పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, 15 మంది నవజాత శిశువులు బలి!
Pakistan: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని పిమ్స్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
Pakistan: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రఖ్యాత 'పాకిస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' (PIMS) ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఆసుపత్రిలోని గైనకాలజీ వార్డు నర్సరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి 15 మంది పసికందులు దుర్మరణం పాలయ్యారు.
ఉదయం 7 గంటల ప్రాంతంలో ఏసీ (Air Conditioner) కంప్రెసర్ ఒక్కసారిగా పేలిపోవడంతో నర్సరీ అంతటా దట్టమైన పొగ, మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాద సమయంలో నర్సరీలో మొత్తం 16 మంది నవజాత శిశువులు ఉండగా, సిబ్బంది కేవలం ఒక్క శిశువును మాత్రమే సురక్షితంగా బయటకు తీయగలిగారు. మిగిలిన 15 మంది పసికందులు మంటలు, పొగలో చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దట్టమైన పొగ వల్ల సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. జన్మించిన కొద్ది గంటల్లోనే పసికందులు అగ్నికి ఆహుతి కావడంపై బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.




