Kim Jong Un: కిమ్‌ సరికొత్త వ్యూహం...ఉత్తర కొరియాలో భారీ రహస్య నిర్మాణాలు

అధికారంలో ఉన్న కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఉత్తర కొరియాలోని రహస్య ప్రాంతాల్లో కట్టడాలు నిర్మిస్తున్నారు. అధునాతన సౌకర్యాలతో పాటు, క్షిపణులను ప్రయోగించగలిగే విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు.

Balachander
Published on: 11 July 2026 10:48 AM IST
Kim Jong Un: కిమ్‌ సరికొత్త వ్యూహం...ఉత్తర కొరియాలో భారీ రహస్య నిర్మాణాలు
X

Kim Jong Un: ఉత్తర కొరియాలో సాధారణ ప్రజలు తీవ్రమైన ఆహార కొరతతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే... ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన విలాసాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తాజాగా అందిన అంతర్జాతీయ శాటిలైట్ చిత్రాల ప్రకారం, కిమ్ జోంగ్ ఉన్‌కు చెందిన కనీసం తొమ్మిది అత్యంత విలాసవంతమైన రహస్య భవన సముదాయాలలో భారీ ఎత్తున పునర్నిర్మాణ పనులు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైట్ హౌస్ రక్షణ గోడలు, తలుపులను ఆధునీకరిస్తున్న శైలిలోనే కిమ్ కూడా తన ప్యాలెస్‌లను అప్‌గ్రేడ్ చేయడం ప్రారంభించారు. అయితే ట్రంప్ లాగా ఈ విషయాలను ప్రపంచానికి చెప్పకుండా, కిమ్ అత్యంత రహస్యంగా ఉంచడం అంతర్జాతీయ రక్షణ వర్గాలలో చర్చనీయాంశమైంది. ఉత్తర కొరియా అంతర్గత పరిణామాలను గమనించే 'ఎన్‌కే ప్రో' పరిశోధన సంస్థ ఈ నిర్మాణాలకు సంబంధించిన కొన్ని కీలక భౌగోళిక రాజకీయ కోణాలను విశ్లేషించింది. అవేంటో తెలుసుకుందాం.

క్షిపణి కేంద్రాలు....భారీ ఎస్టేట్లు

గత మే నెల చివరి వారం నుండి జూన్ మొదటి వారం మధ్యలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని ప్రధాన నివాసంతో పాటు, వోన్సాన్ తీరప్రాంతంలో ఉన్న ప్రైవేట్ బీచ్ రిసార్ట్, ఒక లేక్‌సైడ్ రిసార్ట్, వారి కుటుంబానికి చెందిన ఒక భారీ ఎస్టేట్‌లో ఈ మరమ్మతులు జరుగుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కుటుంబ ఎస్టేట్ ఎంత పెద్దదంటే... అందులో సైనిక అవసరాల కోసం ఏకంగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే లాంచ్ ప్యాడ్‌లు కూడా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది

అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఉత్తర కొరియా ఖజానా ఖాళీ అయినా, కిమ్ వద్దకు ఈ విలాసాలకు సరిపడా నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయనేది పెద్ద ప్రశ్న. దీనిపై స్టిమ్సన్ సెంటర్ రక్షణ నిపుణుడు మైఖేల్ మాడెన్ స్పందిస్తూ... ఇటీవలి కాలంలో రష్యా, చైనాలతో ఉత్తర కొరియాకు ఆర్థిక, సైనిక సంబంధాలు బాగా పెరిగాయని పేర్కొన్నారు. అక్కడి నుండి అందుతున్న రహస్య నిధులు, వనరుల వల్లే కిమ్ తన చిన్ననాటి జ్ఞాపకాలున్న ఈ ప్యాలెస్‌లను అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దుకోగలుగుతున్నారని విశ్లేషించారు.

ప్రచారానికి భిన్నంగా నార్త్‌ కొరియా

ఉత్తర కొరియాకు చెందిన దాదాపు సగం జనాభా పౌష్టికాహార లోపంతో బాధపడుతోంది. తాము కూడా ప్రజలతో పాటే కష్టాలు అనుభవిస్తున్నట్లు కిమ్ కుటుంబం కొన్నేళ్లుగా ప్రభుత్వ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసుకుంటోంది. ఒకవేళ కిమ్‌కు చెందిన ఏడు మిలియన్ డాలర్ల విలువైన సూపర్ యాట్లు, ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్స్, గుర్రపు పందాల మైదానాలు సామాన్య ప్రజల కంటపడితే తిరుగుబాటు వస్తుందనే భయంతోనే ఈ నిర్మాణాలను చాటుగా ఉంచుతున్నారు. అధికారంలో ఉన్న పాలకులు తమ సొంత సౌకర్యాల కోసం దేశ సంపదను ఎలా వాడుకుంటారో చెప్పడానికి కిమ్ జోంగ్ ఉన్ అనుసరిస్తున్న ఈ రహస్య వ్యూహమే ఒక ఉదాహరణ.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story