Israel Iran war survey: ఇజ్రాయిలీల మనసులో మాట - ఇరాన్‌పై యుద్ధం ముగిస్తే...
మే 2026 నాటి అంతర్జాతీయ పరిణామాలు గమనిస్తే, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ డెమొక్రసీ ఇన్ స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Israel Iran war survey: మే 2026 నాటి అంతర్జాతీయ పరిణామాలు గమనిస్తే, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ డెమొక్రసీ ఇన్ స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ముగించడం ఇజ్రాయెల్ భద్రతకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.
యుద్ధం ఇప్పుడే ముగియాలా?
సర్వేలో పాల్గొన్న వారిలో 59 శాతం మంది ప్రజలు ఇప్పుడప్పుడే యుద్ధాన్ని ముగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా యూదు జనాభాలో మూడింట రెండు వంతుల మంది, ప్రస్తుత పరిస్థితుల్లో శాంతిని నెలకొల్పడం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఇజ్రాయెల్‌లోని అరబ్ పౌరుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. వారిలో దాదాపు సగం మంది "యుద్ధం ముగియడమే ఇజ్రాయెల్ ప్రయోజనాలకు మేలు" అని అభిప్రాయపడ్డారు.
సర్వే ఏం చెబుతోంది
ఇజ్రాయిల్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం 62 శాతం మంది ప్రజలు ఇరాన్‌తో మళ్లి భారీస్థాయి ఘర్షణలు తప్పవని నమ్ముతున్నారు. ఇక 51 శాతం మంది ఇజ్రాయెల్ రక్షణ నిర్ణయాలపై సొంత ప్రభుత్వం కంటే అమెరికా ప్రభావమే ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ఇది 44 శాతంగా ఉండేది. అయితే, కేవలం 18 శాతం మంది మాత్రమే ఇజ్రాయెల్ ప్రభుత్వం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటోందని నమ్ముతున్నారు. దీన్నిబట్టి చూస్తే ఇరాన్‌పై యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదని స్పష్టమౌతున్నది.
అమెరికా వైఖరిపై ఆందోళన
అమెరికా ప్రజలలో ఇజ్రాయెల్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత ఇప్పుడు ఆ దేశ పౌరులను కలవరపెడుతోంది. దాదాపు 72 శాతం మంది ఇజ్రాయెలీలు ఈ పరిణామాన్ని "అత్యంత ఆందోళనకరం"గా అభివర్ణించారు. అమెరికా అండ లేనిదే రక్షణ రంగంలో నిలదొక్కుకోవడం కష్టమన్న భావన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
లెబనాన్ సరిహద్దులో అస్థిరత
లెబనాన్ విషయంలోనూ ఇజ్రాయెల్ ప్రజలు నిరాశావాదంతోనే ఉన్నారు. హెజ్బుల్లా ఆయుధాలను వీడి, శాంతి ఒప్పందానికి వస్తుందన్న నమ్మకం కేవలం తక్కువ మందిలో మాత్రమే ఉంది. 80 శాతం మంది యూదులు భవిష్యత్తులో స్థిరమైన ఒప్పందం జరుగుతుందన్న విషయాన్ని తోసిపుచ్చారు. ఇక మొత్తంగా చూసుకుంటే, ఇజ్రాయెల్ పౌరులు తమ దేశ భద్రత కోసం సుదీర్ఘ పోరాటానికైనా సిద్ధమే కానీ, అరకొర శాంతి ఒప్పందాలకు మాత్రం సుముఖంగా లేరని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం నీటిపై గాలిబుడగ లాంటిదేనని స్పష్టమౌతున్నది.




