Italy Protest Laws: ఇటలీలో కొత్త చట్టాలు... నిరసనకారులపై ఉక్కుపాదం

ఇటలీలో నిరసనలపై ప్రధాని జార్జియా మెలోనీ ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకొచ్చింది. విధ్వంసానికి ఐదేళ్ల జైలు, 20 వేల యూరోల వరకు జరిమానా, మైనర్ల విషయంలో తల్లిదండ్రుల బాధ్యత, మిలాన్‌లో 500 మంది సైనికుల మోహరింపు వివరాలు తెలుసుకుందాం.

Balachander
Published on: 21 Oct 2026 10:28 AM IST
Italy Protest Laws: ఇటలీలో కొత్త చట్టాలు... నిరసనకారులపై ఉక్కుపాదం
X

Italy Protest Laws: ఇటలీలో హింసాత్మక నిరసనలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఆందోళనల పేరుతో విధ్వంసానికి పాల్పడితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, 20 వేల యూరోల వరకు జరిమానా విధించేలా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అల్లర్లలో పిల్లలు పాల్గొంటే వారి తల్లిదండ్రులపైనా నష్టపరిహారం చెల్లించే బాధ్యత పెట్టాలని నిర్ణయించింది. మైనర్ల విషయంలోనూ నిఘా, నిర్బంధ చర్యలను కఠినతరం చేసింది. మరోవైపు, మిలాన్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అదనంగా 500 మంది సైనికులను మోహరించనుంది. వారాంతంలో మిలాన్‌తో పాటు ఇటలీలోని పలు నగరాల్లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 20న జరిగిన మంత్రిమండలి సమావేశంలో భద్రత, బాల నేరాల నియంత్రణకు సంబంధించిన డిక్రీకి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ఈ చర్యల లక్ష్యం బహిరంగ ప్రదేశాల్లో హింసను అరికట్టడం, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడం.

ఐదుగురు గుమిగూడి విధ్వంసానికి పాల్పడితే కఠిన శిక్షలు

కొత్త డిక్రీ ప్రకారం, నిరసన ప్రదర్శనలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపుగా చేరి రాళ్లు, బాణసంచా లేదా కర్రలు విసిరినా, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు పాల్పడినా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, గరిష్ఠంగా 20,000 యూరోల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ముఖాలను కప్పుకొని హింసకు పాల్పడటం, ఇతరులను గాయపరచడం వంటి సందర్భాల్లో శిక్షలు మరింత పెరిగేలా నిబంధనలు ప్రతిపాదించారు. గుంపులుగా ఏర్పడి ఆస్తులను ధ్వంసం చేసేవారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నారు. సోషల్ మీడియా ద్వారా హింసాత్మక నిరసనలను ప్రేరేపించే, నిర్వహించే వ్యక్తులపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. సంబంధిత నేరం కింద దోషులుగా తేలిన వారికి 12 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

పిల్లలు అల్లర్లకు వెళ్తే తల్లిదండ్రులకూ బాధ్యత

ఈ నిర్ణయాల్లో మరో కీలక అంశం మైనర్ల పాత్ర. నిరసనల సమయంలో హింసకు పాల్పడే ప్రమాదం ఉందని అనుమానించిన మైనర్లను ముందస్తుగా నిర్బంధించే నిబంధనలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాల న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అదనపు న్యాయమూర్తులు, నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించింది. 14 ఏళ్లు దాటిన వారు చేసిన నేరాల విషయంలో, వారు తమ చర్యల గురించి అవగాహన కలిగి ఉన్నారనే ప్రాతిపదికన విచారణ సులభతరం చేసే నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, దీనికి విరుద్ధమైన పరిస్థితులను నిరూపించే అవకాశం ఉంటుంది. పిల్లలు విధ్వంసానికి పాల్పడి ఆస్తులను ధ్వంసం చేస్తే, జరిగిన నష్టానికి పిల్లలతో పాటు తల్లిదండ్రులనూ ఆర్థికంగా బాధ్యులను చేసే అంశం కూడా డిక్రీలో ఉంది. సోషల్ మీడియాలో హింసాత్మక వీడియోలు చూసి కొందరు యువకులు చిన్నచిన్న గుంపులుగా ఏర్పడి విధ్వంసానికి దిగుతున్నారనే ఆందోళనను మెలోనీ వ్యక్తం చేశారు. వస్తువులను పగలగొట్టి, దుకాణాల్లో దొంగతనాలు చేసి, వాటిని వీడియోలు తీసి ప్రచారం చేయడం ప్రమాదకర ధోరణి అని ఆమె పేర్కొన్నారు.

మిలాన్‌లో విధ్వంసం.. కోటి రూపాయలకు పైగా నష్టం

అక్టోబర్ 17, శనివారం యుద్ధాలకు, పెరుగుతున్న జీవన వ్యయానికి వ్యతిరేకంగా మిలాన్‌లో నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. తొలుత ప్రశాంతంగా సాగిన ర్యాలీ, ముఖాలు కప్పుకున్న కొందరు పోలీసులతో ఘర్షణకు దిగడంతో హింసాత్మకంగా మారింది. రాళ్లు, ఇతర వస్తువులు విసరడం, దుకాణాలను దోచుకోవడం, అడ్డంకులకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, వాటర్‌ క్యానన్లను ఉపయోగించారు. ఆదివారం కూడా హింస కొనసాగింది. నగరంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో దుకాణాలు, సూపర్‌మార్కెట్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఇటలీ రిటైల్‌ వ్యాపార సంఘం కాన్ఫ్‌కామెర్సియోను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం, మిలాన్‌ షాపింగ్‌ ప్రాంతంలో జరిగిన నష్టం సుమారు 10 లక్షల యూరోలు. అల్లర్ల సమయంలో 200 మందికి పైగా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వారిలో మైనర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.

భద్రతా చర్యలా.. నిరసన హక్కుపై ఆంక్షలా?

మిలాన్‌లో పోలీసులకు, ఇటలీ జాతీయ పోలీసు దళమైన కారబినియరీకి సహకరించేందుకు ఈ ఏడాది చివరి వరకు అదనంగా 500 మంది సైనికులను మోహరించనున్నట్లు మెలోనీ తెలిపారు. అయితే, వీధుల్లో విధులు నిర్వహించే సైనికుల అధికారాలను మరింత విస్తరించాలనే ప్రతిపాదనలపై పోలీసు సంఘాల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన డిక్రీ తక్షణమే అమల్లోకి వచ్చినప్పటికీ, అది చట్టంగా కొనసాగాలంటే 60 రోజుల్లో పార్లమెంటు ఆమోదం పొందాలి. హింసను అరికట్టడం ప్రభుత్వ బాధ్యతే అయినా, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు భంగం కలగకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. కఠిన చట్టాలు నిజంగా విధ్వంసాన్ని తగ్గిస్తాయా? లేక ప్రజల నిరసనలపై అదనపు నియంత్రణకు దారితీస్తాయా? అన్నది ఇటలీలో రానున్న రోజుల్లో కీలక చర్చగా మారనుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.