Khamenei's Funeral : అంతిమ యాత్ర కాదు.. అమెరికాపై యుద్ధ ప్రకటన.. టెహ్రాన్ వీధుల్లో ఎగిరిన రక్తపు జెండాలు

Khamenei's Funeral : ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంతిమ యాత్ర టెహ్రాన్‌లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. అమెరికా, ఇజ్రాయెల్‌లపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ జనం వీధుల్లోకి వచ్చారు.

CR Reddy
Published on: 5 July 2026 7:20 AM IST
Khameneis Funeral
X

Khamenei's Funeral

Khamenei's Funeral : ఇరాన్ దేశ చరిత్రలో అత్యంత ఉద్రిక్తమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఇటీవల దారుణ హత్యకు గురైన ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంతిమ యాత్ర టెహ్రాన్ నగరంలో అశేష జనసందోహం మధ్య సాగింది. ఇది కేవలం ఒక నాయకుడికి వీడ్కోలు పలికే సాధారణ యాత్రలా కాకుండా, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై ఇరాన్ ప్రజలు ప్రకటించిన ఒక సైలెంట్ వార్ డిక్లరేషన్‎లా కనిపించింది. ఇరాన్ వైభవాన్ని దెబ్బతీయాలని చూసిన శక్తులపై ప్రతీకారం తీర్చుకుంటామని చాటిచెబుతూ, లక్షలాది మంది ప్రజలు చేతుల్లో ఎర్రజెండాలు పట్టుకుని వీధుల్లోకి వచ్చారు. ఆకాశాన్ని తాకేలా డెత్ టు అమెరికా అంటూ ప్రజలు చేసిన నినాదాలు రాబోయే భారీ యుద్ధానికి సంకేతంగా మారుతున్నాయి.

ఖమేనీ మరణంతో రగిలిపోతున్న ఇరాన్

టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని గ్రాండ్ ముసల్లా ప్రాంగణం ఇప్పుడు శోకసంద్రంగా మారింది. తమ దేశాన్ని దశాబ్దాల పాటు నడిపించిన మహోన్నత నాయకుడిని కోల్పోవడంతో ఇరాన్ పౌరుల కళ్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. అయితే, ఈ కన్నీళ్ల వెనుక ఓటమి తాలూకు నిరాశ లేదు, శత్రువును తుదముట్టించాలనే కసితో కూడిన పట్టుదల కనిపిస్తోంది. యుద్ధంలో గాయపడిన సైనికులు, అమరులైన జవాన్ల కుటుంబాలు, చిన్నారులు, మహిళలు ఈ అంతిమ వీడ్కోలు సభకు భారీగా తరలివచ్చారు. ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ జనరల్ సయ్యద్ మాజిద్ మౌసావి కూడా ఖమేనీ శవపేటికను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఖమేనీ కన్న కలలను నిజం చేయడానికి తాము ప్రాణాలను సైతం పణంగా పెడతామని అక్కడి జనం శపథాలు చేస్తున్నారు.

టెహ్రాన్ టు మషహద్..

ప్రజల సందర్శనార్థం ఖమేనీ భౌతికకాయాన్ని జూలై 4 నుంచి 6వ తేదీ వరకు టెహ్రాన్‌లోని మోసల్లాలోనే ఉంచనున్నారు. హుస్సేన్ స్క్వేర్ నుంచి ఆజాది స్క్వేర్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించిన అనంతరం, ఆయన శవపేటికను టెహ్రాన్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర ధార్మిక నగరం కుమ్‎కు తరలిస్తారు. అక్కడ జూలై 7న అధికారిక శోకసభ జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాక్ దేశంలోని ఇస్లామిక్ పుణ్యక్షేత్రాలైన నజఫ్-కర్బలాకు వైమానిక మార్గంలో తరలించి, జూలై 8న శ్రద్ధాంజలి ఘటిస్తారు. చివరగా జూలై 9న ఇరాన్‌లోని మషహద్ నగరానికి తీసుకువచ్చి, ప్రసిద్ధ ఇమామ్ రజా దర్గాలో అలీ ఖమేనీ పార్థివ దేహాన్ని సుపుర్దు-ఎ-ఖాక్ (ఖననం) చేయనున్నారు.

డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో మరింత అగ్గి

ఇరాన్ దేశం ఈ స్థాయిలో అట్టుడుకుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మంటలకు మరింత ఆజ్యం పోశాయి. తాము ఇరాన్‌ను పూర్తిగా ఓడించామని, వారు శాంతి ఒప్పందం కోసం పాకులాడుతున్నారని ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము మంచివాళ్లం కాబట్టే, ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాల కోసం ఇరాన్‌కు ఒక వారం రోజుల పాటు సెలవు ఇచ్చామంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇరాన్ పౌరులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇప్పటివరకు అమెరికా విధిస్తున్న నిబంధనలపై ఇరాన్ ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ట్రంప్ అహంకారపూరిత వ్యాఖ్యలు, ఖమేనీ శహాదత్ కారణంగా ఇప్పుడు దేశంలోని అన్ని రాజకీయ గ్రూపులు ఒకే తాటిపైకి వచ్చి యుద్ధానికి సై అంటున్నాయి.

ఇరాన్ ఆగ్రహానికి గల ఆ 7 ప్రధాన కారణాలు

ఈ అంతిమ యాత్రలో పాల్గొన్న దాదాపు 2 కోట్ల మంది జనాన్ని చూసిన తర్వాత, ఇరాన్ దేశంలో అంతర్గత తిరుగుబాటు తెచ్చి లబ్ధి పొందవచ్చనే అమెరికా, ఇజ్రాయెల్‌ల భ్రమలు పూర్తిగా పటాపంచలయ్యాయి. ఇరాన్ శత్రుదేశాలపై నేరుగా యుద్ధానికి దిగడానికి 7 బలమైన కారణాలు కనిపిస్తున్నాయి:

* తమ అత్యున్నత ఆరాధ్య నాయకుడు అలీ ఖమేనీ హత్యకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవడం.

* ఈ ఘర్షణల వల్ల ఇరాన్‌లో 3,000 మందికి పైగా పౌరులు మరణించడం.

* అమెరికా తమపై సుదీర్ఘకాలంగా విధిస్తున్న అక్రమ ఆర్థిక ఆంక్షలు.

* ఇరాన్ చేపడుతున్న యురేనియం అణు కార్యక్రమాల పై అంతర్జాతీయ ఆంక్షలు.

* దేశ రక్షణకు కీలకమైన మిస్సైల్ ప్రోగ్రామ్‌కు చెక్ పెట్టాలని చూడటం.

* వ్యూహాత్మక ప్రాంతమైన హోర్ముజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని అమెరికా ప్రయత్నించడం.

* ఇరాన్ ఆర్థిక రంగానికి వెన్నుముక లాంటి ఎనర్జీ రంగాన్ని టార్గెట్ చేస్తూ దాడులు చేయడం.

ఈ కారణాల వల్లే ఇప్పుడు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకుంది. ఇది కేవలం సరిహద్దుల పోరు కాదు, తమ మనుగడకు సంబంధించిన యుద్ధమని ఇరాన్ ఆర్మీ హెచ్చరిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story