ISRO: ఇస్రో నుంచి నిష్క్రమణ ఇక అంత ఈజీ కాదు.. కీలక మిషన్ల కోసం కొత్త రూల్స్

ఇస్రోలో శాస్త్రవేత్తల రాజీనామాలు పెరగడంతో కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. కీలక మిషన్లు పూర్తయ్యే వరకు నిష్క్రమణలకు బ్రేక్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 July 2026 2:10 AM IST
ISRO
X

ISRO

భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)లో కీలక ప్రాజెక్టులపై పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశానికి వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైన అంతరిక్ష మిషన్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ (VRS)పై మరింత కఠిన నిబంధనలు అమలు చేయాలని అంతరిక్ష విభాగం (Department of Space-DoS) నిర్ణయించింది.

గత ఏడాదిలో ఇస్రో నుంచి 100 నుంచి 120 మంది వరకు శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు రాజీనామా చేసినట్లు వెలువడిన నివేదికలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం గగన్‌యాన్, భవిష్యత్ చంద్రయాన్ మిషన్లు, అధునాతన ఉపగ్రహ ప్రాజెక్టులు వంటి కీలక కార్యక్రమాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ స్పందిస్తూ, పెద్ద సంస్థల్లో ఉద్యోగుల మార్పులు సహజమేనని పేర్కొన్నారు. అయితే కీలక జాతీయ మిషన్లకు ఆటంకం కలగకుండా అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలను సంస్థలో కొనసాగించేందుకు కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చామని తెలిపారు.

జూలై 14న అంతరిక్ష విభాగం జారీ చేసిన అంతర్గత మెమో ప్రకారం, వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న గ్రూప్-ఏ శాస్త్ర, సాంకేతిక సిబ్బంది రాజీనామాలు లేదా స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తులను ఇకపై సాధారణంగా ఆమోదించరు. సంబంధిత ప్రాజెక్టు పూర్తయ్యే వరకు వాటిని వాయిదా వేయాలని ఇస్రో కేంద్రాల డైరెక్టర్లకు సూచించారు.

కొత్త విధానం ప్రకారం, కీలక మిషన్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల అన్ని రాజీనామా, VRS దరఖాస్తులను సంబంధిత కేంద్ర డైరెక్టర్ సిఫార్సులతో కలిసి న్యూఢిల్లీ ఉన్న అంతరిక్ష విభాగానికి పంపించాల్సి ఉంటుంది. తుది నిర్ణయం అక్కడే తీసుకోనున్నారు.

ఇది 2020లో అమల్లోకి వచ్చిన విధానానికి భిన్నంగా ఉండనుంది. అప్పటివరకు ఇస్రో కేంద్రాల డైరెక్టర్లకే శాస్త్రవేత్తల రాజీనామాలను ఆమోదించే అధికారాలు ఉండేవి.

బెంగళూరులోని యు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ (URSC) నుంచి దాదాపు 80 మంది, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) నుంచి కనీసం 20 మంది శాస్త్రవేత్తలు రాజీనామా చేసినట్లు సమాచారం.

రాజీనామా చేసిన వారిలో LVM3 ప్రాజెక్టు డైరెక్టర్ విక్టర్ జోసెఫ్, SpaDeX (స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్) ప్రాజెక్టు డైరెక్టర్, అలాగే చంద్రయాన్-3 ల్యాండింగ్ సిమ్యులేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆదిత్య రాళ్లపల్లి వంటి కీలక శాస్త్రవేత్తలు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ స్పేస్ రంగంలో అధిక వేతనాలు, మెరుగైన అవకాశాలు లభిస్తుండటంతో అనేక మంది అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా, పార్లమెంట్‌లో ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం ఇస్రోలో శాస్త్ర, సాంకేతిక విభాగాల్లో 1,600కు పైగా ఖాళీలు ఇంకా భర్తీ కావాల్సి ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story