సైనిక చర్యకు యుద్ధానికి తేడా ఏంటి? అమెరికా ఎందకు యుద్ధం అనే పదం వాడటం లేదు?

అంతర్జాతీయ రాజకీయాల్లో 'యుద్ధం', 'సైనిక చర్య' అనే పదాల మధ్య వ్యత్యాసం భారీగా ఉంటుంది. రెండూ ఒకటేలా కనిపించినా...దాని వెనుక ఉన్న అర్థాలు వేరుగా ఉంటాయి.

Balachander
Published on: 28 April 2026 10:21 AM IST
సైనిక చర్యకు యుద్ధానికి తేడా ఏంటి? అమెరికా ఎందకు యుద్ధం అనే పదం వాడటం లేదు?
X

Military Action vs War: అంతర్జాతీయ రాజకీయాల్లో 'యుద్ధం', 'సైనిక చర్య' అనే పదాల మధ్య వ్యత్యాసం భారీగా ఉంటుంది. రెండూ ఒకటేలా కనిపించినా...దాని వెనుక ఉన్న అర్థాలు వేరుగా ఉంటాయి. యుద్ధం అంటే ఒక దేశంపై అధికారికంగా ప్రకటించే పోరాటం కాగా, సైనిక చర్య అనేది పరిమిత లక్ష్యాలతో చేసే దాడి. అమెరికా వంటి అగ్రరాజ్యాలు తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే 'యుద్ధం' అనే పదాన్ని వాడకుండా జాగ్రత్త పడుతుంటాయి. ఇప్పుడు ఇరాన్‌ చేస్తున్నది యుద్ధం అని మనం అనుకుంటున్నా...దానిని అమెరికా కేవలం సైనిక చర్యగా మాత్రమే చెబుతున్నది. మూడు పక్కల నుంచి అంటే భూతల, గగన, సముద్ర మార్గాల ద్వారా పోరాటం చేస్తే అది యుద్ధం అవుతుంది. అంతేకాదు, అమెరికా రాజ్యాంగం ప్రకారం సైనిక చర్యలకు కేవలం 60 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. 60 రోజుల తరువాత దానికి సంబంధించిన పూర్తి రిపోర్ట్‌ కాంగ్రెస్‌కు అందజేయాలి. తనకు ఎలాంటి కాలపరిమితి లేదని ట్రంప్‌ చెబుతున్నా..ఆయన మెడచుట్టూ రాజ్యాంగం బిగించిన ఉచ్చు ఉన్నది.

యుద్ధం అంటే ఏమిటి?

సాధారణంగా రెండు దేశాలు ముఖాముఖి తలపడటాన్ని మనం యుద్ధం అంటాం. అయితే, అంతర్జాతీయ చట్టాల ప్రకారం ముఖ్యంగా జెనీవా కన్వెన్షన్ ప్రకారం... ఒక దేశం మరో దేశంపై 'యుద్ధం ప్రకటిస్తే' దానికి కొన్ని కఠినమైన నిబంధనలు వర్తిస్తాయి. యుద్ధం ప్రకటించిన తర్వాత శత్రు దేశ సైనికులను చంపడం, పౌరుల రక్షణ, యుద్ధ ఖైదీల పట్ల ప్రవర్తన వంటి అంశాల్లో అంతర్జాతీయ కోర్టులకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతుంది. యుద్ధాన్ని ప్రకటించిన దేశం నష్టపోయిన దేశాన్ని చక్కదిద్దాలి. అక్కడ మౌలిక వసతులు కల్పించాలి. నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. యుద్ధం కోసం ఎంత ఖర్చు చేస్తుందో...దానికి మించేలా నిర్మాణానికి ఖర్చు చేయవలసి ఉంటుంది. అందుకే అధికారికంగా యుద్ధం అనే పదాన్ని వాడకుండా సైనిక చర్య అని మాత్రమే పేర్కొంటోంది.

సైనిక చర్య అంటే ఏమిటి?

దీనినే 'లిమిటెడ్ మిలిటరీ యాక్షన్' అని కూడా అంటారు. ఇది ఒక దేశం మొత్తం మీద కాకుండా, నిర్దిష్టమైన ఉగ్రవాద స్థావరాల మీదో లేదా చిన్న ప్రాంతం మీదో చేసే దాడి. దీనికి అధికారికంగా యుద్ధ ప్రకటన అవసరం లేదు. ఉదాహరణకు, 2011లో పాకిస్థాన్‌లో ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకోవడానికి అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఒక సైనిక చర్య మాత్రమే, అది పాకిస్థాన్‌పై చేసిన యుద్ధం కాదు. కానీ, ఇప్పుడు ఇరాన్‌ చేపడుతున్న సైనిక చర్య పూర్తిగా భిన్నంగా ఉండటంతో యుద్ధం చేస్తోందని అంటున్నారు. ఇరాన్‌ కూడా తమకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది.

అమెరికా ఎందుకు 'యుద్ధం' అనే పదాన్ని వాడదు?

అమెరికా గత కొన్ని దశాబ్దాలుగా వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల్లో పోరాడుతున్నా, వాటిని అధికారికంగా 'యుద్ధాలు' అని పిలవడానికి ఇష్టపడదు. ఇప్పుడు ఇరాన్‌పై యుద్ధం చేస్తున్నా...దీనిని మిలటరీ ఆపరేషన్‌ అనే చెబుతున్నదిగాని యుద్ధం అని చెప్పడం లేదు. దీని వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి:

మొదటిది రాజ్యాంగ పరమైన చిక్కులు. అమెరికా రాజ్యాంగం ప్రకారం, ఒక దేశంపై యుద్ధం ప్రకటించాలంటే అక్కడి 'కాంగ్రెస్' అనుమతి తప్పనిసరి. కానీ 'సైనిక చర్య' చేపట్టడానికి అధ్యక్షుడికి స్వతంత్ర అధికారాలు ఉంటాయి. కాంగ్రెస్ ఆమోదం కోసం వేచి చూడకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి 'మిలిటరీ ఆపరేషన్' అనే పదం వారికి సౌకర్యంగా ఉంటుంది. చేస్తున్నది యుద్ధమే అయినా మాట మార్చి వాడటంతో అధికారాలు అధ్యక్షుడి చేతిలో ఉంటాయి.

రెండోది ఆర్థిక, బాధ్యత. యుద్ధం అని ప్రకటిస్తే, ఆ దేశాన్ని పునర్నిర్మించే బాధ్యత, అక్కడి పౌరుల నష్టపరిహారం వంటివి అంతర్జాతీయ చట్టాల ప్రకారం అగ్రరాజ్యంపై పడతాయి. కేవలం సైనిక చర్య అని చెప్పడం ద్వారా తమ లక్ష్యం నెరవేరగానే వెనక్కి వచ్చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు, సైనిక చర్య చేపట్టడం మొదలుపెట్టిన 60 రోజుల్లో దానికి సంబంధించిన పూర్తి రిపోర్ట్‌ను కాంగ్రెస్‌కు అందజేయాలి. ఒకవేళ సైనికచర్య సమయం పెంచాలన్నా, నిధులు కావాలన్నా కాంగ్రెస్‌ అనుమతి అవసరం ఉంటుంది. దీనినే ట్రంప్‌ తప్పు పడుతున్నాడు. రాజ్యాంగంలో కాంగ్రెస్‌ అనుమతిని తొలగించాలని పట్టుబడుతున్నారు.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, అమెరికా అధికారికంగా ఏ దేశంపై కూడా 'యుద్ధం' ప్రకటించలేదు. కొరియా యుద్ధం నుండి నేటి ఇరాన్‌ వరకు వారు చేసిన పోరాటాలన్నీ 'పోలీస్ యాక్షన్' లేదా 'మిలిటరీ ఆపరేషన్స్' పేరుతోనే సాగాయి. దాడులు చేసి పక్కకు తప్పుకోవడంతో నష్టపోయిన దేశాలు తమను తాము పునర్నిర్మించుకోవడానికి దశాబ్ధాల సమయం పడుతున్నది. ఇప్పటికైనా అమెరికా సైనిక చర్యల పేరుతో దేశాలను ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story