Netanyahu Iran Strike: ఇజ్రాయిల్ ఎన్నికల రణచిత్రం...ఇరాన్‌పై దాడికి ఆదేశం
ఇజ్రాయిల్ ఎన్నికలకు ముందు ఇరాన్‌పై సైనిక చర్యకు సంబంధించి ప్రధాని నేతన్యాహు, ఐడీఎఫ్ చీఫ్ ఎయాల్ జమీర్ మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇరాన్ అంశాన్ని వాడుకుంటున్నారన్న ప్రతిపక్ష ఆరోపణల గురించి తెలుసుకుందాం.
Netanyahu Iran Strike: ఇజ్రాయిల్‌లో ఎన్నికలకు కొద్ది రోజులే మిగిలి ఉండగా.. ఇరాన్‌పై సైనిక చర్యకు సంబంధించి ప్రధాని బెంజమిన్ నేతన్యాహు, ఇజ్రాయిల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) చీఫ్ ఎయాల్ జమీర్ మధ్య విభేదాలు తలెత్తినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్‌తో మరోసారి యుద్ధ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందని రక్షణ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ వార్తలను నేతన్యాహు ఖండించారు. జమీర్‌తో తనకు ఎలాంటి ఘర్షణ లేదని స్పష్టం చేశారు.
ఇజ్రాయిల్‌లో విభేదాలు
ఇజ్రాయిల్ ఛానల్ 12 ఆదివారం ప్రసారం చేసిన కథనం ప్రకారం.. ఇరాన్‌కు సంబంధించి ప్రతిపాదించిన ఓ సైనిక చర్యను అమలు చేయడంపై జమీర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ చర్యకు సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. అయితే, దాని చట్టబద్ధతను నిర్ధారించే అధికారిక పత్రాలపై నేతన్యాహు సంతకం చేయాలని, మరింత చర్చ జరగాలని జమీర్ కోరినట్లు ఛానల్ 12 పేర్కొంది. గత 24 గంటల్లో ఈ వివాదం మరింత తీవ్రతరమైనట్లు పేర్లు వెల్లడించని వర్గాలను ఉటంకించింది. ఈ కథనం ఇజ్రాయిల్ సైనిక సెన్సార్ నిబంధనలకు లోబడి ప్రసారమైంది. ప్రతిపాదిత చర్య అమలైతే ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఓ సైనిక అధికారి హెచ్చరించినట్లు ఛానల్ 12 తెలిపింది. ఇప్పటికే సున్నితంగా మారిన పరిస్థితుల్లో తప్పుడు అంచనాలు లేదా పొరపాటు నిర్ణయాలు పెద్ద ఘర్షణకు దారితీయవచ్చన్నది రక్షణ వర్గాల ఆందోళనగా పేర్కొంది.
రాజకీయ లబ్ది కోసమేనా?
మరోవైపు, ఇరాన్ అంశాన్ని ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతోందా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇవి పేర్లు వెల్లడించని వర్గాలు, ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలు మాత్రమే. నేతన్యాహు మాత్రం ఛానల్ 14కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కథనాన్ని “అర్ధంలేని విషయం”గా కొట్టిపారేశారు. జమీర్‌తో గొడవ జరిగిందన్న వార్తల్లో నిజం లేదన్నారు. అదే ఇంటర్వ్యూలో ఇరాన్ పాలక వ్యవస్థను కూల్చివేయాలని ఇటీవల ఐడీఎఫ్, మొసాద్ గూఢచార సంస్థలను ఆదేశించినట్లు నేతన్యాహు వెల్లడించారు. అయితే, ఆయన చెప్పిన ఆదేశానికి ఛానల్ 12 ప్రస్తావించిన నిర్దిష్ట సైనిక చర్యకు సంబంధం ఉందా లేదా అన్నది స్పష్టంగా తెలియలేదు. ఆదివారం పాల్మాచిమ్ వైమానిక స్థావరంలో జరిగిన సమావేశంలో నేతన్యాహు, జమీర్ మధ్య ఉద్రిక్తతలు కనిపించినట్లు ఛానల్ 12 మరో కథనంలో పేర్కొంది. సమావేశ వాతావరణం “చాలా అసహ్యకరంగా” ఉందని తెలిపింది. ఈ పరిణామాలపై ఓ సీనియర్ భద్రతా అధికారి స్పందిస్తూ.. ఇటీవలి రోజుల్లో జమీర్ పోషించిన పాత్రను చరిత్ర మర్చిపోదని వ్యాఖ్యానించినట్లు వెల్లడించింది. అయితే, ఆ వ్యాఖ్యకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదు.
ప్రతిపక్షాల విమర్శలు
ఇదిలా ఉండగా, గురువారం ఛానల్ 13 ప్రసారం చేసిన మరో కథనంలో.. ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదని జమీర్ ఓ ప్రైవేటు సమావేశంలో చెప్పినట్లు పేర్కొంది. అవసరం ఉందని తేలితే చర్య తీసుకుంటామని, ప్రస్తుతానికి దాడి అవసరమనే సంకేతాలు కనిపించడం లేదని ఆయన అన్నట్లు కథనం తెలిపింది. ఈ వివాదంపై ప్రతిపక్ష నేతలు నేతన్యాహుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యషార్ పార్టీ నాయకుడు గాది ఐసెన్‌కోట్.. దేశ భద్రతను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని హెచ్చరించారు. యాయిర్ లాపిడ్ అయితే ఎన్నికలను వాయిదా వేయించేందుకు ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెంచాలని నేతన్యాహు చూస్తున్నారని ఆరోపించారు. యైర్ గోలన్, అవిగ్డోర్ లీబర్‌మన్ కూడా సైనిక చర్యకు స్పష్టమైన భద్రతా కారణం, వ్యూహాత్మక లక్ష్యం ఉండాలని పేర్కొంటూ జమీర్‌కు మద్దతు తెలిపారు. అయితే, ఎన్నికల ప్రయోజనాల కోసం యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలను నేతన్యాహు ఖండించారు. ఇరాన్‌పై చర్య విషయంలో భద్రతా అవసరాలు, రాజకీయ ఆరోపణలు పరస్పరం కలిసిపోవడంతో ఇజ్రాయిల్‌లో ఎన్నికల ప్రచారం మరింత ఉత్కంఠభరితంగా మారింది.




