Donald Trump : ట్రంప్ 15 పాయింట్ల గాజా ప్లాన్‌కు ఇజ్రాయెల్ భారీ షాక్.. నెతన్యాహు ఏం చెప్పారంటే?

Donald Trump : గాజా ఒప్పందంపై డోనాల్డ్ ట్రంప్ ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తిరస్కరించారు. హమాస్ ఆయుధాలు త్యజించే వరకు దళాలు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

CR Reddy
Published on: 10 Aug 2026 6:59 AM IST
Donald Trump
X

Donald Trump

Donald Trump : పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి స్థాపన దిశగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికను ఇజ్రాయెల్ అధికారికంగా తిరస్కరించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో మాట్లాడుతూ, హమాస్ ముఠా సంపూర్ణంగా ఆయుధాలను వీడనంత వరకు గాజాలోని పాలస్తీనా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటించిన 15 పాయింట్ల పత్రంతో కూడిన ఒప్పందాన్ని తాము తిరస్కరిస్తున్నామని, అయితే భవిష్యత్ ప్రణాళికలపై వాషింగ్టన్‌తో చర్చలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. గాజాలోని సగానికి పైగా భూభాగాన్ని ప్రస్తుతం ఇజ్రాయెల్ సైన్యం తన నియంత్రణలో ఉంచుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఎర్రసముద్రంలో హౌతీల దాడుల కలకలం

యెమెన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ రెచ్చిపోయారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న కీలకమైన మోఖా ఓడరేవుపై హౌతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు సైనికులు, ముగ్గురు పౌరులు సహా ఏడుగురు మరణించగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనితో పాటు సౌదీ అరేబియాలోని జాజాన్ నగరంలో ఉన్న ప్రముఖ చమురు సంస్థ అరామ్‌కో రిఫైనరీ లొకేషన్ లక్ష్యంగా డ్రోన్ దాడికి పాల్పడినట్లు హౌతీ అధికార ప్రతినిధి యాహ్యా సరీ ప్రకటించారు. ఈ దాడి వల్ల అరామ్‌కో ఫెసిలిటీలో స్వల్పంగా మంటలు చెలరేగినప్పటికీ ప్రాణనష్టం తప్పుతోందని సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ - ఒమన్ చర్చలు

అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి నిర్వహణకు సంబంధించి ఇరాన్, ఒమన్ దేశాలు ఒక తాత్కాలిక ఒప్పందానికి వచ్చేందుకు చర్చలు జరుపుతున్నాయి. ఇరాన్ సమీపం నుంచి నౌకలు ప్రవేశించి, ఒమన్ మీదుగా బయటకు వెళ్లేలా ఈ నౌకాయాన మార్గాన్ని పునరుద్ధరించాలని భావిస్తున్నారు. గల్ఫ్ సహకార మండలి కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్‌కు నష్టం కలిగించిన శత్రు దేశాల ఓడలను ఈ జలసంధి నుంచి అనుమతించేది లేదని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ తేల్చి చెప్పింది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను శత్రు నౌకలుగా ఇరాన్ పరిగణిస్తోంది.

మందుగుండు కొరతపై పెంటగాన్ ఆందోళన

ఇరాన్‌తో నెలకొన్న సైనిక ఉద్రిక్తతల వల్ల అమెరికా వద్ద ఉన్న అధునాతన మిస్సైల్ ఇంటర్సెప్టర్ల నిల్వలు గణనీయంగా తగ్గిపోయినట్లు సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ విశ్లేషణ వెల్లడించింది. ఈ కొరత వల్ల ఉక్రెయిన్, తైవాన్ వంటి మిత్రదేశాలకు సైనిక సాయం అందించడంపై ప్రభావం పడుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిని అధిగమించేందుకు మందుగుండు సామగ్రి, ఆయుధాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని పెంటగాన్ అధికార ప్రతినిధి షాన్ పార్నెల్ వెల్లడించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story