మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో భారీ అంతరాయం.. కారణం ఇదేనా..?

Microsoft: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీపై ఆధారపడి నడిచే ఎన్నో వ్యాపారాలు, సంస్థలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన మైక్రోసాఫ్ట్ 365

G Krishna
Published on: 13 Nov 2026 4:52 PM IST
Microsoft
X

మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో భారీ అంతరాయం.. కారణం ఇదేనా..?

Microsoft: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీపై ఆధారపడి నడిచే ఎన్నో వ్యాపారాలు, సంస్థలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన మైక్రోసాఫ్ట్ 365 (Microsoft 365) సేవలకు అకస్మాత్తుగా అంతరాయం కలగడంతో గ్లోబల్ వైడ్‌గా కంపెనీల కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. నవంబర్ 12న రాత్రి ఆలస్యంగా ప్రారంభమైన ఈ సాంకేతిక సమస్య కారణంగా విమాన సర్వీసులు సైతం రద్దు కావాల్సిన పరిస్థితి తలెత్తింది.

అవుట్‌లుక్, టీమ్స్ సేవలు బంద్.. భారత్‌ సహా పలు దేశాల్లో ప్రభావం

ఈ అనూహ్య అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆఫీస్ కార్యకలాపాలకు అత్యంత కీలకమైన అవుట్‌లుక్ ఇమెయిల్ (Outlook Email), టీమ్స్ మీటింగ్ టూల్స్ (Teams) , ఇతర ముఖ్యమైన క్లౌడ్ సేవలను ఎవరూ యాక్సెస్ చేయలేకపోయారు. అమెరికాలోనే కాకుండా భారతదేశం, జపాన్ సహా అనేక దేశాల్లో ప్రైవేట్ కంపెనీలు, బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు, చివరికి న్యాయస్థానాల కార్యకలాపాలు కూడా ఈ సాంకేతిక సమస్య వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

సైబర్ దాడిపై స్పష్టతనిచ్చిన మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఇది ఎవరో చేసిన సైబర్ దాడి అని కొందరు ప్రచారం చేయగా, మరికొందరు అదుపు తప్పిన ఒక ఏఐ ఏజెంట్ (AI Agent) కారణంగానే ఈ సమస్య వచ్చిందని రకరకాలుగా చెప్పుకున్నారు. అయితే ఈ వైరల్ ఆరోపణలన్నింటినీ మైక్రోసాఫ్ట్ ఖండించింది. ఇది సైబర్ దాడి అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్ కోపైలట్, ఏజెంట్స్ అండ్ ప్లాట్‌ఫామ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చార్లెస్ లమన్నా స్పందిస్తూ.. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఇది ఎలాంటి దురుద్దేశపూర్వక చర్య లేదా సైబర్‌దాడి ఫలితంగా జరిగిందనేందుకు ఎటువంటి సూచన లేదని ధృవీకరించారు.

సమస్య పరిష్కారానికి రంగంలోకి టెక్ నిపుణులు

మైక్రోసాఫ్ట్ 365 సేవలను యథాస్థితికి తీసుకువచ్చేందుకు కంపెనీ ఇంజనీర్లు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. సేవలను మెరుగుపరచడానికి తాము చేసిన అప్‌డేట్లు ఆశించిన విధంగా పనిచేయలేదని మైక్రోసాఫ్ట్ అంగీకరించింది. ప్రస్తుతం తలెత్తిన ట్రాఫిక్ అసమతుల్యత నేపథ్యంలో సర్వర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషిస్తున్నామని తెలిపింది. తాజా అప్‌డేట్ల కోసం మైక్రోసాఫ్ట్ 365 అడ్మిన్ సెంటర్‌లోని EX1550543, MO1550821 కోడ్స్‌ను పరిశీలించాలని, లేదా అధికారిక లింక్ ద్వారా వివరాలు తెలుసుకోవాలని కంపెనీ సూచించింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.