Medical Marvel : తల్లి ఒక్కరే.. కానీ తండ్రులు వేర్వేరు.. 50 ఏళ్ల తర్వాత కవలల జీవితాల్లో షాకింగ్ నిజం
Medical Marvel : ఒకే తల్లికి పుట్టిన కవలల తండ్రులు వేర్వేరు అని తేలింది. బ్రిటన్‌లో వెలుగుచూసిన ఈ మెడికల్ మిస్టరీని 'హెటెరోప్యాటర్నల్ సూపర్‌ఫెకండేషన్' అని వైద్యులు తెలిపారు.
UK Twins
Medical Marvel : ప్రకృతి చేసే వింతలు ఒక్కోసారి సైన్స్‌కే సవాల్ విసురుతుంటాయి. బ్రిటన్‌లో వెలుగుచూసిన ఒక అసాధారణ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఒకే తల్లికి జన్మించిన కవల పిల్లల తండ్రులు వేర్వేరు అని తేలడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. వినడానికి ఇది ఏదో సినిమా కథలా అనిపించినా, వైద్య పరిభాషలో దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌లో నివసించే మిచెల్, లావినియా ఓస్బోర్న్ గత 50 ఏళ్లుగా తాము కవలలమని నమ్ముతూ వచ్చారు. వీరిద్దరూ కొద్ది నిమిషాల వ్యవధిలోనే జన్మించారు. అయితే తమ తండ్రి విషయంలో వీరికి ఎప్పుడూ ఏదో ఒక అనుమానం ఉండేది. ముఖ్యంగా మిచెల్ తన తండ్రిగా చెప్పబడిన వ్యక్తి పోలికలతో మ్యాచ్ కాకపోవడంతో, ఆ అనుమానం బలపడింది. చివరకు ఒక డీఎన్ఏ కిట్ ద్వారా పరీక్ష చేయించుకోగా, అది వారిని షాక్ కు గురిచేసింది. ఇద్దరి తల్లి ఒక్కరే అయినప్పటికీ, వారి తండ్రులు వేర్వేరు అని ఆ నివేదికలో వెల్లడైంది.
సైన్స్ ఏమంటోంది?
వైద్య పరిభాషలో ఈ అరుదైన స్థితిని హెటెరోప్యాటర్నల్ సూపర్‌ఫెకండేషన్ అని పిలుస్తారు. సాధారణంగా స్త్రీ శరీరంలో ఒకే చక్రంలో రెండు అండాలు విడుదలైనప్పుడు ఇలా జరుగుతుంది. అతి తక్కువ సమయ వ్యవధిలో ఇద్దరు వేర్వేరు పురుషులతో శారీరక సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆ రెండు అండాలు వేర్వేరు స్పెర్మ్‌లతో ఫలదీకరణం చెందుతాయి. దీనివల్ల ఒకే కాన్పులో జన్మించినప్పటికీ, పిల్లలకు వేర్వేరు తండ్రులు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటివి కేవలం 24 కంటే తక్కువ కేసులు మాత్రమే నమోదయ్యాయి. బ్రిటన్‌లో ఇదే మొదటి కేసుగా భావిస్తున్నారు.
తండ్రుల వేట.. దొరికిన సమాధానం
తల్లి చెప్పిన వ్యక్తి తమ తండ్రి కాదని తేలడంతో, ఆ సోదరీమణులు తమ అసలు తండ్రుల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా మిచెల్ తన తండ్రి అలెక్స్ అని తెలుసుకుంది. అయితే అలెక్స్ డీఎన్ఏ లావినియాతో మ్యాచ్ కాలేదు. దీంతో మరింత పరిశోధించగా, లావినియా తండ్రి ఆర్థర్ అని తేలింది. ప్రస్తుతం ఈ ఇద్దరు సోదరీమణులు తమ తండ్రులతో మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. లావినియా స్పందిస్తూ.. "మాకు ఎప్పుడూ ఏదో తేడాగా అనిపించేది, కానీ ఇప్పుడు అసలు నిజం తెలియడంతో చాలా ప్రశాంతంగా ఉంది" అని చెప్పుకొచ్చింది.
దురదృష్టవశాత్తు, మిచెల్‌కు డీఎన్ఏ ఫలితాలు వచ్చిన రోజే వారి తల్లి మరణించింది. దీనివల్ల ఆ సమయంలో అసలు ఏం జరిగింది? తల్లి ఈ నిజాన్ని ఎందుకు దాచింది? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఎప్పటికీ లభించని రహస్యాలుగానే ఉండిపోయాయి. ఏది ఏమైనప్పటికీ, గడిచిన 50 ఏళ్లుగా కవలలుగా పెరిగిన వీరు, ఇప్పుడు సాంకేతికంగా సవతి సోదరీమణులుగా మారడం ఒక మధురమైన వింతగా మిగిలిపోయింది.




