Italy Burqa Ban in Schools: ఇటలీ ప్రధాని మరో సంచలన నిర్ణయం...బురఖాపై నిషేదం

ఇటలీలో పాఠశాల తరగతి గదుల్లో బురఖా, నిఖాబ్‌పై నిషేధం విధించారు. మొదటి సంవత్సరం తరగతుల్లో విదేశీ విద్యార్థులకు 30 శాతం పరిమితి తీసుకొచ్చారు. ప్రధాని జార్జియా మెలోనీ నిర్ణయంపై రాజకీయ వివాదం చెలరేగింది.

Rudrachander
Published on: 28 Nov 2026 2:54 PM IST
Italy Burqa Ban in Schools: ఇటలీ ప్రధాని మరో సంచలన నిర్ణయం...బురఖాపై నిషేదం
X

Italy Burqa Ban in Schools: ఇటలీలో పాఠశాల విద్యా విధానానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తరగతి గదుల్లో ముఖాన్ని పూర్తిగా కప్పే బురఖా, నిఖాబ్ ధరించడంపై నిషేధం విధించడంతో పాటు, మొదటి సంవత్సరం తరగతుల్లో విదేశీ మూలాలున్న విద్యార్థుల సంఖ్యను 30 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పులు విద్యార్థుల సమీకరణ, భాషా పరిజ్ఞానం, మత స్వేచ్ఛ, వలస విధానాలపై కొత్త చర్చకు తెరలేపాయి.

పార్లమెంట్ ఆమోదంతో చట్టంగా మారిన కొత్త నిబంధనలు

'డిక్రెటో స్కూలా' (Decreto Scuola) పేరుతో తీసుకొచ్చిన ఈ విద్యా సంస్కరణకు ఇటలీ పార్లమెంట్‌లోని ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ నవంబర్ 26న ఆమోదం తెలిపింది. మొత్తం 142 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 112 మంది వ్యతిరేకించారు. మరో నలుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అంతకుముందు నవంబర్ 20న సెనేట్ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. నవంబర్ 27న చట్టంగా మారింది. కొత్త నిబంధనల ప్రకారం పాఠశాల తరగతి గదుల్లో ముఖాన్ని పూర్తిగా కప్పే బురఖా, నిఖాబ్‌లకు అనుమతి ఉండదు. అయితే జుట్టు, మెడను మాత్రమే కప్పే హిజాబ్‌పై ఈ నిషేధం వర్తించదు. అంటే ముఖాన్ని గుర్తించడానికి వీలు లేకుండా చేసే వస్త్రధారణపైనే ఈ నిబంధన దృష్టి పెట్టింది. నిబంధన ఉల్లంఘిస్తే 200 నుంచి 1,000 యూరోల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

విదేశీ విద్యార్థుల సంఖ్యపై 30 శాతం పరిమితి

ఈ సంస్కరణలో మరో కీలక అంశం విదేశీ విద్యార్థులకు సంబంధించినది. మొదటి సంవత్సరం తరగతుల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యను గరిష్ఠంగా 30 శాతానికి పరిమితం చేయనున్నారు. అయితే ఈ నిబంధన విదేశీ పౌరసత్వం ఉన్న ప్రతి విద్యార్థికీ వర్తించదు. ఇటలీలో పుట్టని లేదా అక్కడి విద్యావ్యవస్థలో నిర్దిష్ట కాలం చదవని, ఇటాలియన్ భాషపై తగిన పట్టు లేని విద్యార్థులకు మాత్రమే ఈ పరిమితి వర్తించేలా నిబంధనలు రూపొందించారు. భాషపై అవసరమైన పరిజ్ఞానం ఉన్నవారికి మినహాయింపు ఉంటుంది. ఈ విధానం ప్రధానంగా 2027-28 విద్యా సంవత్సరం నుంచి మొదటి తరగతులకు అమల్లోకి రానుంది.

విదేశీ తల్లిదండ్రులకూ భాషా శిక్షణ

విదేశాల నుంచి వచ్చిన కుటుంబాల పిల్లలు ఇటలీ విద్యావ్యవస్థలో కలిసిపోయేందుకు ప్రభుత్వం మరో చర్యను ప్రతిపాదించింది. పిల్లలకు ఇటాలియన్ భాష అర్థం కావడంలో ఇబ్బందులు ఎదురైతే, వారి తల్లిదండ్రులకు కూడా భాషా శిక్షణ అందించనున్నారు. కుటుంబ స్థాయిలో భాషా పరిజ్ఞానం పెరిగితే పిల్లలు పాఠశాలలో త్వరగా అలవాటు పడతారన్నది ప్రభుత్వ ఉద్దేశం.

ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాల అభ్యంతరం

ప్రధాని జార్జియా మెలోనీ ఈ నిర్ణయాలను సమర్థిస్తున్నారు. ఇటలీ పాఠశాలల్లో స్థానిక పిల్లలే మైనారిటీలుగా మారే పరిస్థితి రాకూడదని, భాషా సమస్యలతో విద్యార్థులు వెనుకబడకుండా చూడటమే తమ లక్ష్యమని ఆమె చెబుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ నిబంధనలు వివక్షకు దారితీయవచ్చని విమర్శిస్తున్నాయి. పార్లమెంట్‌లో నిరసనగా 'పాఠశాలలో ఎవరూ విదేశీయులు కాదు' అనే నినాదంతో బ్యానర్ ప్రదర్శించాయి. వలసలు, మతపరమైన ఆచారాలు, విద్యలో సమాన అవకాశాలు వంటి అంశాలు ఇటలీలో రాజకీయ చర్చకు కేంద్రంగా మారాయి. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Rudrachander

Rudrachander

రుద్ర చందర్‌ తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు