Israel Lebanon War : సీజ్‌ఫైర్ ఉత్తుత్తిదేనా? 10 నిమిషాల్లో 100 దాడులు.. లెబనాన్‌ను వల్లకాడు చేస్తున్న ఇజ్రాయెల్

Israel Lebanon War : మిడిల్ ఈస్ట్ సీజ్‌ఫైర్ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్, అమెరికా స్పష్టం చేశాయి. ఒప్పందం జరిగిన 24 గంటల్లోనే ఇజ్రాయెల్ 100 దాడులతో లెబనాన్‌ను దడదడలాడించింది.

CR Reddy
Published on: 9 April 2026 9:54 AM IST
Israel Lebanon War
X

Israel Lebanon War

Israel Lebanon War : మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం ముగిసిపోతుందని అందరూ భావించారు కానీ, వాస్తవం దానికి భిన్నంగా ఉంది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన యుద్ధ విరామ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తుంగలో తొక్కింది. సీజ్‌ఫైర్ అమలులోకి వచ్చిన కొద్దిసేపటికే లెబనాన్‌పై భీకర దాడులు చేసింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలో దాదాపు 100 చోట్ల బాంబుల వర్షం కురిపించి వందలాది మంది ప్రాణాలను బలిగొంది. దీనిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్ స్పందిస్తూ.. ఈ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని, వాషింగ్టన్ గానీ, ఇజ్రాయెల్ గానీ లెబనాన్‌ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని కుండబద్దలు కొట్టారు.

నెతన్యాహు కండిషన్స్ అప్లై

ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని, ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తామని చెప్పారు. అయితే దీనికి ఆయన కొన్ని షరతులు పెట్టారు. ఇరాన్ వెంటనే హోర్ముజ్ స్ట్రెయిట్ (సముద్ర మార్గం) తెరవాలని, అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. ఇరాన్‌తో కుదిరిన ఈ రెండు వారాల విరామంలో లెబనాన్ మాత్రం చేర్చబడలేదని ఆయన స్పష్టంగా తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అంటే లెబనాన్‌పై దాడులు ఆగవని ఆయన సంకేతాలిచ్చారు.

హిజ్బుల్లానే టార్గెట్ - ట్రంప్ క్లారిటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇజ్రాయెల్ చర్యలను సమర్థించారు. లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న ఆపరేషన్‌కు తమ మద్దతు ఉంటుందన్నారు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కుదిరిన తాజా ఒప్పందంలో హిజ్బుల్లాకు చోటు లేదని ఆయన వివరించారు. ఒప్పందం ఉన్నా ఎందుకు దాడులు జరుగుతున్నాయని మీడియా ప్రశ్నించగా.. "అవును, వారిని ఇందులో చేర్చలేదు. హిజ్బుల్లా వల్లనే లెబనాన్‌ను మినహాయించాం. ఇది ఒక ప్రత్యేకమైన పోరాటం. దీనిని కూడా త్వరలోనే పరిష్కరిస్తాం" అని ట్రంప్ సమాధానమిచ్చారు.

లెబనాన్ విలవిల

మిడిల్ ఈస్ట్‌లో లెబనాన్ ఒక చిన్న దేశం అయినప్పటికీ, అక్కడ హిజ్బుల్లా గ్రూప్ బలంగా ఉంది. వీరు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇజ్రాయెల్ దృష్టిలో హిజ్బుల్లా ఉన్నంత కాలం లెబనాన్ ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు. అందుకే ఒకవైపు ఇరాన్‌తో చర్చలు సాగిస్తూనే, మరోవైపు హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ రెండు వారాల యుద్ధ విరామం కేవలం ఒక వ్యూహాత్మక విరామమే తప్ప, పూర్తిస్థాయి శాంతి కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. లెబనాన్ ప్రజలు మాత్రం ఈ దాడులతో నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story