US Iran Conflict : సీజఫైర్ ఒప్పందం బ్రేక్.. ఇరాన్ లక్ష్యంగా అమెరికా మెరుపు దాడులు

US Iran Conflict : అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ఇప్పుడు ఉల్లంఘనకు గురైంది.

CR Reddy
Published on: 28 Jun 2026 7:52 AM IST
US Iran Conflict
X

US Iran Conflict 

US Iran Conflict : అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి. ఇటీవలే కుదిరిన శాంతి ఒప్పందం కాగితాలకే పరిమితమైందా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడటంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తన సైన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, అమెరికా బలగాలు ఇరాన్ డ్రోన్ స్టోరేజ్, కమ్యూనికేషన్ టవర్లు, మిస్సైల్ లాంచింగ్ ప్యాడ్‌లను లక్ష్యంగా చేసుకుని మెరుపు దాడులు చేశాయి.

అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ఇప్పుడు ఉల్లంఘనకు గురైంది. హోర్ముజ్ జలసంధి గుండా రెండు మిలియన్ల బ్యారెళ్ల చమురును తీసుకెళ్తున్న కికు అనే పనామా ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం నాటి దాడుల తర్వాత ఇరాన్ తన పద్ధతిని మార్చుకుంటుందని అమెరికా భావించినా, శనివారం కూడా ఇదే తరహా దాడులు కొనసాగడంతో అమెరికా తన సైనిక శక్తిని ఉపయోగించాల్సి వచ్చింది.

ఈ దాడులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. అమెరికన్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) నివేదిక ప్రకారం.. అమెరికా తన యుద్ధ విమానాలు, క్షిపణులతో ఇరాన్‌కు చెందిన కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ సైట్స్, డ్రోన్ నిల్వ కేంద్రాలను ధ్వంసం చేసింది. ఇరాన్ వైపు నుంచి జరిగిన ఏ చిన్న పొరపాటునైనా కఠినంగా అణచివేయాలని అమెరికా భావిస్తోంది. "హింసకు హింసతోనే సమాధానం చెప్తాం" అని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వన్స్ స్పష్టం చేశారు.

మరోవైపు, ఇరాన్ తన వంతుగా స్పందిస్తూ, తమ టెలికమ్యూనికేషన్ టవర్లపై అమెరికా క్షిపణులు పడ్డాయని, దీనివల్ల భారీ పేలుళ్లు సంభవించాయని పేర్కొంది. అయితే, వాణిజ్య నౌకలపై తాము చేసిన దాడుల గురించి ఇరాన్ ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. దక్షిణ సిరిక్ నగరం సమీపంలో భారీ పేలుళ్ల శబ్దాలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.

హోర్ముజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. ప్రతిరోజూ లక్షలాది బ్యారెళ్ల చమురు ఇక్కడ నుంచే సరఫరా అవుతుంది. ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా తన నౌకాదళాన్ని అప్రమత్తం చేసి, వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించేలా పహారా కాస్తోంది. ట్రంప్ తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేయడంతో, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story