Melania Trump : ఎప్‌స్టైన్‌తో నాకు సంబంధం లేదు.. అదంతా అబద్ధం.. మెలానియా ట్రంప్ సంచలనం

Melania Trump : మెలానియా ట్రంప్ సంచలన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో సంబంధాలపై క్లారిటీ ఇస్తూ.. బాధితుల కోసం బహిరంగ విచారణ జరపాలని అమెరికా కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు.

CR Reddy
Published on: 10 April 2026 11:14 AM IST
Melania Trump
X

Melania Trump

Melania Trump : అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై వస్తున్న తీవ్రమైన ఆరోపణలను తిప్పికొట్టడమే కాకుండా, స్వయంగా వైట్ హౌస్ వేదికగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి క్లారిటీ ఇచ్చారు. వివాదాస్పద ఆర్థికవేత్త, లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఆమె స్పష్టం చేశారు. తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు కొందరు కావాలనే ఇదంతా చేస్తున్నారని మెలానియా మండిపడ్డారు.

మెలానియా ట్రంప్ తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. జెఫ్రీ ఎప్‌స్టైన్ లేదా అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్ గిస్లీన్ మాక్స్‌వెల్‌తో తనకు ఎప్పుడూ స్నేహం లేదని ఆమె స్పష్టం చేశారు. "నన్ను అప్రతిష్ట పాలు చేయాలని చూసే వారికి అసలు నైతికత లేదు. ఎప్‌స్టైన్‌తో నన్ను ముడిపెడుతూ వస్తున్న తప్పుడు ప్రచారానికి ఇక్కడితో ఫుల్‌స్టాప్ పడాలి" అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. న్యూయార్క్, ఫ్లోరిడా వంటి నగరాల్లో సోషల్ సర్కిల్స్ అప్పుడప్పుడు కలిసే అవకాశం ఉంటుందని, అలా కలిసినంత మాత్రాన వారు తనకు అత్యంత సన్నిహితులు కాదని మెలానియా వివరించారు.

న్యాయశాఖ విడుదల చేసిన 2002 నాటి ఒక ఈమెయిల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందులో మాక్స్‌వెల్‌ను ఉద్దేశించి డియర్ జి అంటూ మెలానియా రాసినట్లు ఉంది. దీనిపై స్పందిస్తూ.. అది కేవలం ఒక సాధారణ ఈమెయిల్ మాత్రమేనని, అందులో ఎలాంటి రహస్యాలు లేవని ఆమె పేర్కొన్నారు. అలాగే ఎప్‌స్టైన్ ఇంట్లో దొరికిన ఫొటోలో ట్రంప్ దంపతులు, మాక్స్‌వెల్‌తో కలిసి ఉండటంపై కూడా ఆమె వివరణ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్‌ను తాను ఎప్‌స్టైన్ ద్వారా కలవలేదని, 1998లో న్యూయార్క్‌లో జరిగిన ఒక పార్టీలో మొదటిసారి కలిశానని ఆమె స్పష్టం చేశారు.

ఎప్‌స్టైన్ వల్ల నష్టపోయిన బాధితుల కోసం మెలానియా ఒక అడుగు ముందుకు వేశారు. అమెరికా కాంగ్రెస్ తక్షణమే బాధితులకు బహిరంగ విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రతి మహిళా తన బాధను, కథను ప్రపంచానికి చెప్పుకునే అవకాశం ఉండాలని, అప్పుడే నిజం ఏంటో అందరికీ తెలుస్తుందని ఆమె అన్నారు. మెలానియా చేసిన ఈ ప్రతిపాదనకు డెమోక్రాట్లు కూడా మద్దతు తెలపడం విశేషం. హౌస్ ఓవర్‌సైట్ కమిటీ టాప్ డెమోక్రాట్ రాబర్ట్ గార్సియా కూడా వెంటనే విచారణ చేపట్టాలని రిపబ్లికన్ ఛైర్మన్‌ను కోరారు.

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఎప్‌స్టైన్ కేసులో ఎదుర్కొంటున్న విమర్శల నుంచి బయటపడాలని చూస్తున్న తరుణంలో మెలానియా ఈ ప్రకటన చేయడం రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇప్పటికే లక్షలాది పేజీల పత్రాలు విడుదలైనప్పటికీ, మెలానియా నేరుగా రంగంలోకి దిగడం ద్వారా ట్రంప్ కుటుంబానికి ఉన్న క్లీన్ ఇమేజ్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి మెలానియా డిమాండ్ చేసినట్లుగా బాధితుల కోసం కాంగ్రెస్ బహిరంగ విచారణ చేపడుతుందో లేదో వేచి చూడాలి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story