Israel Election 2026: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు ఓటమి తప్పదా ?
ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. నెతన్యాహు కూటమికి మెజారిటీ దక్కక పోవడంతో అరబ్ పార్టీలు కింగ్‌మేకర్‌గా మారాయి.
Israel Election
Israel Election 2026: ఇజ్రాయెల్ ముందస్తు ఎన్నికల లెక్కింపు ఫలితాలు ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ ఏ ఒక్క కూటమికి రాకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా అరబ్ వర్గానికి చెందిన పార్టీలు భారీ ఆదరణ దక్కించుకుని కింగ్‌మేకర్ పాత్ర పోషించే దిశగా పయనిస్తున్నాయి. సుమారు 89 శాతానికి పైగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి అధికార మార్పిడిపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం లభించకపోవడంతో కొత్త ప్రభుత్వం ఎలా ఏర్పాటు కాబోతోందనే అంశంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఓట్ల దొంగతనం అక్రమాల కలకలం
ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ ఈ ఫలితాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. అరబ్ పార్టీలు ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి, ఓట్ల దొంగతనం చేశాయని నెతన్యాహు వర్గం సంచలన ఆరోపణలు చేసింది. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, హింసను ప్రేరేపించడం, నిషేధిత సాఫ్ట్‌వేర్ వాడటమే కాకుండా డబ్బులు పంపిణీ చేసి గెలిచేందుకు ప్రయత్నించారని మండిపడింది. ఈ విమర్శల నేపథ్యంలో పోలింగ్ బూత్‌ల వద్ద జరిగిన అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఎన్నికల అధికారులకు అందజేస్తున్నట్లు లికుడ్ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
నెతన్యాహుకు చెక్
ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్‌లో మొత్తం 120 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మేజిక్ ఫిగర్ సాధించి అధికార పీఠంక్కాలంటే కనీసం 61 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. కాగా ఓట్ల లెక్కింపు సరళిని గమనిస్తే నెతన్యాహు నేతృత్వంలోని కుడిపక్ష కూటమికి కేవలం 53 స్థానాలు మాత్రమే లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన ప్రధాన ప్రత్యర్థి గాదీ ఐజెన్‌కోట్ కూటమి 48 సీట్ల దిశగా సాగుతోంది. ఇదే సమయంలో అరబ్ వర్గం పార్టీలకు ఏకంగా 19 సీట్లు వచ్చే అవకాశాలు ఉండటంతో, రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ రాజకీయాన్ని ఏలేది అరబ్ నాయకులేననే ప్రచారం ఊపందుకుంది.
నోట్లకట్టలు స్వాధీనం.. అరెస్టులు
ఎన్నికల క్రమంలో చోటుచేసుకున్న ఓట్ల కొనుగోలు వ్యవహారం ఇజ్రాయెల్‌లో పెద్ద దుమారమే రేపింది. అరబ్ వర్గానికి చెందిన రామ్ పార్టీకి మద్దతుగా ఓటర్లకు డబ్బు పంచుతున్నారనే అనుమానంతో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కవర్లలో దాచిన వేల కొద్దీ లోకల్ కరెన్సీ నాణాలు, నగదును రికవరీ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు. ఏది ఏమైనా, ఓట్ల దొంగతనం ఆరోపణలు, హంగ్ పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.




