Kuwait Airport: కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ డ్రోన్ల దాడి.. విమానాల రాకపోకలు బంద్, ఎమర్జెన్సీ!

Kuwait Airport: గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా ఇరాన్ సంచలన డ్రోన్ దాడికి పాల్పడింది.

Arun Chilukuri
Published on: 3 Jun 2026 2:08 PM IST
Kuwait Airport
X

Kuwait Airport: కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ డ్రోన్ల దాడి.. విమానాల రాకపోకలు బంద్, ఎమర్జెన్సీ!

Kuwait Airport: మిడిల్ ఈస్ట్‌లో (Middle East) ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ (Iran) డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇందులో భాగంగానే తాజాగా కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (Kuwait International Airport) లక్ష్యంగా ఇరాన్ దారుణమైన డ్రోన్‌ దాడికి పాల్పడింది. ఈ దాడి కారణంగా విమానాశ్రయ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని కువైట్ సైన్యం అధికారికంగా వెల్లడించింది.

డ్రోన్ దాడి నేపథ్యంలో కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి (Emergency) ప్రకటించింది. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేసి, విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. కువైట్‌కు రావాల్సిన పలు అంతర్జాతీయ విమానాలను దారి మళ్లించి పక్క దేశాల్లో ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇరాన్‌లోని గెరుక్, ఖేష్మ్‌ ద్వీపాలపై గత శని, ఆదివారాల్లో అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. కువైట్‌లోని అల్ సలేమ్ వైమానిక స్థావరం, బహ్రెయిన్‌లోని ఈసా వైమానిక స్థావరం సహా అమెరికా బలగాలున్న అన్ని ప్రాంతాలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా చర్యల వల్ల హర్మూజ్ జలసంధి భద్రతకు ముప్పు వాటిల్లితే అగ్రరాజ్యం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.

ఇరాన్ డ్రోన్ దాడులు ఉధృతం కావడంతో కువైట్‌, బహ్రెయిన్ ప్రభుత్వాలు తమ దేశ ప్రజలను అప్రమత్తం చేశాయి. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాలు మరియు బంకర్లలో తలదాచుకోవాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశాయి.

మరోవైపు, గల్ఫ్ దేశాలపైకి టెహ్రాన్ (ఇరాన్) ప్రయోగించిన పలు బాలిస్టిక్ క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్‌లను గాల్లోనే విజయవంతంగా కూల్చివేసినట్లు అమెరికా సైన్యం (US Military) ప్రకటించింది. అలాగే హర్మూజ్ జలసంధి మీదుగా ఇరాన్‌ వైపు వెళ్తున్న ఒక అనుమానాస్పద నౌకపై తాము కూడా దాడి చేశామని అమెరికా వెల్లడించడంతో గల్ఫ్ రీజియన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story