POWERR Asia Plan: జపాన్‌ పవర్‌ ఏషియా ప్లాన్‌... పెరగనున్న భారత్‌ బలం

జీ 7లో మరో కొత్త వ్యూహానికి ప్లాన్‌ సిద్దమైంది. ఇంధనం, రక్షణ, వ్యాపార విస్తరణ కోసం జపాన్‌ పవర్‌ ఏషియా ప్లాన్‌ను సిద్దం చేసింది. ఇందులో భారత్‌ కీలకం కానుంది.

Balachander
Published on: 17 Jun 2026 11:35 AM IST
POWERR Asia Plan: జపాన్‌ పవర్‌ ఏషియా ప్లాన్‌... పెరగనున్న భారత్‌ బలం
X

POWERR Asia Plan: అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసియా ఖండం వేదికగా ఒక సరికొత్త వ్యూహాత్మక కూటమికి పునాది పడుతోంది. జపాన్ నూతన ప్రధానమంత్రి సనాయ్ తకైచి ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన ‘పవర్ ఏషియా’ ప్రతిపాదన ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 దేశాల సదస్సులో ఈ ప్రణాళికను ఆమె అధికారికంగా ప్రవేశపెట్టారు. చైనా, ఉత్తర కొరియాల దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ, ఆసియా ప్రాంతంలో ఇంధన భద్రతను, సరఫరా గొలుసును బలోపేతం చేయడం ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మహా వ్యూహం కనుక అనుకున్నట్లుగా అమలులోకి వస్తే, ఆసియాలో చైనా గుత్తాధిపత్యానికి బ్రేక్ పడటంతో పాటు భారత్ అత్యంత కీలకమైన శక్తిగా ఎదిగేందుకు మార్గం సుగమం కానుంది.

ఏమిటీ ‘పవర్ ఏషియా’ ప్రాజెక్ట్?

పవర్‌ ఏషియా అంటే "Partnership On Wide Energy and Resources Resilience" అని అర్థం. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే జపాన్ ప్రధాని తకైచి ఈ ఆలోచనను పంచుకున్నారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ భాగస్వామ్యంతో గ్లోబల్ ఆయిల్ నిల్వలను పెంచడం, సంక్షోభ సమయాల్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించడం, సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన కీలక ఖనిజాల రక్షణను చేపట్టడం దీని ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధి గుండా ఉచిత, సురక్షిత నౌకాయానాన్ని కాపాడటంపై జపాన్ గట్టిగా మొగ్గు చూపుతోంది.

చైనాను పక్కన పెట్టి.. భారత్‌కు పెద్దపీట!

ఈ ప్లాన్ వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటంటే.. జపాన్-చైనాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఈ కూటమి నుండి చైనాను, ఉత్తర కొరియాను దూరం పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యూహాత్మక శూన్యతను భర్తీ చేయడానికి జపాన్‌కు ఉన్న ఏకైక నమ్మకమైన ప్రత్యామ్నాయం భారతదేశమే. ఇప్పటికే ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా, బలమైన సైనిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని స్థిరపరుచుకుంది. జీ7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో జపాన్ ప్రధాని తకైచి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

అమెరికా మద్దతు... భౌగోళిక సమీకరణాలు

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లోనూ ఇండో-పసిఫిక్ ప్రాంత రక్షణపై జపాన్ సుదీర్ఘంగా చర్చించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బలప్రయోగంతో సరిహద్దులను మార్చాలనే ప్రయత్నాలను సహించేది లేదు అని జపాన్ స్పష్టం చేసింది. రష్యా-చైనా-ఉత్తర కొరియాల రక్షణ బంధంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందాన్ని జపాన్ స్వాగతించింది. ఇక ఇదిలా ఉంటే... పవర్ ఏషియా ప్లాన్‌కు అమెరికా, జీ7 దేశాల మద్దతు లభిస్తే గనుక.. రాబోయే రోజుల్లో ఆసియాలో ఇంధన, రక్షణ రంగాలు భారత్-జపాన్ చుట్టూ తిరగడం ఖాయం. ఇది చైనాకు గట్టి ఎదురుదెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు. పవర్‌ ఏషియా కల సాకారమౌతుందా... చైనా దీనిని ముందుకు సాగనిస్తుందా...కాలమే సమాధానం చెప్పాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story