Donald Trump : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ట్రంప్ అల్టిమేటం.. ఇరాన్ అంతమే లక్ష్యమా?

Donald Trump : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్‌కు డోనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. వెంటనే శాంతి ఒప్పందం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు.

CR Reddy
Published on: 3 April 2026 6:35 AM IST
Donald Trump : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ట్రంప్ అల్టిమేటం.. ఇరాన్ అంతమే లక్ష్యమా?
X

Donald Trump : మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరులో ఇప్పుడు అమెరికా మరింత దూకుడు పెంచింది. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి ఇరాన్‌కు నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. సమయం మించిపోకముందే అమెరికాతో శాంతి ఒప్పందం చేసుకోవాలని, లేదంటే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం మాటలతోనే కాకుండా, ఇరాన్‌లోని ఒక కీలకమైన భారీ వంతెనను అమెరికా-ఇజ్రాయెల్ దళాలు కూల్చివేసినట్లుగా చెబుతున్న ఒక వీడియోను కూడా ట్రంప్ షేర్ చేశారు. ఇది ఇరాన్ సైన్యంపై తీవ్ర ఒత్తిడి పెంచే వ్యూహంగా కనిపిస్తోంది.

ఇరాన్ అధ్యక్షుడి ఘాటు స్పందన

ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెస్కియాన్ తీవ్రంగా స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కేవలం సైనిక స్థావరాలనే కాకుండా, సామాన్య ప్రజలకు సేవ చేసే ఆస్పత్రులు, మెడికల్ రీసెర్చ్ సెంటర్లపై కూడా దాడులు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. మందుల తయారీ సంస్థలు, పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ వంటి వాటిని లక్ష్యంగా చేసుకోవడం మానవత్వానికే విరుద్ధమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడుల విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO), రెడ్ క్రాస్ వంటి అంతర్జాతీయ సంస్థలు స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు.

మిసైల్ దాడులతో హోరెత్తుతున్న గల్ఫ్

ట్రంప్ ఎన్ని హెచ్చరికలు చేసినా తాము తగ్గేదే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. గురువారం రోజున ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భారీగా క్షిపణి దాడులు చేసింది. ఇరాన్ నుంచి ముప్పు దాదాపు తగ్గిపోయిందని ట్రంప్ ఒకవైపు ప్రకటిస్తుంటే, ఇరాన్ మాత్రం ఆకాశం నుంచి నిప్పులు కురిపిస్తూ యుద్ధం ఇంకా ముగియలేదని సంకేతాలిస్తోంది. ఇరాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జుల్ఫికారీ మాట్లాడుతూ.. తాము ఇంకా రహస్య ఆయుధాలను బయటకు తీయలేదని, అమెరికా చేరుకోలేని చోట్ల తమ ఆయుధ కర్మాగారాలు ఉన్నాయని సవాల్ విసిరారు.

చమురు సరఫరాపై నీలినీడలు

ప్రపంచ దేశాలకు పెద్ద తలనొప్పిగా మారింది హార్ముజ్ జలసంధి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20 శాతం ఈ మార్గం నుంచే వెళ్తుంది. ప్రస్తుతం దీనిపై ఇరాన్ పట్టు సాధించడంతో చమురు సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ మార్గాన్ని తిరిగి తెరిపించేందుకు బ్రిటన్ సహా 30 దేశాలు చర్చలు జరుపుతున్నాయి. బలాత్కారంగానైనా ఈ మార్గాన్ని తెరిపించవచ్చని ట్రంప్ చెబుతున్నప్పటికీ, అది అమెరికా బాధ్యత మాత్రమే కాదని, చమురుపై ఆధారపడే దేశాలన్నీ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

నిర్ణయాత్మక పోరు దిశగా మధ్యప్రాచ్యం

మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఇప్పుడు చావో రేవో అన్నట్లుగా తయారైంది. ఒకవైపు అమెరికా తన సైనిక శక్తితో ఇరాన్‌ను లొంగదీసుకోవాలని చూస్తుంటే, మరోవైపు ఇరాన్ తన మిత్రదేశాల సాయంతో ప్రతిదాడులు చేస్తోంది. ఇరాన్ వద్ద ఉన్న రహస్య ఆయుధ సంపత్తి అమెరికాకు తెలియదని, తాము ఎప్పుడైనా విరుచుకుపడగలమని ఇరాన్ ఆర్మీ ధీమా వ్యక్తం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా, బలమైన ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ పోరు ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళనతో గమనిస్తున్నాయి.

CR Reddy

CR Reddy

Next Story