Islamabad PIMS Hospital Fire: పాకిస్తాన్ ఆసుపత్రిలో ఘోరం.. 15 మంది శిశువులు సజీవ దహనం!
Islamabad PIMS Hospital Fire: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని పిమ్స్ ఆసుపత్రి నర్సరీలో AC కంప్రెసర్ పేలడంతో 15 మంది నవజాత శిశువులు మృతి చెందారు.
Islamabad PIMS Hospital Fire: పాకిస్తాన్ ఆసుపత్రిలో ఘోరం.. 15 మంది శిశువులు సజీవ దహనం!
Islamabad PIMS Hospital Fire: ఎగిరిపోయిన నవజాత శిశువుల ప్రాణాలు!పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రముఖ పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న భయానక అగ్నిప్రమాదం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కనురెప్పపాటులో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనలో అప్పుడే భూమిపైకి వచ్చిన పసిపాపలు సజీవ దహనమయ్యారు.
బుధవారం ఉదయం ఆసుపత్రిలోని మదర్ అండ్ చైల్డ్ హెల్త్ విభాగం మూడో అంతస్తులో ఉన్న నర్సరీలో ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఈ పేలుడుతో దట్టమైన పొగ, మంటలు క్షణాల్లో వార్డు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రమాద సమయంలో నర్సరీలో 16 మంది నవజాత శిశువులు ఉన్నారు.
మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే, రక్షణ బృందాలు కేవలం ఒకే ఒక్క శిశువును సురక్షితంగా బయటకు తీయగలిగాయి. మిగతా 15 మంది పసిపాపలు మంటలకు ఆహుతయ్యారు. అందులో 14 మంది శరీరాలు పూర్తిగా కాలిపోవడం అక్కడి దృశ్యాల బీభత్సానికి, ఆసుపత్రి యజమాన్యం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
అగ్నిమాపక భద్రతా వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం:రాజధాని నగరంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలోనే కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు లేకపోవడంపై బాధితుల బంధువులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే 6 ఫైర్ ఇంజన్లు, 4 అంబులెన్సులు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.
ఈ దారుణ ఘటనపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఇది పూడ్చలేని నష్టం అని ఆవేదన చెందారు. ఘటనపై విచారణ జరిపేందుకు అదనపు డిప్యూటీ కమిషనర్ జనరల్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. బాధ్యులెంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో దేశంలోని అన్ని ఆసుపత్రుల్లోని అగ్నిమాపక వ్యవస్థలు, ఎలక్ట్రికల్ భద్రతను తక్షణమే సమీక్షించాలని ఆదేశించారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆసుపత్రిలోనే పసిపాపలు ప్రాణాలు కోల్పోవడంతో బాధితుల తల్లుల రోదనలు వర్ణనాతీతంగా మారాయి.




