నకిలీ పాస్‌పోర్టుతో విదేశాలకు ఎస్కేప్ ప్లాన్.. లష్కరే తీవ్రవాది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వెనుక అసలు కథ.

లష్కరే తోయిబా ఉగ్రవాది ఉస్మాన్ జట్ అలియాస్ చిని ఎన్‌ఐఏ విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు వెల్లడించాడు.

Arun Chilukuri
Published on: 18 May 2026 2:57 PM IST
నకిలీ పాస్‌పోర్టుతో విదేశాలకు ఎస్కేప్ ప్లాన్.. లష్కరే తీవ్రవాది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వెనుక అసలు కథ.
X

నకిలీ పాస్‌పోర్టుతో విదేశాలకు ఎస్కేప్ ప్లాన్.. లష్కరే తీవ్రవాది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వెనుక అసలు కథ.

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు, దేశవ్యాప్తంగా 'స్లీపర్ సెల్' నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు పాకిస్థాన్ నుంచి చొరబడిన లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాది మహ్మద్ ఉస్మాన్ జట్ అలియాస్ 'చిని' వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో మరిన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనగర్‌లో రహస్యంగా 'హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్' చేయించుకున్న ఈ ఉగ్రవాది అసలు ప్లాన్ విదేశాలకు పారిపోవడమేనని తేలింది.

పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన ఉస్మాన్ జట్ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పాక్‌లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాల్లో కశ్మీర్ గురించి తనకు పూర్తిగా మైండ్ వాష్ చేశారని, అయితే ఉత్తర కశ్మీర్ మార్గం గుండా భారత్‌లోకి చొరబడిన తర్వాత ఇక్కడి వాస్తవ పరిస్థితులు చూసి తన ఆలోచన మారిపోయిందని చెప్పాడు. ఇక్కడి సాధారణ ప్రజల జీవితాలను, శాంతియుత వాతావరణాన్ని చూశాక.. తాను వచ్చిన ఉగ్రవాద లక్ష్యాన్ని పక్కన పెట్టేసినట్లు విచారణలో పేర్కొన్నాడు.

తీవ్రమైన బట్టతల సమస్యతో బాధపడుతూ ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఉస్మాన్ జట్‌కు శ్రీనగర్‌లోని స్థానిక ఓవర్‌గ్రౌండ్ వర్కర్ల (OGW) నెట్‌వర్క్ ద్వారా ఓ దుకాణదారుడితో పరిచయం ఏర్పడింది. ఆ దుకాణదారుడు స్వయంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడని తెలియడంతో, అతడి సాయంతోనే శ్రీనగర్‌లోని ఒక ప్రముఖ క్లినిక్‌లో రహస్యంగా ఉస్మాన్‌కు సర్జరీ చేయించారు. ఈ ట్రీట్‌మెంట్ కోసం సదరు ఉగ్రవాది క్లినిక్‌లోనే కొన్ని రాత్రులు గడపడం గమనార్హం.

శస్త్రచికిత్స ముగిసిన తర్వాత ఉస్మాన్ జట్ తన సహచరుడు అబు హురైరాతో కలిసి ప్యాసింజర్ వాహనంలో జమ్మూకు, అక్కడి నుంచి స్లీపర్ బస్సు ద్వారా పంజాబ్‌లోని మలేర్‌కోట్లకు వెళ్లాడు. అక్కడ తలదాచుకున్న సమయంలో పట్టుబడకుండా ఉండేందుకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నించడం, ల్యాప్‌టాప్‌లో టర్కిష్ వెబ్ సిరీస్‌లు చూడటం లాంటివి చేసినట్లు దర్యాప్తులో తేలింది.

భారతదేశంలో నకిలీ ఆధార్, పాన్ కార్డుల ద్వారా నకిలీ పాస్‌పోర్ట్ పొంది విదేశాలకు పారిపోవాలనేది ఉస్మాన్ అసలు వ్యూహం. గతంలో 2012లో భారత్‌లోకి చొరబడి, 2024లో జైపూర్ నుండి నకిలీ పాస్‌పోర్టుతో ఇండోనేషియా, గల్ఫ్ దేశాలకు పారిపోయిన కరాచీ ఉగ్రవాది ఉమర్ అలియాస్ ‘ఖర్గోష్’ తరహాలోనే తాను కూడా దేశం దాటాలని ప్లాన్ చేసినట్లు ఉస్మాన్ అంగీకరించాడు. కాగా, ఈ ఉగ్రవాది ఇచ్చిన సమాచారంతో కశ్మీర్‌లో చురుగ్గా పనిచేస్తున్న లష్కర్ OGW నెట్‌వర్క్, 'అల్ ఫలాహ్ మాడ్యూల్' లింకులను ఛేదించేందుకు ఎన్‌ఐఏ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story