Donald Trump: గ్లోబల్ మార్కెట్‌లో ట్రంప్‌కు షాక్.. 8 దేశాల ఎన్నికల్లో జోక్యం.. 6 చోట్ల ఓటమి
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయంగా తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఇతర దేశాల రాజకీయాలలో బహిరంగంగా జోక్యం చేసుకోవడం అందరికీ తెలిసిందే.
Donald Trump
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయంగా తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఇతర దేశాల రాజకీయాలలో బహిరంగంగా జోక్యం చేసుకోవడం అందరికీ తెలిసిందే. తన మాట వినే నాయకులు అధికారంలోకి రావాలని ఆయన నిరంతరం ప్రయత్నిస్తుంటారు. అయితే గడిచిన రెండేళ్ల కాలంలో ఆయన వ్యూహాలు అంచనాలు తలకిందులయ్యాయి. గత రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన 8 దేశాల ఎన్నికలలో ట్రంప్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు తెలిపినప్పటికీ, అందులో ఏకంగా 6 దేశాలలో ఆయన మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
కెనడా (ఏప్రిల్ 2025): కెనడాను అమెరికాలో విలీనం చేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టారిఫ్ బెదిరింపులు అక్కడి ప్రజల్లో తీవ్ర నిరసనను పెంచాయి. ట్రంప్ అనుకూల భావజాలం ఉన్న కన్సర్వేటివ్ నేత పియరీ పోయిలీవర్ ఈ ఎన్నికల్లో ఓడిపోగా, మార్క్ కార్నీ నాయకత్వంలోని లిబరల్ పార్టీ ఘన విజయం సాధించింది.
ఆస్ట్రేలియా (మే 2025): ఆస్ట్రేలియాలో ట్రంప్ విధానాలను బలంగా సమర్థించిన కన్సర్వేటివ్ నేత పీటర్ దత్తన్ ఓటమి పాలయ్యారు. అక్కడ ఆంటోనీ అల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ తిరిగి అధికారాన్ని దక్కించుకుంది.
జర్మనీ (ఫిబ్రవరి 2025): జర్మనీలో ట్రంప్ కుడిభుజం ఎలాన్ మస్క్ తీవ్రంగా ప్రచారం చేసిన తీవ్ర కుడిపక్ష పార్టీ AfD ఓడిపోయింది. ఫ్రెడ్రిక్ మెర్జ్ నేతృత్వంలోని సీడీయూ/సీఎస్‌యూ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
రొమేనియా (మే 2025): ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ సిద్ధాంతాలను అనుసరించే రొమేనియా నేత జార్జ్ సిమియాన్ 54 శాతం ఓట్లతో నికుషోర్ దాన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు.
హంగేరీ (ఏప్రిల్ 2026): ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రధాని విక్టర్ ఓర్బన్‌కు షాక్ తగిలింది. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ స్వయంగా ప్రచారానికి వెళ్లినప్పటికీ, విపక్ష నేత పీటర్ మగ్యార్ చేతిలో ఓర్బన్ అధికారాన్ని కోల్పోయారు.
బ్రెజిల్ (అక్టోబర్ 2026): బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సనారో కుమారుడు ఫ్లావియో బోల్సనారోకు అమెరికా మద్దతుగా నిలిచింది. కానీ అక్టోబర్ 25న జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో లూలా దా సిల్వా విజయం సాధించి బోల్సనారో కుటుంబానికి చెక్ పెట్టారు.
జపాన్, హోండురాస్‌లో ఊరట
వివిధ దేశాలలో చుక్కెదురైనప్పటికీ జపాన్, హోండురాస్ దేశాలలో మాత్రం ట్రంప్ మద్దతు తెలిపిన అభ్యర్థులకు విజయం దక్కింది. జపాన్‌లో 2026 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో ప్రధాని సనే తకైచికి ట్రంప్ బహిరంగంగా మద్దతు పలికారు. ఆమె సమర్థురాలైన నాయకురాలని పొగడటంతో అక్కడ విజయం లభించింది. అలాగే సెంట్రల్ అమెరికా దేశమైన హోండురాస్‌లో నాస్రీ అసఫురా గెలవకపోతే ఆర్థిక సాయం నిలిపివేస్తామని బెదిరించడం ద్వారా అక్కడ తమ అనుకూల అభ్యర్థిని గెలిపించుకోగలిగారు.




