Middle East Oil Crisis: తీరని దాహం... అంతా కల్లోలం
ప్రస్తుతం పశ్చిమాసియా ఒక అగ్నిగుండంలా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల నిద్రను పోగొడుతున్నాయి.
Middle East Oil Crisis: ప్రస్తుతం పశ్చిమాసియా ఒక అగ్నిగుండంలా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల నిద్రను పోగొడుతున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా 'ఫ్రీడమ్ ప్రాజెక్ట్' పేరుతో రంగంలోకి దిగడం, దానికి ఇరాన్ ససేమిరా అనడంతో యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి.
హోర్ముజ్ జలసంధి - ప్రపంచానికి చమురు గొంతుక
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20% నుండి 30% వరకు ఒక్క హోర్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ప్రతిరోజూ ఇక్కడి నుండి సుమారు 100కు పైగా భారీ ఆయిల్ ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు ప్రయాణిస్తుంటాయి. అయితే, తాజా ఉద్రిక్తతల వల్ల ఈ మార్గంలో నౌకల రాకపోకలు స్తంభించిపోయాయి. అదే సమయంలో ఫ్రీడమ్ ప్రాజెక్ట్ నేపథ్యంలో అమెరికా సైన్యం ఇరాన్ నౌకలపై కాల్పులు జరిపిందన్న వార్తలు మంటకు ఆజ్యం పోశాయి.
ఆకాశాన్నంటుతున్న ధరలు.. సామాన్యుడిపై భారం
చమురు సరఫరాలో అంతరాయం కలగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీని ప్రభావం నేరుగా దేశాలపై పడుతోంది. నిత్యం వాహనాలు వాడే సామాన్యుడు పెట్రోల్ బంకుకు వెళ్లాలంటేనే వణికిపోతున్నాడు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతానికి భారత్‌లో పెట్రోల్ ధరలు అదుపులో ఉన్నా...పొరుగు దేశాల్లో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. చమురు ధరలు పెరగడం వలన రవాణా ఖర్చులు కూడా పెరిగిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ద్రవ్యోల్భణం కూడా పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు, చమురుపై ఆధారపడిన పరిశ్రమలు కుంటుపడ్డాయి. దీంతో ఆయా దేశాల ఆర్థిక వృద్ధిరేటు కూడా పడిపోయింది.
పరిష్కారం లేని పంతం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను ప్రతిపాదించిన ఒప్పందాలపై ఇరాన్ సంతకం చేయాల్సిందేనని పట్టుబడుతుండగా, ఇరాన్ మాత్రం తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. ఈ రెండు దేశాల పంతాల మధ్య ప్రపంచ దేశాలు 'చమురు దాహం'తో అల్లాడిపోతున్నాయి. నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే ప్రపంచం మరో భారీ ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది.పశ్చిమాసియాలో శాంతి నెలకొంటేనే సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ఉంటుంది. ఈ కల్లోలం ఎప్పుడు చల్లారుతుందో వేచి చూడాలి.




