Malawi Fuel Crisis: ఆఫ్రికన్‌ దేశాన్ని కుదిపేస్తున్న ఇంధన సంక్షోభం... రొట్టెముక్కకోసం అవయవాలను అమ్ముకుంటున్న జనం

ఆఫ్రికా దేశం మలావిలో తీవ్ర ఇంధన సంక్షోభం నెలకొంది. పెట్రోల్ కోసం గంటల తరబడి క్యూలు, బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరలు, వ్యాపారాలపై ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Rudrachander
Published on: 20 Nov 2026 12:21 PM IST
Malawi Fuel Crisis: ఆఫ్రికన్‌ దేశాన్ని కుదిపేస్తున్న ఇంధన సంక్షోభం... రొట్టెముక్కకోసం అవయవాలను అమ్ముకుంటున్న జనం
X

Malawi Fuel Crisis: ఒకప్పుడు పెట్రోల్‌ బంకుకు వెళ్లి నిమిషాల్లో ఇంధనం నింపుకొని వచ్చే పరిస్థితి.. ఇప్పుడు గంటల తరబడి క్యూలో నిలబడినా పెట్రోల్‌ దొరుకుతుందో లేదో తెలియని దుస్థితి. ఆఫ్రికా దేశమైన మలావిలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం కోసం రాత్రంతా బంకుల ముందు వేచి చూడాల్సి వస్తోంది. రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో పాటు చిన్న వ్యాపారాలు కూడా మూతపడే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు పెట్రోల్‌ విక్రయాలు జరుగుతుండటంతో సామాన్యులపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది.

4 గంటలు క్యూలో ఉంటేనే 20 లీటర్ల పెట్రోల్‌!

మలావిలోని బ్లాంటైర్‌ నగరానికి చెందిన 40 ఏళ్ల కెన్‌ మ్హాంగో పరిస్థితి ఈ సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది. వాహనాల కొనుగోలు, అమ్మకాల వ్యాపారం చేసే ఆయనకు కొన్ని రోజులుగా పెట్రోల్‌ దొరకలేదు. ఓ పెట్రోల్‌ ట్యాంకర్‌ వస్తోందని స్నేహితుడు చెప్పడంతో సమీపంలోని బంకుకు వెళ్లారు. అప్పటికే 12 మంది క్యూలో ఉన్నారు. కొద్దిసేపటికే మినీ బస్సుల డ్రైవర్లు, మోటార్‌ సైకిల్‌ టాక్సీ నిర్వాహకులు వచ్చి క్యూలను దాటేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. చివరకు నాలుగు గంటలు వేచి ఉంటే కానీ ఆయనకు 20 లీటర్ల పెట్రోల్‌ లభించలేదు. మరికొందరు రాత్రంతా క్యూలోనే గడిపారు.

బంకుల వద్ద ఘర్షణలు.. ప్రాణాలు తీస్తున్న కొరత

ఇంధనం కోసం ప్రజలు పోటీ పడుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు హింసాత్మకంగా మారుతున్నాయి. బంకులకు ఎప్పుడు ఇంధనం వస్తుందో అధికారులు రోజువారీ షెడ్యూళ్లు ప్రకటిస్తున్నప్పటికీ, ట్యాంకర్లు సమయానికి చేరుతాయన్న నమ్మకం లేకుండా పోయింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, బ్లాంటైర్‌లో ఇంధనం కోసం ఏర్పడిన గందరగోళంలో ఓ వాహనం ఢీకొనడంతో బంకు ఉద్యోగి మరణించాడు. బ్లాంటైర్‌ మేయర్‌పై కూడా పెట్రోల్‌ క్యూ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి దాడి ఆరోపణలతో కేసు నమోదైంది. ప్రస్తుతం ఒక్కో వాహనదారుడికి రోజుకు 20 లీటర్ల వరకే ఇంధనం ఇస్తున్నట్లు సమాచారం.

బ్లాక్‌ మార్కెట్‌లో రెట్టింపు భారం

బంకుల్లో సరిపడా పెట్రోల్‌ దొరకకపోవడంతో అక్రమ విక్రయదారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెన్‌ మ్హాంగో తన తండ్రి అవసరం కోసం కేవలం రెండు లీటర్ల పెట్రోల్‌ను 30,000 మలావియన్‌ క్వాచాకు (సుమారు 17.31 డాలర్లు) కొనుగోలు చేశారు. గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ గణాంకాల ప్రకారం మలావిలో లీటరు పెట్రోల్‌ ధర సుమారు 3.24 డాలర్లు. ప్రపంచ సగటు ధర 1.52 డాలర్లతో పోలిస్తే ఇది రెండింతలకుపైగా ఉంది. అనుమతి లేకుండా పెట్రోల్‌ విక్రయించడం అక్కడ చట్టవిరుద్ధం. అయినప్పటికీ కొరతను ఆసరాగా చేసుకుని కొందరు అధిక ధరలకు ఇంధనం అమ్ముతున్నారు. సరైన భద్రత లేకుండా ఇళ్లలో పెట్రోల్‌ నిల్వ చేయడం వల్ల అగ్నిప్రమాదాలు, పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇంధన పేలుళ్ల కారణంగా కనీసం ఆరుగురు మరణించినట్లు మలావికి చెందిన నేషన్‌ పత్రిక వెల్లడించింది.

వ్యాపారాలు కుదేలు.. ఆదాయం లేక ప్రజల అవస్థలు

ఇంధన కొరత ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాలేదు. కెన్‌ మ్హాంగో నిర్వహిస్తున్న గ్యారేజీకి వాహనాల మరమ్మతుల కోసం వచ్చే కస్టమర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పెట్రోల్‌ లేక వాహనాలను నడపలేకపోవడంతో వ్యాపారం దెబ్బతింటోంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లింబే ప్రాంతానికి చెందిన మోటార్‌ సైకిల్‌ టాక్సీ డ్రైవర్‌ తడాలా కచింగ్వే పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గతంలో రోజువారీ సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునేవారు. ఇప్పుడు ఇంధనం దొరకక ఆదాయం తగ్గిపోయింది. కుటుంబానికి ఉదయం ఆహార పదార్థాలు కొనడానికి కూడా డబ్బులు మిగలడం లేదని ఆయన చెబుతున్నారు.

ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి

మరోవైపు ఇంధన కొరత, విద్యుత్‌ కోతలు, విదేశీ మారకద్రవ్య సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. నవంబర్‌ 17న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని మానవ హక్కుల సంఘాల కూటమి (HRDC) నిర్ణయించింది. ఇంధన శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. అయితే భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పడంతో ఆందోళనలను వాయిదా వేశారు. ఇంధన దిగుమతులకు అవసరమైన నిధులు, విదేశీ మారకద్రవ్యం, రవాణా సంబంధిత సమస్యల వల్లే సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని మలావి ఇంధన మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. సరఫరాను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.

Rudrachander

Rudrachander

రుద్ర చందర్‌ తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు