US vs Iran : హోర్ముజ్ జలసంధిలో హైటెన్షన్.. ఇరాన్ నౌకలపై అమెరికా సైన్యం కాల్పులు

US vs Iran : హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకలపై అమెరికా కాల్పులు జరిపింది. నౌకాబందీ ఉల్లంఘించినందుకు మూడు ఓడలను అడ్డుకున్న యూఎస్ సెంట్రల్ కమాండ్. ఉద్రిక్తతల మధ్య ఇరాన్ ప్రతిదాడి వీడియో విడుదల చేసింది.

CR Reddy
Published on: 9 May 2026 9:23 AM IST
US vs Iran
X

US vs Iran

US vs Iran : మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. అమెరికా పంపిన యుద్ధవిరామ ప్రతిపాదనపై ఇరాన్ స్పందన కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తున్న వేళ, అగ్రరాజ్యం తీసుకున్న ఒక నిర్ణయం సంచలనం రేపుతోంది. అమెరికా విధించిన నౌకాబందీ (బ్లాకేడ్)ను ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన ఇరాన్ ఓడలపై యూఎస్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ పరిణామం శాంతి చర్చలపై నీళ్లు చల్లేలా కనిపిస్తోంది. యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‎లో తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ వైపు వెళ్తున్న రెండు ఖాళీ చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం కాల్పులు జరిపి వాటిని అడ్డుకుంది. అమెరికా విధించిన నౌకాబందీని ఈ నౌకలు ఉల్లంఘించేందుకు ప్రయత్నించడమే ఇందుకు కారణం. బుధవారం కూడా ఇరాన్ జెండా ఉన్న మరో ఓడను అమెరికా దళాలు పనిచేయకుండా నిలిపివేశాయి. ఈ మూడు నౌకలు ప్రస్తుతం ఇరాన్ వైపు వెళ్లడం లేదని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.

ఎఫ్-18 సూపర్ హార్నెట్ విశ్వరూపం

మే 6వ తేదీన ఒమన్ గల్ఫ్‌లో ఇరాన్ రేవు వైపు వెళ్తున్న M/T Hasna అనే నౌకను అమెరికా యుద్ధ విమానం అడ్డుకుంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ (CVN 72) యుద్ధ నౌక నుంచి ఎగిరిన F/A-18 Super Hornet విమానం.. 20mm మెషీన్ గన్ తో సదరు ట్యాంకర్ రడర్ (చుక్కాని) పై కాల్పులు జరిపి దాన్ని మొరాయించేలా చేసింది. దీంతో ఆ ఓడ ప్రయాణాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పటివరకు అమెరికా నేవీ దాదాపు 50కి పైగా ఓడలను అడ్డుకుని వాటి మార్గాన్ని మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇరాన్ ప్రతి దాడి.. వీడియో విడుదల

అమెరికా చర్యలకు ఇరాన్ కూడా దీటుగానే స్పందిస్తోంది. అమెరికా యుద్ధ నౌకపై తాము క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ సైన్యం ఒక వీడియోను విడుదల చేసింది. ఇరాన్ క్షిపణుల దాడికి భయపడి అమెరికా నౌక అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చిందని ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. శాంతి ఒప్పందం కోసం ఒకవైపు చర్చలు జరుగుతుండగానే, మరోవైపు సముద్రంలో ఇలాంటి దాడులు జరగడం పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

హోర్ముజ్ వద్ద భారీ భద్రత

హోర్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణాను పూర్తిగా తమ అదుపులోకి తీసుకోవాలని అమెరికా భావిస్తోంది. ఇరాన్ లోపలికి వచ్చే లేదా బయటకు వెళ్లే నౌకలను నిశితంగా పరిశీలిస్తున్నామని సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. ఇక్కడ మోహరించిన అమెరికా సైనికులు నిరంతరం పహారా కాస్తున్నారని, నియమాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story