Israel Hamas: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. గాజాలో హమాస్ టాప్ కమాండర్ హతం

గాజాలో ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. దక్షిణ గాజాలో జరిగిన వైమానిక దాడిలో హమాస్‌కు చెందిన కీలక కమాండర్ అబూ యూనిస్‌ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

CR Reddy
Published on: 16 Nov 2026 7:11 AM IST
Israel Hamas
X

Israel Hamas

Israel Hamas: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. దక్షిణ గాజాలో నిర్వహించిన వైమానిక దాడిలో హమాస్‌కు చెందిన రఫా బ్రిగేడ్ కమాండర్ సమీర్ మహమూద్ హసన్ అబూ యూనిస్‌ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ సాయుధ విభాగం కూడా ఆయన మృతిని ధ్రువీకరించింది. మరోవైపు బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై దాడి చేశామని ఇరాన్ ప్రకటించగా, సౌదీ అరేబియాపై హూతీల క్షిపణి దాడుల ప్రయత్నాలను ఆ దేశ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది.

హమాస్ రఫా బ్రిగేడ్ కమాండర్ అబూ యూనిస్ హతం

ఇజ్రాయెల్ సైన్యం, భద్రతా సంస్థ షిన్ బెట్ సంయుక్తంగా దక్షిణ గాజాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వైమానిక దాడి నిర్వహించాయి. ఈ దాడిలో హమాస్ రఫా బ్రిగేడ్ కమాండర్ సమీర్ అబూ యూనిస్‌ మరణించినట్లు ప్రకటించాయి. ఆయన హమాస్ సాయుధ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. హమాస్ కూడా ఆదివారం ఆయన మృతిని ధ్రువీకరించింది. అబూ యూనిస్ గత సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్ దాడిలో మరణించిన నాయెల్ అబూ ఒబైద్ తర్వాత రఫా బ్రిగేడ్ బాధ్యతలు చేపట్టారు. కేవలం రెండు నెలలకే ఆయన కూడా దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన అంత్యక్రియలను ఆదివారం నిర్వహించినట్లు హమాస్ తెలిపింది.

బహ్రెయిన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి?

బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరంలో ఉన్న రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. అల్ రిఫా హెలికాప్టర్ స్థావరంపై ఆరు డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్‌కు చెందిన మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే రాడార్ వ్యవస్థ ధ్వంసమైందా? ఎంత నష్టం జరిగింది? అనే విషయాలపై స్పష్టత లేదు. అమెరికా సెంట్రల్ కమాండ్ రెండు ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు తెలిపినప్పటికీ, రాడార్ ధ్వంసమైనట్లు ధ్రువీకరించలేదు. ఇదే సమయంలో బహ్రెయిన్ హోం శాఖ దేశవ్యాప్తంగా రెండు భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

జోర్డాన్‌లో చర్చి కాల్పుల కేసులో ముగ్గురికి మరణశిక్ష

జోర్డాన్‌లో గత నెల జరిగిన చర్చి కాల్పుల ఘటనపై న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. అక్టోబర్ 23న కరక్ ప్రాంతంలోని హమూద్ గ్రామంలో గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చిలో అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 34 మంది గాయపడ్డారు. ఈ కేసులో ముగ్గురిని దోషులుగా తేల్చిన జోర్డాన్ స్టేట్ సెక్యూరిటీ కోర్టు ఆదివారం మరణశిక్ష విధించింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడటం, ఆయుధాలు కలిగి ఉండటం వంటి అభియోగాలపై ఈ తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. జోర్డాన్ అత్యున్నత న్యాయస్థానం సమీక్ష కూడా జరగాల్సి ఉంది.

యెమెన్‌లో దాడి.. నలుగురికి గాయాలు

యెమెన్ రాజధాని సనాలో జరిగిన దాడిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు గాయపడినట్లు హూతీల ఆధీనంలోని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నగరంలోని షుఆబ్ ప్రాంతంలో నివాస ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని ఆరోపించారు. ఈ దాడికి సౌదీ అరేబియానే కారణమని హూతీ వర్గాలు ఆరోపించినప్పటికీ, ఆ విషయాన్ని స్వతంత్రంగా ధ్రువీకరించే సమాచారం లేదు. మరోవైపు సౌదీ అరేబియా వైపు హూతీలు ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ప్రకటించాయి. ఆ దేశ తూర్పు ప్రాంతంలో మూడు డ్రోన్లను కూడా కూల్చివేసినట్లు వెల్లడించాయి. ఈ వరుస పరిణామాలతో పశ్చిమాసియాలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.