Middle East Crisis : అమెరికా మధ్యవర్తిత్వం విఫలం? హిజ్బుల్లా తిరస్కరణతో మళ్లీ మొదలైన యుద్ధం

Middle East Crisis : బేరూత్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతికారంగా ఇరాన్ దేశం ఇజ్రాయెల్‌పై భారీగా మిసైల్ దాడికి దిగింది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.

CR Reddy
Published on: 8 Jun 2026 6:45 AM IST
Middle East Crisis
X

Middle East Crisis

Middle East Crisis : మిడిల్ ఈస్ట్‌లో కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇరాన్ దేశం ఇజ్రాయెల్‌పై ఆదివారం రాత్రి క్షిపణుల దాడికి దిగింది. ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభంలో ఇరు పక్షాల మధ్య కుదిరిన సున్నితమైన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత, ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే మొదటిసారి. ఈ తాజా దాడితో పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఘాతం తగిలింది. బేరూత్‌లోని నివాస ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాము ఈ చర్య తీసుకున్నట్లు టెహ్రాన్ ప్రకటించింది.

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడానికి ఇజ్రాయెల్ చర్యలే కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది. ఆదివారం పగటిపూట ఉత్తర ఇజ్రాయెల్‌పై ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా గ్రూప్ జరిపిన కాల్పులకు సమాధానంగా.. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ రాజధాని బేరూత్‌లోని దక్షిణ శివారు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. అమెరికా పర్యవేక్షణలో లెబనాన్-ఇజ్రాయెల్ ప్రభుత్వాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే ఈ ఘర్షణలు జరగడం గమనార్హం. అయితే ఈ శాంతి ఒప్పందాన్ని హిజ్బుల్లా మొదటి నుంచీ తిరస్కరిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడిలో బేరూత్‌లోని ఒక నివాస భవనం ధ్వంసమై ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు.

ఇరాన్ తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన క్షిపణులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) ప్రకటించింది. తమ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆ మిసైళ్లను గాల్లోనే గుర్తించి విజయవంతంగా కూల్చేశాయని వెల్లడించింది. మరోవైపు ఇరాన్ సైన్యం మాత్రం ఇజ్రాయెల్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. లెబనాన్‌పై దాడులను తక్షణమే ఆపకపోతే, రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ ఇంతకంటే ఘోరమైన, వినాశకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది. ఇజ్రాయెల్ అన్ని అంతర్జాతీయ సరిహద్దులను, నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఇరాన్ మండిపడింది.

ఈ ఘర్షణపై ఇరాన్ టాప్ మిలిటరీ విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) స్పందిస్తూ.. అన్ని రకాల యుద్ధ రంగాల్లోనూ కాల్పుల విరమణ అమలు చేయాలనే నిబంధనపైనే తాము గతంలో అమెరికాతో అంగీకారానికి వచ్చామని గుర్తు చేసింది. కానీ లెబనాన్‌లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్యలు ఆ ఒప్పందానికి పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఇరాన్ చేసిన ఈ క్షిపణి దాడిపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశ కుడిపక్ష జాతీయ భద్రతా మంత్రి ఇతామార్ బెన్-గవిర్ స్పందిస్తూ.. ఈ దుశ్చర్యకు గానూ టెహ్రాన్ నగరం తగలబడాల్సిందే అంటూ అత్యంత ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story