Italy Gen Z Meloni: ఇటలీలో సరికొత్త రాజకీయం... మెలోనీకి దూరమౌతున్న జెన్‌జీ
ఇటలీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దేశంలోని యువత ప్రస్తుత ప్రధాని మెలోనీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. విద్యా ప్రమాణాలు, ఉద్యోగ వేతనాలు తక్కువగా ఉండటంతో పాటు, తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు.
Italy Gen Z Meloni: ఇటలీ రాజకీయాల్లో సరికొత్త మార్పులు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రధాని జార్జియా మెలోని నాయకత్వంలోని రైట్‌వింగ్ ప్రభుత్వానికి రాబోయే 2027 సార్వత్రిక ఎన్నికలకు ముందే సొంత దేశంలోనే యువత నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ముఖ్యంగా 35 ఏళ్లలోపు ఉన్న జెన్‌జీ ఓటర్లు మెలోని సర్కారుకు దూరంగా జరుగుతున్నట్లు ప్రముఖ సర్వే సంస్థ 'యుట్రెండ్' గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ వయస్సు గల ఓటర్లలో మెలోని కూటమికి కేవలం 30 శాతం కంటే తక్కువ మద్దతు మాత్రమే ఉండగా, సెంటర్ లెఫ్ట్ ప్రతిపక్ష కూటమికి దాదాపు 50 శాతం మద్దతు లభించడం అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
యువత అసంతృప్తికి ప్రధాన కారణాలు
ఇటలీలో యూరోస్టాట్, బ్యాంక్ ఆఫ్ ఇటలీ అందించిన అధికారిక నివేదికల ప్రకారం, మెలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2022 నుండి యువతకు ఉపయోగపడే బలమైన ఆర్థిక సంస్కరణలు చేపట్టకపోవడమే ఈ తీవ్ర వ్యతిరేకతకు ప్రధాన కారణం. యూరో జోన్‌లోని 21 సభ్య దేశాలలో 15 నుండి 24 ఏళ్ల వయస్సు గల యువత ఉద్యోగ అవకాశాల్లో ఇటలీ అత్యంత దిగువ స్థానంలో ఉంది. జర్మనీలో ఒక యంగ్ గ్రాడ్యుయేట్ పొందే వేతనంతో పోలిస్తే ఇటలీలోని యంగ్ గ్రాడ్యుయేట్ శ్రమకు లభించే వేతనం 80 శాతం తక్కువగా ఉంది. అంతేకాదు, మెరుగైన ఉపాధి లేక 2020 నుండి 2024 మధ్యకాలంలోనే దాదాపు 1,00,000 మంది కంటే ఎక్కువ మంది యువ పట్టభద్రులు ఇటలీని వదిలి ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. ఇక మిగతా యూరోప్ దేశాలతో పోలిస్తే ఇటలీ విద్యా రంగానికి కేటాయించే బడ్జెట్ తక్కువగా ఉండటంపై విద్యార్థి లోకం ఆగ్రహంతో ఉంది.
కఠిన చట్టాలు ... విద్యార్థుల తిరుగుబాటు
మెలోని సర్కార్ తీసుకువచ్చిన శాంతిభద్రతల చట్టాలు యువతను మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. వీధి నిరసనలు, రేవ్ పార్టీలు, గంజాయి వినియోగంపై పెట్టిన ఆంక్షలు, 14 నుండి 17 ఏళ్ల మైనర్ నేరస్థులపై విధించిన కఠిన నిబంధనలు యువత స్వేచ్ఛను హరిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. 2023 నాటి జువైనైల్ ఉత్తర్వుల వల్ల మైనర్ల జైలు జనాభా ఏకంగా 50 శాతం పెరిగింది. దీంతో ప్రభుత్వ విద్యా కోతలకు, సెక్యూరిటీ ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి 'నో మెలోని డే' పేరిట భారీ నిరసనలు చేపట్టారు. ఇక ఇదిలా ఉంటే, ఇటీవల న్యాయ వ్యవస్థ సంస్కరణలపై జరిగిన రెఫరెండంలో 35 ఏళ్లలోపు యువత ఏకంగా 67 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనగా, వారిలో 60 శాతం మంది మెలోని నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేశారు.
పురుషులు వర్సెస్ మహిళలు ... ఓటర్ల చీలిక
ఇటలీ జెన్‌జీ ఓటర్లలో మరో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. 'బోకోని యూనివర్సిటీ' నివేదిక ప్రకారం...18 నుండి 29 ఏళ్ల మధ్య ఉన్న యువకులలో 15 శాతం మంది రైట్‌వింగ్ కూటమికి మద్దతిస్తుండగా, యువతుల్లో కేవలం 4.2 శాతం మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు 5-స్టార్ మూవ్‌మెంట్ వంటి పార్టీలకు మహిళల మద్దతు 18 శాతంగా ఉంటే, పురుషుల మద్దతు 5.1 శాతానికే పరిమితమైంది. వీటికి తోడు మాజీ ఆర్మీ జనరల్ రాబర్ట్ వన్నాచీ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన 'నేషనల్ ఫ్యూచర్' పార్టీ తీవ్ర రైట్‌వింగ్ భావజాలంతో 7 శాతం ఓటు బ్యాంకును ఆకర్షిస్తూ మెలోనికి సవాలుగా మారింది. ఈ విశ్లేషణలన్నీ రాబోయే ఎన్నికల్లో సాంప్రదాయకంగా ఓటింగ్‌కు దూరంగా ఉండే ఇటలీ యువత గనక భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటే, మెలోని భవిష్యత్తును, ఇటలీ రాజకీయ దిశను మార్చే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారని స్పష్టం చేస్తున్నాయి.




