US Iran War : ఇరాన్ కొత్త బాస్ ముజ్తబా ఖమేనీ బతికే ఉన్నారా? డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

US Iran War : ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ బతికే ఉన్నారా అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో ఇరాన్ సైన్యం చిక్కుల్లో పడిందని ట్రంప్ పేర్కొన్నారు.

CR Reddy
Published on: 15 March 2026 8:19 AM IST
Mujtaba Khamenei
X

 Mujtaba Khamenei

US Iran War : మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా ముదురుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ కూటమి వర్సెస్ ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతుండగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాంబు లాంటి వార్తను పేల్చారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ అసలు బతికే ఉన్నారా లేదా అనే అనుమానాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడమే ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ముజ్తబా మరణ వార్తలను ఆయన ఖచ్చితంగా ధృవీకరించనప్పటికీ, ఆయన ఒకవేళ క్షేమంగా ఉంటే మాత్రం తక్షణమే లొంగిపోవడం తన దేశానికి మంచిదని ట్రంప్ హెచ్చరించారు.

ట్రంప్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇరాన్‌కు చెందిన మెజారిటీ మిసైళ్లను, డ్రోన్లను అమెరికా సైన్యం ఇప్పటికే ధ్వంసం చేసిందని, వారి సైనిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని ఆయన పేర్కొన్నారు. కేవలం యుద్ధం మాత్రమే కాకుండా, కీలకమైన హోర్ముజ్ స్ట్రెయిట్ (Hormuz Strait) సముద్ర మార్గాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి పలు దేశాలు అమెరికాకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ ప్రకటించారు. అయితే ఆ దేశాల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇరాన్ శాంతి ఒప్పందం కోసం ప్రయత్నిస్తోందని, కానీ ప్రస్తుత పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా రక్షణ మంత్రి పెట్ హెగ్సెత్ కూడా ఇరాన్ కొత్త నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఇరాన్ వద్ద అత్యాధునిక రికార్డింగ్ పరికరాలు ఉన్నప్పటికీ, కొత్త నేత ముజ్తబా ఖమేనీ ఎందుకు వీడియో సందేశం ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. కేవలం లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేయడం వెనుక ఉన్న అసలు కారణం.. ముజ్తబా తీవ్రంగా గాయపడి ఉండటమో లేదా ప్రాణ భయంతో ఎక్కడో దాక్కుని ఉండటమో అయి ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం ముజ్తబా కొత్త సోషల్ మీడియా ఖాతాలోని ఫోటోలను ఏఐ (AI) సృష్టించినవిగా అనుమానిస్తున్నాయి.

ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో పాత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై దాడులను తీవ్రం చేశారు. అయితే ఆ తర్వాత జరిగిన దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని కథనాలు వచ్చాయి. ఇరాన్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తూ, తమ నేత క్షేమంగా ఉన్నారని, సైన్యాన్ని ముందుండి నడిపిస్తున్నారని చెబుతోంది. ఏది ఏమైనా, ముజ్తబా బహిరంగంగా ప్రత్యక్షమైతే తప్ప ఈ సస్పెన్స్ వీడేలా కనిపించడం లేదు.

CR Reddy

CR Reddy

Next Story