలిక బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఆయన మతగురువు కాకపోవడంతో శాశ్వత సుప్రీం లీడర్ కాలేరు. అయితే, ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న పెజెష్కియన్ రాజీనామా చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ వార్తలపై ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. ఇరాన్ ప్రభుత్వం దాన్ని తప్పుడు ప్రచారంగా కొట్టిపారేస్తుండగా, కొన్ని మీడియా సంస్థలు మాత్రం రాజీనామా లేఖ ఉందని చెబుతున్నాయి. ఖమేనీ మరణం తరువాత ఆయన తనయుడు మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఐఆర్‌జీసీ సుప్రీం లీడర్‌కి మాత్రమే జవాబుదారిగా ఉంటుంది.
ప్రపంచ దేశాలకు ముప్పుగా మారిన సైనిక ఏకఛత్రాధిపత్యం
సాధారణంగా ప్రజాస్వామ్య దేశాలలో లేదా సాధారణ ప్రభుత్వాలపై అంతర్జాతీయ ఒత్తిడి పనిచేస్తుంది. కానీ, ఐఆర్‌జీసీ ఒక స్వతంత్ర సైనిక, ఆర్థిక శక్తిగా మారడం వల్ల అంతర్జాతీయ ఆంక్షలను సైతం లెక్కచేయడం లేదు. ఇజ్రాయెల్, అమెరికాలపై నేరుగా క్షిపణి దాడులు చేయడం, సొంతంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం దీనికి నిదర్శనం. ఒక దేశం పూర్తిగా సైనిక కబంధహస్తాల్లో చిక్కుకుంటే, ఆ దేశ భవిష్యత్తు, అంతర్జాతీయ సంబంధాలు ఎంత దారుణంగా దెబ్బతింటాయో ఇరాన్ ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అధికార పీఠం కోసం తెరవెనుక జరుగుతున్న ఈ సైనిక, మతగురువుల పోరాటం రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్యాన్ని ఏ తీరానికి తీసుకెళ్తుందో చూడాలి.




