Kim Jong Un: కిమ్‌ సరికొత్త రాజకీయం...చైనాతో బలపడుతున్న బంధం...ప్రపంచానికి ఇస్తున్న తాజా సంకేతం

చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ 105వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్‌ కీలక సందేశం విడుదల చేశారు. చైనాతో బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు ఉత్తర కొరియా అధ్యక్షుడు ప్రకటించారు.

Balachander
Published on: 1 July 2026 7:30 AM IST
Kim Jong Un: కిమ్‌ సరికొత్త రాజకీయం...చైనాతో బలపడుతున్న బంధం...ప్రపంచానికి ఇస్తున్న తాజా సంకేతం
X

Kim Jong Un: ప్రపంచానికి కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియా...తాజాగా మరో సందేశాన్ని ప్రపంచానికి పంపింది. ఇప్పటి వరకు చైనాతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్టుగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ ప్రకటించారు. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ 105వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ప్రత్యేక సందేశాన్ని పంపించారు. చైనాతో ఉన్న స్నేహాన్ని చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించాడు. సోషలిజం పునాదిగా ఇరు దేశాల బంధాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తామని ప్రకటించారు. ఇప్పటికే రష్యాతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్న కిమ్‌, ఇప్పుడు చైనాతో ఉన్న బంధం తమకు ఎంత వ్యూహాత్మకమో ఈ సందేశం ద్వారా ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలు అంతర్జాతీయ దౌత్య సమీకరణాల్లో భారీ మార్పులకు సంకేతాలుగా నిలుస్తున్నాయి.

రష్యా వైపు వెళ్లినా... చైనాయే అసలు అండ!

ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా రష్యాకు చాలా దగ్గరైంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా వేలాది మంది ఉత్తర కొరియా సైనికులు రంగంలోకి దిగడం, రష్యాతో వ్యూహాత్మక రక్షణ ఒప్పందం చేసుకోవడం చూసి కిమ్ చైనాను పక్కన పెట్టేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, కిమ్ అసలు లెక్క వేరే ఉంది. రష్యాతో సైనిక బంధం ఉన్నప్పటికీ, ఉత్తర కొరియా ఆర్థిక జీవనాడి మాత్రం చైనా చేతుల్లోనే ఉంది. దక్షిణ కొరియా ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, 2024 నాటికి ఉత్తర కొరియాకు సంబంధించిన మొత్తం విదేశీ వాణిజ్యంలో ఏకంగా 98 శాతం వాటా చైనాదే! గత జూన్ 8, 9 తేదీలలో షీ జిన్‌పింగ్ దాదాపు ఏడేళ్ల తర్వాత ప్యోంగ్యాంగ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు దౌత్య, మిలిటరీ, చట్టాల అమలు రంగాలలో విస్తృత సహకారం కోసం ఒక 'సుదూర బ్లూప్రింట్'ను సిద్ధం చేసుకున్నాయి.

ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న కొరియా సైనికులు

మరోవైపు, రష్యా తరపున ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటూ ఉక్రెయిన్ దళాలకు చిక్కిన ఉత్తర కొరియా యుద్ధ ఖైదీల వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. 2025లో ఉక్రెయిన్ చేతికి చిక్కిన ఇద్దరు ఉత్తర కొరియా సైనికులు తాము దక్షిణ కొరియాకు వలస వెళ్తామని కోరడం సంచలనం సృష్టించింది. దక్షిణ కొరియా రాజ్యాంగం ప్రకారం ఉత్తర కొరియా పౌరులు కూడా తమ దేశస్థులే కాబట్టి, వారిని చేర్చుకోవడానికి సీయోల్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనిపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, దక్షిణ కొరియా ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారు. ఈ అంతర్గత బలహీనతలు బయటపడకుండా చూసుకోవడానికే, కిమ్ చైనా వంటి పెద్ద శక్తుల మద్దతును గట్టిగా కోరుకుంటున్నారనేది విశ్లేషకుల అంచనా. ఇప్పటి వరకు ఉత్తర కొరియా సరిహద్దులు దాటని సైనికులు తొలిసారిగా విదేశీ గడ్డపై అడుగుపెట్టడంతో...ఇదే అదునుగా ఆ దేశాన్ని వదిలిపోవాలని చూస్తున్నారు. దీంతో ఉత్తర కొరియాలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story