Middle East War:యుద్ధం కాదు...మరణాలే భయం
ఫిబ్రవరి 28, 2026న అమెరికా - ఇజ్రాయిల్ దళాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. అప్పటి నుంచి మధ్యప్రాచ్యం అగ్నిగుండంగా మారిపోయింది.
Middle East War: ఫిబ్రవరి 28, 2026న అమెరికా - ఇజ్రాయిల్ దళాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. అప్పటి నుంచి మధ్యప్రాచ్యం అగ్నిగుండంగా మారిపోయింది. కేవలం రెండు నెలల కాలంలోనే ఇరాన్, లెబనాన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ప్రస్తుతం యుద్ధంలో గెలుపొటముల కంటే కూడా సామాన్య ప్రజల మరణాలే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.
రక్తసిక్తమైన గణాంకాలు - ఎక్కడెక్కడ ఎంతమంది?
తాజా నివేదికల ప్రకారం, యుద్ధం వల్ల కలిగిన ప్రాణ నష్టం అత్యంత భయంకరంగా ఉంది. మరణించిన వారిలో పసిబిడ్డల నుండి వృద్ధుల వరకు అందరూ ఉన్నారు. యుద్ధం, మరణాల ప్రభావం ఎక్కువగా ఇరాన్‌లోనే సంభవించింది. ఇప్పటి వరకు ఇరాన్‌లో 3468 మంది మరణించగా...26500 మందికి పైగా గాయపడ్డారు. ఇక మృతుల్లో 376 మంది చిన్నారులు కూడా ఉండటం హృదయవిదారకం. ఇకపోతే ఇజ్రాయిల్ లెబనాన్‌పై జరిపిన దాడుల్లో సుమారు 2702 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 లక్షల మంది వరకు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయినట్టుగా అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలియజేస్తున్నాయి. ఇరాన్ జరిపిన ఎదురుదాడి కారణంగా యూఏఈ, సౌదీ, కువైట్, బహ్రెయిన్, ఒమన్ దేశాల్లో కూడా మరణాలు సంభవించాయి. యూఏఈలో 12 మంది, ఇరాక్‌లో 118మంది, ఇజ్రాయిల్‌లో 26 మంది మరణించారు. ఇక ఇజ్రాయిల్‌లో 7791 మంది గాయపడినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.
సైనిక వ్యూహాలు - ప్రాణాంతక దాడులు
ఇకపోతే, అమెరికా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ద్వారా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నౌకలను నడిపించాలని చూస్తుండగా...ఇరాన్ దానిని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఇరాన్ సైన్యం గల్ప్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నది. అంతేకాదు, బహ్రెయిన్‌లోని అమెరికాకు చెందిన నౌకాదళ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ పదేపదే దాడులు చేస్తున్నది.
మధ్య ప్రాచ్యంలో అమెరికా బలగాలు
మధ్య ప్రాచ్యంలోని సుమారు 19 ప్రాంతాల్లో అమెరికాకు సైనిక స్థావరాలు ఉన్నాయి. ఖతార్, బహ్రెయిన్, కువైట్ దేశాల్లో అత్యధికంగా 40,000 నుండి 50,000 మంది అమెరికా సైనికులు మొహరించి ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన పోరాటంలో 13 మంది అమెరికా సైనికులు మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. అయితే, భారీ స్థాయిలో సైన్యం గాయపడినట్టుగా తెలుస్తోంది.
యుద్ధం కారణంగా శాంతికి విఘాతం కలుగుతుంది. క్షిపణుల మోత, డ్రోన్ల దాడుల మధ్య సామాన్యులు బలిపశువులుగా మారుతున్నారు. మధ్యప్రాచ్యం అంతులేని ఓ విషాదంలోకి కూరుకుపోయింది. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే మరణాల సంఖ్య ఊహించని స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలని, ఆ దిశగా దేశాలు ఆలోచనలు చేయాలని కోరుకుందాం.




